పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న చెత్తలో ప్లాస్టిక్ సమస్య అధికమవుతుండడంతో దీనిని నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాలంటూ పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కమిషనర్ వికాస్ దేశ్‌ముఖ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 28, మార్చి 2014 తరువాత వినియోగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ కవరు వినియోగిస్తూ మొట్టమొదటిసారిగా పట్టుబడ్డ వారికి రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. నగరంలో ప్లాస్టిక్ బ్యాగులను కూరగాయలు, పండ్లు, విక్రయదారులతోపాటు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా వినియోగదారులకు చేరవేస్తున్నారు. నగరంలో ప్రతి రోజూ జమ అయ్యే చెత్తలో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీనితో నగరంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ను వర్గీకరించే విషయంలో సమస్యలు అధికమవుతుండడంతో దీనిని నియంత్రించాలని నిర్ణయించారు. 50 మైక్రాన్‌ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను రూ. 15 లకు అమ్మాలని, థర్మాకోల్ గ్లాసులు, ప్లేట్లను నిషేధించాలంటూ ఇటీవల కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానించిన సంగతి విదితమే.
విలీనంపై 18న నిర్ణయం
చకాన్ సహా మొత్తం 20 గ్రామాల విలీనం విషయమై ఈ నెల 18వ తేదీన పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీఎంసీ పరిధిలోని గ్రామాలను కచ్చితంగా విలీనం చేయాల్సిందేనా లేకపోతే ఆ అవసరమేమీ లేదా అనే అంశంపై ఓ నివేదిక సమర్పించాలంటూ గత ఏడాది ఆగస్టులో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ)ని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. చ కాన్‌ను కొత్త మున్సిపల్ కౌన్సిల్‌గా మార్చేకంటే విలీనమే ఉత్తమమని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. ఇందుకు స్పందించిన పీసీఎంసీ..సిటీ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనపై చర్చించి, దానిని సర్వసభ్య సమావేశానికి నివేదిస్తుందంటూ జవాబిచ్చింది. అయితే హింజేవాడి, మాన్ తదితర గ్రామాలు అప్పట్లో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ కావాలని డిమాండ్ చేశాయి.
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తాతవాడే తదితర గ్రామాల విలీనాన్ని అక్కడి ప్రజలు, నాయకులు 1997లో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు వారిలో కొంతమార్పు వచ్చిందన్నారు. 2009లో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. కాగా పీసీఎంసీకి చెందిన అనేకమంది కార్పొరేటర్లు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయం విదితమే.
పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
Published Sat, Mar 1 2014 10:51 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM
Advertisement
Advertisement