Tiger Reserve Forest Zone
-
పచ్చదనం.. ఏపీలో ఘనం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లలో మన రాష్ట్రంలో 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశవ్యాప్తంగా 1,540 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరగ్గా.. అందులో ఎక్కువ భాగం మనదే. ఏపీ తర్వాత 632 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదలతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. ఇటీవల విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా–2021 నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సర్వే నిర్వహిస్తారు. 2019లో దేశవ్యాప్తంగా సర్వే జరగ్గా.. తాజాగా గత ఏడాది నిర్వహించిన 2021 సర్వే నివేదికను ఇటీవల విడుదల చేశారు. 2019లో నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 29,137 చదరపు కిలోమీటర్లు కాగా.. 2021 సర్వేలో అది 29784 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దట్టమైన అడవుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఓ మాదిరి దట్టమైన అడవులు మాత్రం 9 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. ఓపెన్ ఫారెస్ట్ 656 చదరపు కిలోమీటర్ల మేర పెరగడంతో మొత్తం 647 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి పచ్చదనం పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలే కారణమని సర్వే నివేదిక పేర్కొంది. చెట్ల నరికివేతను నివారించడం, అడవిని పెంచేందుకు ప్రయత్నించడంతోపాటు పెద్దఎత్తున చెట్ల నాటే కార్యక్రమం చేపట్టడం వల్ల అటవీ విస్తీర్ణం పెరిగినట్లు స్పష్టమైంది. ఆగ్రో ఫారెస్ట్రీ పెరుగుదల కూడా విస్తీర్ణం పెరగడానికి ఒక కారణమని తేలింది. అనేక రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా.. మన రాష్ట్రంలో మాత్రం పెరగడానికి పర్యావరణంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కేటగిరీల వారీగా ఇలా.. రాష్ట్రంలో 2019లో దట్టమైన అటవీ ప్రాంతం 1,994 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా.. ఓ మాదిరి దట్టమైన అటవీ ప్రాంతం 13,938 చదరపు కిలోమీటర్ల మేర ఉండేది. అప్పట్లో ఓపెన్ ఫారెస్ట్ 13,205 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. ఆప్పట్లో మొత్తంగా అటవీ ప్రాంతం 29,137 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. 2021 నాటికి దట్టమైన అటవీ ప్రాంతం 1,994 చదరపు కిలోమీటర్ల మేర స్థిరంగా ఉండగా.. ఓ మాదిరి దట్టమైన అటవీ ప్రాంతం 9 చదరపు కిలోమీటర్లు తగ్గి 13,929 చదరపు కిలోమీటర్లకు చేరింది. కాగా, ఓపెన్ ఫారెస్ట్ 13,861 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో అటవీ ప్రాంత విస్తీర్ణం 29,784 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తంగా 2019తో పోలిస్తే 2021 నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 647 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లోనూ మనమే టాప్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పెరుగుదలలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 52 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ ముందుండటం విశేషం. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ కారిడార్ పరిధిలో అటవీ విస్తీర్ణం 23.88 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. 2011లో నిర్వహించిన సర్వేలో (ఐఎఫ్ఎస్ఆర్) 550.70 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ఈ విస్తీర్ణం, తాజా సర్వే ప్రకారం 574.58 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే 4.34 శాతం ఫారెస్ట్ కవర్ పెరిగింది. ఈ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లంకమల్లేశ్వరం, పెనుశిల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యాల మీదుగా చిత్తూరు జిల్లా వెంకటేశ్వర జాతీయ పార్కు వరకు విస్తరించింది. ఫలితంగానే 2014లో ఈ కారిడార్‌లో 38 పులులు ఉండగా.. వాటిసంఖ్య ప్రస్తుతం 64కు పెరిగినట్టు నమోదైంది. రాష్ట్రానికే గర్వకారణం అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాం. దీంతో ఓపెన్ ఫారెస్ట్ పెరిగింది. అడవుల పరిరక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండడం, కోవిడ్ ఉన్నా మా సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల పచ్చదనం పెరిగింది. 2023లో జరిగే సర్వేలోనూ మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా పనిచేస్తాం. – ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
-
పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న పెద్దపులి హల్చల్ చేసింది.సరిహద్దు గ్రామం కోపోమాండిలో పులి సంచరించడం అక్కడి స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సంరక్షణ కేంద్రం నుంచి పారిపోయి వచ్చిన పులి బీభత్సం సృష్టించింది. పంట పొలంలోకి దూరిన చిరుత ఒక ఆవు దూడపై దాడి చేసి చంపేసింది. దీనిని చూసిన స్థానిక ప్రజలు కర్రలు,గొడ్డళ్లతో పులిని వెంబడించారు. అయితే అది పొదల్లోకి పారిపోవడంతో పులి జాడ కోసం జల్లెడ పడుతున్నారు. తాజాగా పులి సంచరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
అదిగో పులి..
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల గణన వేగంగా కొనసాగుతోంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో యేటా నిర్వహించే జంతుగణనలో భాగంగా ఈ ఏడాది కూడా జంతు గణన ప్రారంభమైంది. తొలి విడతగా పులులు, అనంతరం ఇతర జంతువులను లెక్కించనున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను బిగించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పర్యవేక్షణలో గణన కొనసాగుతోంది. ముందుగా పులుల గణన దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ కారిడార్లలో ప్రతియేటా అటవీ శాఖ అధికారులు పులుల గణన చేపడతారు. అందులో భాగంగానే తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో పది రోజుల క్రితం గణన ప్రారంభమైం ది. ఇందుకు అడవిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నిక్షిప్తమైన గుర్తుల ప్రకారం వాటి సంఖ్యను లెక్కిస్తారు. పాదముద్రలు, విసర్జితాలు, ఇతర అవశేషాలను సైతం లెక్కలోకి తీసుకొని జంతువుల గణన చేపడతారు. 3,027.53 చ.కి.మీలలో అభయారణ్యం నల్లమల అటవీ ప్రాంతం సుమారు 3,563 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా అందులో 3,027.53 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం ఉంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 150 రకాల జంతువులు, 60 రకాల పక్షులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించి గణన చేపట్టారు. మన్ననూర్, దోమలపెంట రేంజ్‌ను మొదటి బ్లాక్‌గా, మద్దిమడుగు, అమ్రాబాద్ ప్రాంతాలను రెండో బ్లాక్‌గా విభజించారు. బ్లాక్–1లో 100 కెమెరాలు, బ్లాక్–2 లో 117 సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పదిరోజులుగా కెమెరా ల్లో నిక్షిప్తమైన అటవీ జంతువుల వివరాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. 134 మంది సిబ్బంది 700 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో తిరుగు తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ముందుగా నెలరోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు. గతేడాది లెక్కల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 20 పెద్దపులులు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. కవ్వాల్‌లో.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని కాగజ్‌నగర్, బెల్లపల్లి డివిజన్లలో అటవీ ప్రాంతంలో 120 చోట్ల 240 కెమెరాలను అమర్చారు. జన్నారం, చెన్నూర్ డివిజన్లలోనూ లెక్కింపు కొనసాగుతోంది. చెన్నూర్‌లో 3, జన్నారంలో ఒకటి, కాగజ్‌నగర్‌లో 5 వరకు పులులు ఉన్నట్లు తెలిసింది. గణన అనంతరం పులుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. గణన కొనసాగుతోంది అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని వన్యప్రాణుల గణనకు ఏర్పాట్లు చేశాం. అటవీశాఖ పర్యవేక్షణలో హిట్కాస్ సంస్థ ఎన్జీవో సభ్యులు కూడా గణనలో పాల్గొంటున్నారు.– జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ సీసీ ట్రాప్ కెమెరాలతో పరిశీలిస్తున్నాం అమ్రాబాద్ అభయారణ్యంలో బిగించిన సీసీ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తులను పరిశీలించి పులుల లెక్కింపు చేపడుతున్నాం. ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులులను లెక్కిస్తున్నాం. – బాపురెడ్డి,రీసెర్చ్ ఆఫీసర్, ఎన్టీసీ, అమ్రాబాద్ ఇన్చార్జ్ నల్లమలలో 2018లో గుర్తించిన వన్యప్రాణుల సంఖ్య పెద్ద పులులు: 20 చుక్కల దుప్పులు: 3,040 కణితి: 4,608 అడవి పందులు: 2,272 కొండ గొర్రెలు: 1,072 మనుబోతులు: 480 బుర్ర జింకలు: 1,888 కొండ ముచ్చులు: 11,600 -
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఏటూరునాగారం
వన్యప్రాణి విభాగాన్ని కూడా తరలించాలి పీసీసీఎఫ్‌కు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు హన్మకొండ అర్బన్ : అంతరించి పోతున్న అటవీ జంతు జాతులను సంరక్షించుకునేందుకు ఏటూరునాగారం అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అటవీ దళాధిపతుల ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి పీ.కే.శర్మను కోరారు. శనివారం జిల్లాకు వచ్చిన శర్మను కలెక్టర్ కరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. అటవీశాఖ పరంగా జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచారు. ముఖ్యంగా జిల్లాలో వ్యప్రాణి విభాగం ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని, కొత్తగూడ ప్రాంతంలోని సౌత్ డివిజన్ పరిధిలోకి వచ్చే కొంత అటవీ భాగం కూడా ఏటూరునాగారం వన్యప్రాణి విభాగంలో చేర్చాలని కోరారు. తద్వారా ఏటూ రునాగారం అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా హరిత హారం ప్లాంటేషన్‌కు సంబంధించి నర్సరీలపై ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. స్మృతివనం, పచ్చదనంపై.. వరంగల్ నగరంలోని బెస్తం చెరువు ప్రాంతం లో ఏర్పాటు చేయనున్న స్మృతివనం విషయం లో అటవీశాఖ పరంగా చర్యలు తీసుకోవాలని, మేడారం పరిసరాల్లో 165 ఎకరాల విస్తీర్ణంలో హరితహారంలో భాగంగా పచ్చదనం పెంచేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వరంగల్ వన విజ్ఞాన కేంద్రం సమీపంలోని సుమారు 70 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కరుణ శర్మకు వివరించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించి న శర్మ శాఖపరంగా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లాలో అటవీశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సీఎఫ్ రాజారావు, అక్బ ర్, డీఎఫ్ఓలు పురుషోత్తం, నాయక్ , ఎఫ్ఆర్వోలు, అధికారులు పాల్గొన్నారు.