సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లలో మన రాష్ట్రంలో 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశవ్యాప్తంగా 1,540 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరగ్గా.. అందులో ఎక్కువ భాగం మనదే. ఏపీ తర్వాత 632 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదలతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. ఇటీవల విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా–2021 నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సర్వే నిర్వహిస్తారు. 2019లో దేశవ్యాప్తంగా సర్వే జరగ్గా.. తాజాగా గత ఏడాది నిర్వహించిన 2021 సర్వే నివేదికను ఇటీవల విడుదల చేశారు.
2019లో నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 29,137 చదరపు కిలోమీటర్లు కాగా.. 2021 సర్వేలో అది 29784 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దట్టమైన అడవుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఓ మాదిరి దట్టమైన అడవులు మాత్రం 9 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. ఓపెన్ ఫారెస్ట్ 656 చదరపు కిలోమీటర్ల మేర పెరగడంతో మొత్తం 647 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.
మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి పచ్చదనం పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలే కారణమని సర్వే నివేదిక పేర్కొంది. చెట్ల నరికివేతను నివారించడం, అడవిని పెంచేందుకు ప్రయత్నించడంతోపాటు పెద్దఎత్తున చెట్ల నాటే కార్యక్రమం చేపట్టడం వల్ల అటవీ విస్తీర్ణం పెరిగినట్లు స్పష్టమైంది. ఆగ్రో ఫారెస్ట్రీ పెరుగుదల కూడా విస్తీర్ణం పెరగడానికి ఒక కారణమని తేలింది. అనేక రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా.. మన రాష్ట్రంలో మాత్రం పెరగడానికి పర్యావరణంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
కేటగిరీల వారీగా ఇలా..
రాష్ట్రంలో 2019లో దట్టమైన అటవీ ప్రాంతం 1,994 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా.. ఓ మాదిరి దట్టమైన అటవీ ప్రాంతం 13,938 చదరపు కిలోమీటర్ల మేర ఉండేది. అప్పట్లో ఓపెన్ ఫారెస్ట్ 13,205 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. ఆప్పట్లో మొత్తంగా అటవీ ప్రాంతం 29,137 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. 2021 నాటికి దట్టమైన అటవీ ప్రాంతం 1,994 చదరపు కిలోమీటర్ల మేర స్థిరంగా ఉండగా.. ఓ మాదిరి దట్టమైన అటవీ ప్రాంతం 9 చదరపు కిలోమీటర్లు తగ్గి 13,929 చదరపు కిలోమీటర్లకు చేరింది. కాగా, ఓపెన్ ఫారెస్ట్ 13,861 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో అటవీ ప్రాంత విస్తీర్ణం 29,784 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తంగా 2019తో పోలిస్తే 2021 నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 647 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.
టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లోనూ మనమే టాప్
టైగర్ రిజర్వు ఫారెస్ట్ పెరుగుదలలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 52 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ ముందుండటం విశేషం. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ కారిడార్ పరిధిలో అటవీ విస్తీర్ణం 23.88 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. 2011లో నిర్వహించిన సర్వేలో (ఐఎఫ్‌ఎస్‌ఆర్) 550.70 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ఈ విస్తీర్ణం, తాజా సర్వే ప్రకారం 574.58 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే 4.34 శాతం ఫారెస్ట్ కవర్ పెరిగింది. ఈ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లంకమల్లేశ్వరం, పెనుశిల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యాల మీదుగా చిత్తూరు జిల్లా వెంకటేశ్వర జాతీయ పార్కు వరకు విస్తరించింది. ఫలితంగానే 2014లో ఈ కారిడార్‌లో 38 పులులు ఉండగా.. వాటిసంఖ్య ప్రస్తుతం 64కు పెరిగినట్టు నమోదైంది.
రాష్ట్రానికే గర్వకారణం
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాం. దీంతో ఓపెన్ ఫారెస్ట్ పెరిగింది. అడవుల పరిరక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండడం, కోవిడ్ ఉన్నా మా సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల పచ్చదనం పెరిగింది. 2023లో జరిగే సర్వేలోనూ మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా పనిచేస్తాం.
– ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి
Comments
Please login to add a commentAdd a comment