వన్యప్రాణి విభాగాన్ని కూడా తరలించాలి
పీసీసీఎఫ్‌కు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు
హన్మకొండ అర్బన్ : అంతరించి పోతున్న అటవీ జంతు జాతులను సంరక్షించుకునేందుకు ఏటూరునాగారం అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అటవీ దళాధిపతుల ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి పీ.కే.శర్మను కోరారు. శనివారం జిల్లాకు వచ్చిన శర్మను కలెక్టర్ కరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. అటవీశాఖ పరంగా జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచారు. ముఖ్యంగా జిల్లాలో వ్యప్రాణి విభాగం ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని, కొత్తగూడ ప్రాంతంలోని సౌత్ డివిజన్ పరిధిలోకి వచ్చే కొంత అటవీ భాగం కూడా ఏటూరునాగారం వన్యప్రాణి విభాగంలో చేర్చాలని కోరారు. తద్వారా ఏటూ రునాగారం అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా హరిత హారం ప్లాంటేషన్‌కు సంబంధించి నర్సరీలపై ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
స్మృతివనం, పచ్చదనంపై..
వరంగల్ నగరంలోని బెస్తం చెరువు ప్రాంతం లో ఏర్పాటు చేయనున్న స్మృతివనం విషయం లో అటవీశాఖ పరంగా చర్యలు తీసుకోవాలని, మేడారం పరిసరాల్లో 165 ఎకరాల విస్తీర్ణంలో హరితహారంలో భాగంగా పచ్చదనం పెంచేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వరంగల్ వన విజ్ఞాన కేంద్రం సమీపంలోని సుమారు 70 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కరుణ శర్మకు వివరించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించి న శర్మ శాఖపరంగా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లాలో అటవీశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సీఎఫ్ రాజారావు, అక్బ ర్, డీఎఫ్‌ఓలు పురుషోత్తం, నాయక్ , ఎఫ్‌ఆర్‌వోలు, అధికారులు పాల్గొన్నారు.