ప్యాంక్రియాటిక్ స్టోన్స్ శస్త్రచికిత్స ప్రక్రియలు
ప్యాంక్రియాస్ చాలా కీలకమైన విధులు నిర్వహిస్తుంది. అందులో ప్రధానమైనది ఆహారం జీర్ణమయ్యేలా చేయడం. ఇందుకోసం అది తన ప్యాక్రియాటిక్ స్రావాలను విడుదల చేస్తుంది. ప్యాంక్రియాస్ స్రావాలు కలిసే చిన్న పేగుల వరకు ఉండే నాళం చాలా మృదువుగా, ఏకరీతి (రెగ్యులర్)గా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారిలో అది ఏకరీతిగా ఉండక అక్కడక్కడ సన్నబడుతుంది. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ వచ్చిన 22 – 60 శాతం మందిలో ప్యాంక్రియాస్ నుంచి స్రావాలు సరిగా వెలువడక రాళ్లు కూడా రావచ్చు. ఈ రాళ్లు మళ్లీ ప్యాంక్రియాటిక్ స్రావాలను అడ్డగించవచ్చు. ప్యాంక్రియాటిక్ నాళంలో రాళ్లు రావడం గతంలో చాలా అరుదుగానీ ఇటీవల చాలా తరచుగానే కనిపిస్తున్నాయి. వాటిని తొలగించుకోడానికి అవసరమయ్యే శస్త్రచికిత్సల గురించి తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం.
ప్యాంక్రియాటిక్ స్టోన్స్ (రాళ్లు) ఎలా వస్తాయి?
ప్యాంక్రియాస్ స్రావంలోని క్యాల్షియమ్ నిల్వ కావడంతో ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి మళ్లీ జీర్ణప్రక్రియను నిర్వహించాల్సిన స్రావాలకు అడ్డుపడవచ్చు. గాల్‌బ్లాడర్ నుంచి వచ్చే నాళం, ప్యాంక్రియాటిక్ నాళంలో కలిసి ఒకే నాళంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో కూడా రాళ్లు ఏర్పడవచ్చు. ఈ రెండు రకాల రాళ్లలో ఏవైనా సరే ప్యాంక్రియాటిక్ ఎంజైములను అడ్డుకోవచ్చు. దాంతో ఆ స్రావాలు ప్యాంక్రియాస్‌లోని లోపలి పొరలనే దెబ్బతీయవచ్చు.
ఎందుకు వస్తాయి...?
కొందరిలో ఈ రాళ్లు ఎందుకు వస్తాయనే అంశం ఇదమిత్థంగా తెలియదు. అయితే కొన్ని అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి. అవి... కొలెస్ట్రాల్ పెరగడం లేదా పైత్యరసంలో బైలురుబిన్ పెరగడం స్థూలకాయం. ఒకేచోట కూర్చొని పనిచేయడం ∙వయసు పెరగడం డయాబెటిస్ .తీవ్రమైన కాలేయ వ్యాధులు రావడం. కుటుంబ చరిత్రలో గాల్ స్టోన్స్ ఉండటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి.
ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు
ఈ రాళ్లు ఉన్నవారిలో సాధారణంగా పొట్టపైభాగం (అప్పర్ అబ్డామిన్)లో కుడివైపున నొప్పి కనిపిస్తుంది. ఈ నొప్పి వీపు భాగంలోకి కూడా రేడియేట్ అవుతుంటుంది. ఇది సాధారణంగా 15 నిమిషాలు మొదలుకొని కొంతమందిలో తీవ్రమైన నొప్పితో గంటలకొద్దీ బాధించవచ్చు. కొందరిలో వాంతులు కావడం, చెమటలు పట్టడం కూడా సంభవించవచ్చు. వారాలు, నెలలు కొందరిలో సంవత్సరాల తరబడి కనిపించవచ్చు. నొప్పి ఉన్న ప్రాంతాన్ని ముట్టుకోనివ్వనట్లుగా (టెండర్‌నెస్‌తో) ఈ బాధ ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ నొప్పి వస్తున్నవారిలో అజీర్ణం, ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం, మలం కాస్త నూనె కలిసినట్లుగా (ఆయిలీగా), ఒకలాంటి వాసనతో ఉంటుంది. ఈ కండిషన్‌ను స్టియటోరియా అంటారు.
అనర్థాలు: ప్యాంక్రియాటిక్ రాళ్లు ఆహారం జీర్ణం చేయాల్సిన ప్యాంక్రియాటిక్ స్రావాలకు అడ్డుపడటంతో పాటు రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రించే ప్యాంక్రియాటిక్ స్రావాలు సరిగా వెలువడకుండా అడ్డుపడవచ్చు. అది డయాబెటిస్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.
చికిత్స విధానాలు
కొన్నిసార్లు ఈ రాళ్లను మందులతో కరిగించవచ్చు. అయితే రాళ్లు చాలా చిన్న సైజులో ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ స్రావాలతో ఏర్పడ్డ రాళ్ల విషయంలోనే ఈ చికిత్స సాధ్యమవుతుంది. చాలామందిలో రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స విధానాలు అవసరమవుతాయి.
∙కొందరిలో ఈఆర్‌సీపీ అనే ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా రాళ్లను తొలగించవచ్చు. ఈఆర్‌సీపీ ప్రక్రియలో చిన్న పేగు దగ్గర ప్యాంక్రియాటిక్ నాళం కలిసే చోట, ఆ నాళాన్ని కొద్దిగా కట్ చేసి అక్కడి రాళ్లను ఎండోస్కోప్ (కడుపులోకి పంపే గొట్టం) ద్వారా తొలగిస్తారు. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియోటోగ్రఫీ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈఆర్‌సీపీ. ఇందులో ఎండోస్కోపీ ప్రక్రియలో ఒక పలుచటి గొట్టానికి కెమెరా అమర్చి కడుపులోకి పంపించి, ఆ గొట్టం చివర లైట్ వెలిగేలా చేసి, దాని సహాయంతో కడుపులోకి స్పష్టంగా చూస్తూ చికిత్స చేస్తారు. ఈ ఎండోస్కోప్ సహాయంతో కడుపు, చిన్నపేగులు, ఆ మార్గంలో కనెక్ట్ అయ్యే కొన్ని శరీర భాగాలకు అనేక వైద్య పరీక్షలు, చికిత్సలు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. రెట్రోగ్రేడ్ అంటే ఎండోస్కోప్ మార్గంలో ఒక ద్రవం విడుదలయ్యేలా చేసి దాని సహాయంతో ఎక్స్–రేస్ ప్రసరింపజేస్తూ అక్కడి అవయవాలైను చూడటం. కొలాంజియో–ప్యాంక్రియాటోగ్రఫీ అంటే కొలాంజియో అనే బైల్ నాళంలోనూ, ప్యాంక్రియాటోగ్రఫీ అంటే ప్యాంక్రియాస్ భాగాలలో ఎక్స్ కిరణాలసు ప్రసరించేయడం.
⇒ మరికొందరిలో ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్‌వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) అనే ప్రక్రియ ద్వారా రాళ్లను తొలగిస్తారు. ఇందులో రాళ్లను శబ్దతరంగాల సహయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి, అప్పుడు ఈసీఆర్‌పీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈఎస్‌డబ్ల్యూఎల్ అనేది ఇప్పుడు ఔట్‌పేషెంట్ ప్రక్రియగానూ చేస్తున్నారు.
⇒ ఈఎస్‌డబ్ల్యూఎల్ అనే ఈ ప్రక్రియలో పేషెంట్‌ని ఒక నీళ్ల తొట్టిలో బోర్లా పడుకోబెడతారు. కడుపు నీళ్లలో పాక్షికంగా మునిగి ఉండేలా చూస్తారు. శబ్దతరంగాలను వెలువరించే షాక్‌హెడ్స్ పొట్టకు ఆనించి ఉంచి, 2400 నుంచి 3000 వరకు షాక్‌వేవ్స్ వెలువడేలా చూస్తారు. దాంతో ఈ షాక్‌వేవ్‌ల శబ్దతరంగాల తాకిడికి రాళ్లు నుసిగా మారేలా చేస్తారు. ఈ ప్రక్రియకు సాధారణంగా 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. ఒక్కోసారి పొట్టనొప్పి, చాలా అరుదుగా పొట్టకు గాయాలు కావచ్చు. ఈఆర్‌సీపీ, ఈఎస్‌డబ్ల్యూల్ అనేవి శరీరానికి కోట పెట్టకుండా చేసే శస్త్రచికిత్సలు (నాన్–ఇన్వేజివ్) శస్త్రచికిత్స మార్గాలు.
⇒ ఇక పొట్ట భాగంలో కోతతో చేసే సంప్రదాయ సర్జరీ కూడాచేయవచ్చు. అయితే ఈ ప్రక్రియయలో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రోగికి రక్తం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ శస్త్రచికిత్సలో ప్యాంక్రియాస్‌ను ఓపెన్ చేసి, రాళ్లు బయటకు తీసి, ప్యాంక్రియాస్ నాళాన్ని మళ్లీ చిన్నపేగుకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా సంప్రదాయ శస్త్రచికిత్స చేస్తారు కాబట్టి కోలుకోడానికి దాదాపు 10 రోజులు పైగానే ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
డాక్టర్ ఆలోక్ రథ్
కన్సల్టెంట్ జనరల్ సర్జరీ
అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్
హైదరాబాద్