లివర్ సిర్రోసిస్... తగ్గేదెలా? | Liver cirrhosis ... Taggedela? | Sakshi
Sakshi News home page

లివర్ సిర్రోసిస్... తగ్గేదెలా?

Published Tue, Oct 22 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

లివర్ సిర్రోసిస్... తగ్గేదెలా?

లివర్ సిర్రోసిస్... తగ్గేదెలా?

నా వయసు 57. గత నాలుగు నెలలుగా కొద్దిపాటి కడుపునొప్పి, వాంతి, వికారం, ఆకలి సన్నగిల్లటం, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని పరీక్షలు చేసిన పిమ్మట డాక్టర్లు ‘లివర్ సిర్రోసిస్’గా నిర్ధారణ చేసి, మందులిచ్చారు. వాడినా పెద్ద ప్రయోజనం కనబడలేదు. ఈ సమస్యకు ఆయుర్వేదంతో పరిష్కారం సూచించ ప్రార్థన.
 - శరత్‌చంద్ర, బోధన్

 
 కాలేయాన్ని (లివర్) ఆయుర్వేదంలో ‘యకృత్’గా వర్ణించారు. దీనికి సంబంధించిన వ్యాధులు ఉదర రోగాలలో విశదీకరించారు. జీర్ణక్రియ, ధాతు పరిణామ క్రియ, విష నిరహరణ క్రియ వంటి అత్యంత ప్రధాన కర్మలన్నింటికీ ‘యకృత్’ మూలాధారం. ఒక్కమాటలో చెప్పాలంటే దేహపోషణకు, శరీరరక్షణకు ప్రకృతి ప్రసాదించిన ‘రసాయన కర్మాగారం’ కాలేయం. ఆహార విహారాలను అశ్రద్ధ చేయడం, వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల యకృత్ దెబ్బతింటుంది. ఉప్పు, కొవ్వు పదార్థాలను అతిగా తీసుకోవడం, స్థూలకాయం, వ్యాయామం (శ్రమ) లేని జీవనశైలి, కల్తీ ఆహారం, ధూమ మద్యపానాల వంటి మాదకద్రవ్యసేవన, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటివి యకృత్ వ్యాధులకు ప్రధాన కారణాలు. కాలేయ కణాలు నశిస్తూ, క్షీణిస్తూ ఉండటం వల్ల లివర్ పనితీరు దెబ్బతిని, సామర్థ్యవిహీనమవుతుంది. ఇదే ‘సిర్రోసిస్’.
 
ఈ వ్యాధిలోని ఆరంభలక్షణాలు మాత్రమే మీకు ఉన్నాయి. ఇంకా వ్యాధి తీవ్రరూపం దాల్చితే జలోదరం, రక్తపువాంతి, రక్తమొలలు, కిడ్నీ, ఊపిరితిత్తులు పాడవటం కూడా సంభవించవచ్చు. పచ్చకామెర్లు (కామలా) ముందు ప్రారంభమై సరైన చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను లోతుగా పరిశీలించి అనేక ఓషధుల్ని ఆయుర్వేదం విపులీకరించింది. వాటిలో కొన్ని ప్రధానమైనవి:
 
 చిత్రకాదివటి మాత్రలు రెండు పూటలా రెండేసి చప్పరిస్తే వాంతి భ్రాంతి తగ్గి, ఆకలి పుడుతుంది.
 
 త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు):  మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా వేడినీళ్లతో సేవిస్తే అజీర్తి తొలగిపోయి, శోషణ క్రియ మెరుగుపడుతుంది.
 
 త్రిఫలాచూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): ఐదు గ్రాముల మోతాదులో నీటితోగాని, తేనెతోగాని, రెండుపూటలా సేవిస్తే కడుపుబ్బరం తగ్గి, విరేచనం సాఫీగా అవుతుంది. నీరసం తగ్గుతుంది.
 
 కుమార్యాసవ, భృంగరాజాసవ: ఈ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్లు కలిపి, రెండుపూటలా తాగితే యకృత్ క్రియాసామర్థ్యం పెరిగి, కామలా (కామెర్లు) తగ్గుతుంది.
 
 పునర్నవారిష్ట ద్రావకాన్ని నాలుగు చెంచాలు తీసుకుని, సమానంగా నీరు కలిపి మూడుపూటలా తాగితే జలోదరం ఉపశమిస్తుంది.
 
 యకృత్ సామర్థ్య పుష్టికి మూలికలు:
 కుమారీ (కలబంద), భృంగరాజ (గంటగలగర),  భూమ్యామలకీ (నేల ఉసిరిక), ఆమలకీ (ఉసిరిక),  పునర్నవా (గలిజేరు), కటుకరోహిణి, గుడూచి (తిప్పతీగె), చిత్రమూల, కాలమేఘ,  హరిద్ర (పసుపు) మొదలైనవి. ఇక... మూసాంబరం, అడ్డసరం రక్తస్రావాన్ని తగ్గిస్తాయి.
 
 గమనిక: ఏ ఓషధిని, ఏ రూపంలో, ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలో వ్యాధి లక్షణాలను, తీవ్రతను బట్టి ఆయుర్వేద నిపుణులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
 
 ‘యకృత్ పిప్పలి’ అనే మందును చరకసంహితలో పేర్కొన్నారు. దీన్ని కొంతమంది వైద్యనిపుణులు ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఇది బజారులో లభించదు. ఇది సిర్రోసిస్ కోసం మాత్రమే గాక, లివర్ క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల్లో కూడా చక్కని గుణాన్నిచ్చిన దాఖలాలున్నాయి. ఒకసారి మీరు మీకు దగరలో ఉన్న నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement