తెల్లనివన్నీ పాలు కావు..! | What is Synthetic Milk ? | Sakshi
Sakshi News home page

తెల్లనివన్నీ పాలు కావు..!

Published Mon, Dec 1 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

తెల్లనివన్నీ పాలు కావు..!

తెల్లనివన్నీ పాలు కావు..!

మీకు పాలలా కనిపిస్తున్న ఆ ద్రవం పాలు కాకపోవచ్చు. సంపూర్ణాహారంగా భావించి మీరు తాగుతున్న ఆ పానీయం విషాహారం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాలనూ కల్తీ చేసి, లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. సింథటిక్ పాలుగా పేర్కొంటున్న ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా... బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. సింథటిక్ పాలలో వాడే పదార్థాలు, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ  కథనం. అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మనదేశం ఒకటి. కానీ ఇందులో దాదాపు 70 శాతం పాలు కల్తీవే అన్న సంగతి  తెలిస్తే ఆశ్చర్యపోతారు. కల్తీ మాత్రమే కాదు... అవి కృత్రిమపాలు. ఈ పాలనే ఇంగ్లిష్‌లో సింథటిక్ మిల్క్ అంటారు.
 

సింథటిక్ మిల్క్ అంటే...?
ఆవు లేదా గేదె పొదుగునుంచి పితికిన పాలు స్వాభావికమైన పాలు అనీ, కృత్రిమ పదార్థాలతో, కృత్రిమమైన రసాయనాలతో పాల రూపు వచ్చేలా తయారు చేసిన ద్రవాన్ని ‘సింథటిక్ మిల్క్’ అనీ అంటారు.
 
సింథటిక్ పాలలో ఏమేం వాడతారు...
సింథటిక్ పాల తయారీలో నీరు, కాస్టిక్ సోడా, యూరియా, గ్లూకోజ్, గంజి పొడి, చవకరకం వంటనూనె/రిఫైన్‌డ్ ఆయిల్, స్టార్చ్ ఆయిల్, డిటర్జెంట్, కుంకుళ్లు, షాంపూ, తెల్లరంగు, బంక, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలు వాడతారు. ఇందులో పాలను పైనుంచి ధారగా పోస్తున్నప్పుడు నురగ వచ్చేందుకు డిటర్జెంట్/కుంకుడుకాయలు వాడతారు. ఇక అందులో వాడే ఆమ్ల పదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాస్టిక్ సోడాను ఉపయోగిస్తారు.

రవాణా ప్రక్రియలో పాలు చెడిపోయి/విరిగిపోయి పుల్లబారిపోకుండా ఉండేందుకూ కాస్టిక్‌సోడా ఉపయోగపడుతుంది. చవకరకం వంటనూనెను పాలలోని సహజ కొవ్వుపదార్థంలా అనిపించేందుకు వాడతారు. స్వాభావికమైన పాలరుచి రావడానికి యూరియానూ, తెల్లరంగు రావడానికీ, చిక్కగా అనిపించడానికి తెల్ల పెయింట్‌నూ ఉపయోగిస్తారు. గమ్ అకేషియా, గమ్ లెగ్యూమినస్ తరహాలకు చెందిన బంకను సైతం పాలను చిక్కగా అనిపించేలా చేయడానికి వాడతారు. దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచేలా చూసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వాడతారు.
 
ఇలా తయారు చేసిన సింథటిక్ పాలు పూర్తిగా స్వాభావికమైన పాలలాగే కనిపిస్తాయి. అయితే స్వాభావికమైన పాలలో ఉండే పోషక విలువలేవీ ఈ పాలలో ఉండవు. ఇలా తయారు చేసిన పాలను గ్రామాల్లోని ‘డైరీ కో-ఆపరేటివ్ సొసైటీ’ల ఆధ్వర్యంలో నడిచే పాల సేకరణ కేంద్రాలలో ఉంచే పాలలో కలిపేస్తారు. అందులో అవి తేలిగ్గా కలిసిపోతాయి కూడా.
 
లాభార్జన కోసమే ఈ అక్రమ మార్గం
ఒక లీటరు సింథటిక్ పాలను తయారుచేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే. మార్కెట్‌లో లీటరు పాల ధర దాదాపు 40 వరకు ఉంటుంది. స్వాభావిక పాలను విక్రయిస్తే వచ్చే లాభం కేవలం రూ. 10 నుంచి రూ.15 మాత్రమే. కానీ సింథటిక్ పాలను విక్రయిస్తే వచ్చే లాభం రూ. 35. అందుకే అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకు పాల్పడేవారు తోటివారి ఆరోగ్యాలనూ, ప్రాణాలను లెక్కచేయకుండా తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు.
 
ఆరోగ్యానికి ఎంత నష్టం...
ఈ సింథటిక్ పాల వల్ల అన్ని విధాలా ఆరోగ్యానికి నష్టమే. ముఖ్యంగా గర్భవతులైన మహిళల ఆరోగ్యంతో పాటు లోపలి పిండానికీ ఇది నష్టమే. ఇక గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి ఇవి మరింత నష్టం చేస్తాయి. పైగా అనేక రకాల క్యాన్సర్లకు మూలకారణం కూడా. పిల్లల ఆరోగ్యం బాగుండాలని తల్లులు పట్టుబట్టి ఈ పాలు తాగిస్తుంటారు. కానీ తమ పిల్లలకు తామే విషాన్ని పడుతున్నామన్న సంగతే వారికి తెలియదు. ఈ పాలను తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి క్రమంగా సన్నగిల్లి చిన్నవయసులోనే ఎన్నో వ్యాధులకు గురవుతారు. సింథటిక్ పాల వల్ల కళ్లకూ, కాలేయానికీ ప్రమాదం.
 
రసాయన పరీక్ష
లతో సింథటిక్ పాలను గుర్తించే ప్రక్రియలు

పాలలో యూరియా కలిసి ఉంటే 5 ఎమ్‌ఎల్ శాంపిల్‌ను తీసుకుని దానికి 5 ఎమ్‌ఎల్. పారాడైమిథైల్ అమైనో బెంజాల్డిహైడ్ కలిపితే ఆ ద్రావణం పసుపురంగుకు మారితే ఆ పాలలో యూరియా ఉన్నట్లు అర్థం.
ఐదు ఎమ్‌ఎల్ పాల శాంపిల్‌ను తీసుకుని, దానికి 0.1 ఎమ్‌ఎల్ బ్రోమోక్రెజాల్ పర్పుల్ ద్రావణాన్ని కలపాలి... ఒకవేళ ఆ మిశ్రమం వంకాయ రంగుకు మారితే అందులో డిటర్జెంట్ ఉన్నట్లు అర్థం. ఒకవేళ అందులో డిటర్జెంట్ లేకపోయినా ఆ ద్రావణం వయొలెట్ రంగుకు మారుతుంది కానీ అది చాలా లేత వంకాయ రంగులో ఉంటుంది.
రసాయన పరీక్షలు ఇంట్లో సాధ్యం కాకపోయినా ఇలా స్వాభావిక లక్షణాలను కొంతకాలం పాటు నిశితంగా గమనిస్తూ పై లక్షణాలను బట్టి మీ పాలు స్వాభావికమైనవో, సింథటిక్ పాలో తెలుసుకోండి. దానికి అనుగుణంగా ఆ పాలను కొనసాగించడమా లేదా బ్రాండ్ మార్చడమా అన్నది నిర్ణయించుకోండి.
 
సింథటిక్ పాలలోని కాస్టిక్‌సోడాతో ప్రమాదాలివి...

హైబీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి ఇందులో ఉండే సోడియమ్ స్లోపాయిజన్‌లా పని చేస్తుంది.
నోరు, గొంతు, ఈసోఫేగస్, కడుపు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఉండే మ్యూకస్‌ను దెబ్బతీస్తుంది.
గాలి గొట్టాలను దెబ్బతీసి... ఊపిరి పీల్చే ప్రక్రియపై అవాంఛిత ప్రభావాలు చూపుతుంది.
కొందరిలో ఈ సింథటిక్ పాలు తాగగానే గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది.
నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది.
 
యూరియాతో అనర్థాలివి...

కిడ్నీలపై యూరియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి వాటిని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆ యూరియాను తొలగించడానికి కిడ్నీలు చాలా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దాంతో నెఫ్రాన్లు దెబ్బతింటాయి.
గుండె, కాలేయాలను దెబ్బతీస్తుంది.
 
డిటర్జెంట్లతో హాని ఇలా...
స్వల్పంగా లేదా తీవ్రంగానూ కడుపునొప్పి రావచ్చు.
ఇందులోని క్షారగుణం వల్ల మనం తీసుకునే ప్రోటీన్లు దెబ్బతింటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement