హృదయం 20 వేలు.. కాలేయం 5 వేలు
మీరట్: 'తాజా లీవర్ (కాలేయం) కావాలా.. ఐతే ఐదువేలివ్వు. ఇంకా తక్కువ ధరకంటే.. రెండు వేలు. సరుకు నెల రోజుల కిందటిది. గుండె (హృదయం) విషయంలో మాత్రం బేరాల్లేవ్. కచ్చితంగా 20 వేలు ఇవ్వాల్సిందే' ఈ సంభాషణ దేనిగురించో ఇప్పటికే అర్థమైందికదా. అవును. మనుషుల అవయవాల గురించే. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రభుత్వాసుపత్రుల మార్చురీలనుంచి అవయవాలను దొంగిలించి మంత్రగాళ్లకు రహస్యంగా అమ్ముకుంటోన్నఆసుపత్రి సిబ్బంది బండారం ఓ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పైన పేర్కొన్న మాటలు శవాల అమ్మకందారులు మాట్లాడినవి.
మీరట్ పరిధిలోని పలు సర్కారీ దవాఖానల్లో మార్చురీల నుంచి తరచూ శవాలు, వాటిలోని అవయవాలు మాయమవుతున్నాయి. దొంగిలించిన అవయవాల్ని మంత్రగాళ్లకు అమ్ముతున్నట్లు పుకార్లు చెలరేగాయి. ఈ దురాగతాలను వెలుగులోకి తేవాలనుకున్న స్థానిక యువకులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా అవయవాల అమ్మకాల గుట్టును రట్టుచేశారు. పథకం ప్రకారం రహస్య కెమెరాలతో బేరగాళ్లుగా మారి ఆసుపత్రులకు వెళ్లి మార్చురీకి వెళ్లి బేరసారాల వ్యవహారాల్ని రికార్డుచేసి పోలీసులకు అప్పజెప్పారు. 'అసలు ఇలాంటివి జరుగుతాయన్న విషయమే ఊహకందనిది. నా ఆసుపత్రిలో ఇలాంటివి చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఇకపై పోలీసుల అనుమతిలేనిదే మార్చురీలో శవాలను ముట్టుకోకూడదని ఆదేశాలు జరీచేశాను' అని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమేశ్ చంద్ర మీడియాకు చెప్పారు. ఘటనలపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు.