గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
హెపటైటిస్-బితో లివర్ చెడిపోతుందా?
నా వయసు 30 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా దగ్గర నిర్వహించిన ఒక మెడికల్ క్యాంప్‌లో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? ఈ వ్యాధి మందులతో తగ్గుతుందా?
- ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు హెపటైటిస్-బి అనే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంతమాత్రాన కాలేయం చెడిపోదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి కాలేయం చెడిపోయే అవకాశం ఉంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, హెచ్‌బీవీ డీఎన్‌ఏ టెస్ట్ చేయించండి. వీటివల్ల వైరస్ ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ హెచ్‌బీవీ డీఎన్‌ఏ ఎక్కువగా ఉండి, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో కూడా తేడా వస్తే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి.
నేను వృత్తిరీత్యా గోల్డ్‌స్మిత్‌ను. నా కూతురి వయసు 16 ఏళ్లు. మూడు నెలల క్రితం పొరబాటున గ్లాసులో ఉన్న తేజాబ్ ద్రావణం (యాసిడ్) తాగేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాను. కానీ ప్రస్తుతం ఆహారం మింగడం కష్టంగా ఉందని చెబుతోంది. ఎందుకని ఆహారం సాఫీగా జారడం లేదో అర్థం కావడం లేదు. దయచేసి మా అమ్మాయి సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
- ఒక సోదరుడు, ఊరి పేరు రాయలేదు
మీ అమ్మాయి తేజాబ్ ద్రావణం తాగిందని అంటున్నారు. దాని వల్ల అన్నవాహికలో యాసిడ్ విడుదలై స్ట్రిక్చర్ డెవలప్ అయి ఉండవచ్చు. అంటే అన్నవాహిక సన్నబడి ఉండవచ్చు. దాంతో అన్నవాహిక నుంచి జీర్ణాశయానికి ఉన్న దారి మూసుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే మీ అమ్మాయికి వాంతులు అవుతున్నాయా లేదా అన్న విషయం మీరు రాయలేదు. ఒకవేళ వాంతులు లేకుండా కేవలం ఆహారం మింగడం కష్టంగా ఉంటే ఎండోస్కోపీ డయలటేషన్ అనే ప్రక్రియ ద్వారా సన్నబడిన ఆహార వాహిక మార్గాన్ని వెడల్పు చేసి చికిత్స చేయవచ్చు. ఈ ప్రక్రియను రెండువారాలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆహారం తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి.
డాక్టర్ పి. భవానీ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్