మీకు ఒకసారి చికెన్గున్యా సోకిందా.. అయితే..
న్యూఢిల్లీ: మీకు ఒకసారి చికెన్గున్యా సోకి తగ్గిందా. మీ సమాధానం అవును అయితే ఇక మీరు చికెన్గున్యా విషయంలో బేఫికర్ అంటున్నారు శాస్త్రవేత్తలు. చికెన్గున్యా ఒకసారి సోకినవారిలో మళ్లీ అంతగా ప్రభావం చూపదని ఢిల్లీ ఎయిమ్స్ వైరాలజిస్టులు స్పష్టం చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించిన వారి విషయంలో మాత్రమే చికెన్గున్యా రెండోసారి ప్రభావం చూపే అవకాశం ఉందని మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ దర్ వెల్లడించారు. ఢిల్లీలో 2006లో చికెన్గున్యా తీవ్రంగా ప్రబలిన అనంతరం అక్కడ ఈ వ్యాధి అంతగా వ్యాపించలేదని.. అయితే ఆ తరువాతి కాలంలో అక్కడ జన్మించిన, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో ఈ వ్యాధి ప్రబలుతోందని ప్రస్తుత వ్యాధి తీవ్రతను ఆయన విశ్లేషించారు.
ఢిల్లీలో చికెన్గున్యా మూలంగా ప్రజలు చనిపోతున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కేవలం చికెన్గున్యా మూలంగానే మరణాలు సంభవిస్తున్నాయనడం సబబు కాదని.. ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై మాత్రమే చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఇటీవల జ్వరంతో మృతి చెందిన 13 కేసులను పరిశీలించిన అనంతరం.. ఆ మరణాలకు కేవలం చికెన్గున్యా కారణం కాదని.. నిమోనియా, సెప్సిస్, కిడ్నీ సంబంధ వ్యాదులతో వారు మృతి చెందారని వెల్లడించింది.