శాన్ ఫ్రాన్సిస్కో: పీకలదాకా మద్యం సేవిస్తూ కాలేయ జబ్బులతో బాధపడే మందు బాబులకు శుభవార్త! మద్యం, హెపటైటీస్ సీ, ఫ్యాటీ లివర్ కారణంగా సిరోసిస్ లాంటి ప్రాణాంతక కాలేయ వ్యాధులను సులభంగా నయం చేసే వైరస్‌ను కాలిఫోర్నియా యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన నిపుణులు కనుగొన్నారు.
‘అడినో అసోసియేటెడ్ వైరస్ (ఏఏవీ)ని కాలేయంలోకి పంపించడం వల్ల ఆ వైరస్ చెడిపోయిన కాలేయ కణాలను మంచి కణాలుగా మారుస్తున్న విషయం తమ ప్రయోగంలో రుజువైందని జర్మనీలోని హైడెల్బర్గ్ యూనివర్శిటీ హాస్పటల్ నిపుణులతో సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించిన ప్రొఫెసర్ డాక్టర్ హోల్గర్ విల్లిన్ బ్రింగ్ తెలిపారు. చెడిపోయిన కాలేయ కణాలను మ్యోఫిబ్రోబ్లాస్ట్స్ అని పిలుస్తామని, మంచి కణాలను హెపటోసైట్స్ అని పిలుస్తామని, తాము ప్రయోగించిన వైరస్ వల్ల చెడిపోయిన కాలేయ కణాలు హెపటోసైట్స్ గా మారిపోయాయని ఆయన వివరించారు.
సహజ కణాలలాగే వైరస్ మరమ్మతు చేసిన కణాలు పునరుత్పత్తి శక్తిని కలిగి ఉండడం, సహజ సిద్ధమైన ఆరోగ్య కణజాలంతో ఇట్టే కలిసిపోవడం ఓ అద్భుతమని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి పంచర్ పడిన ఓ టైరుకు ప్యాచ్ అతికించడం లాంటిదే ఈ చర్యని, ప్రస్తుతానికి కాలేయ మార్పిడే సరైన చికిత్స అని ఆయన తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈ వైరస్ చికిత్సను మరింత అభివద్ధి చేసినట్లయితే కాలేయ మార్పిడి అవసరం లేకపోవచ్చని ఆయన చెప్పారు. ఆయన ఈ ప్రయోగ వివరాలను ‘జర్నల్ స్టెమ్ సెల్’లో ప్రచురించారు.
లివర్ జబ్బులకు వైరస్ చికిత్స
Published Fri, Jun 3 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement