కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చదివేద్దాం.
మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం దాపురించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్ సిర్రోసిస్ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు, ఆల్కాహాల్ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది.
అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి
లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సి, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్‌నార్మల్‌గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిర్రోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్ ఫంక్షన్‌లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు.
40ఏళ్లు దాటితే..
శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్ ఎక్కువగా ఉన్న జంక్‌ఫుడ్స్ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
లివర్ వ్యాధులకు కారణాలివే...
- శ్రమ లేని జీవన విధానం
- ఆహారపు అలవాట్లు
- పెరుగుతున్న మధుమేహులు
- ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం
- ఆల్కహాల్ వ్యసనం
- ఫాటీ లివర్‌ను అశ్రద్ధ చేయొద్దు
- పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు
- ఏడాదికోసారి పరీక్షలు తప్పనిసరి
వీటికి దూరంగా ఉండాలి
►మంచి పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.
► మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది.
► కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు.
► చేపలు, అవిసె గింజలు, అక్రోట్లు,పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
► చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, పానీయాలకు దూరంగా ఉండాలి.
► ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు.
ఇవి పాటిస్తున్నారా?
- వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకడోస్‌లు ఎక్కువగా తీసుకోవడం మంచిది
- నీరు ఎక్కువ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
- పసుపు,గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
లివర్ సమస్యలు పెరిగాయి
ఇటీవల కాలంలో కాలేయ సమస్యలతో వస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఆల్కహాల్ తాగే వారిలోనే లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకేది. కానీ ఇప్పుడు కొలస్ట్రాల్ కారణంగా నాన్ ఆల్కహాలిస్టుల్లో కూడా సిర్రోసిస్ చూస్తున్నాం. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు, ఆహార నియమాలు పాటిస్తూ, శరీరంలో కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి.
– డాక్టర్ బీఎస్‌వీవీ రత్నగిరి,
అసోసియేట్ ప్రొఫెసర్, గాస్ట్రో ఎంట్రాలజీ
Comments
Please login to add a commentAdd a comment