అరుదైన శస్త్రచికిత్స చేసిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : కాలేయంలో అరుదుగా ఏర్పడే కణతులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు తొలగించి మహిళకు తిరిగి ప్రాణాలు పోశారు. అనంతపురం జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన ఇ.సిద్దమ్మ(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు గత నెల 29న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చారు.
జనరల్ సర్జరీ విభాగం ఐదో యూనిట్ వైద్యులు ఆమెను పరీక్షించి కాలేయంలో కణతులు ఏర్పడినట్లు గుర్తించారు. గర్భాశయంపై కూడా ఇదే విధమైన కణతులు కనుగొన్నారు. ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి సోమవారం ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు.
ఈ విషయమై ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ జిలానీ మాట్లాడుతూ లివర్, గర్భసంచిపైన హైడాటిడ్ సిస్ట్‌లు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయన్నారు. కలుషితమైన కూరగాయలు సరిగ్గా శుభ్రం చేయకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కాలే యం వద్ద రెండు, గర్భాశయం వద్ద ఒక కణతిని తొలగించినట్లు చెప్పారు. ఆపరేషన్ చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణనాయక్, పీజీ డాక్టర్ మూర్తి ఉన్నట్లు ఆయన తెలిపారు.