Kurnool (Hospital)
-
చనిపోయిందని వదిలేసి వెళ్లారు!
కర్నూలు (హాస్పిటల్): అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోతే.. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు కుటుంబసభ్యులు. వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన లావణ్య (10)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తండ్రి భాస్కర్, తాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. పాప కోలుకోకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందింది. అప్పటికే తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోగా.. చనిపోయే వరకు ఉన్న తాత కూడా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి మెల్లిగా జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పేషెంట్ రిజిస్టర్లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు బాలిక కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. -
పెద్దాసుపత్రిలో పెద్దాయన గురుతులు
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమ ప్రజల వైద్యసేవలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆధునిక వైద్యం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అడిగిన వెంటనే నిర్ణయాలు తీసుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణే అతి ముఖ్యమని నిరూపించారు. ఆసుపత్రిలోని గుండెజబ్బుల విభాగానికి కేథలాబ్ యూనిట్ ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మాతాశిశు సంరక్షణ భవనానికి ఆయన హయాంలోనే బీజం పడింది. ఇప్పుడు ఆ విభాగాలు ఎన్నో వేల మందికి ఊపిరి పోస్తూ సీమ ప్రజల వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగం 30 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా అందుకు అనుగుణంగా 15 ఏళ్ల క్రితం వరకు వసతులు, సౌకర్యాలు ఉండేవి కావు. 2005లో ఓసారి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ కలిసి కేథలాబ్ యూనిట్ కోసం విన్నవించగా వెంటనే ఆయన ఓకే చేశారు. రూ.5కోట్లతో 2008 ఆగష్టు 2వ తేదీన అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా కేథలాబ్ యూనిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేథలాబ్‌లో 10వేల యాంజియోగ్రామ్‌లు, వెయ్యికి పైగా స్టెంట్లు, 40 దాకా పర్మినెంట్ పేస్మేకర్లు, 200 దాకా టెంపరరీ పేస్మేకర్లు తదితర వైద్యచికిత్సలు నిర్వహించారు. కేథలాబ్ యూనిట్‌తో పాటు వచ్చిన హార్ట్‌లంగ్ మిషన్ ప్రస్తుతం కార్డియోథొరాసిక్ విభాగానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ విభాగంలో హెచ్ఓడీ, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 320కు పైగా వివిధ రకాల గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ సమయంలో ఎక్కు వ గుండెశస్త్రచికిత్సలు నిర్వహించిన వారీగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఈ రెండు విభాగాలు రాయలసీమ ప్రజలకు వరప్రదాయినిగా నిలిచాయి. మాతాశిశు వైద్యానికి ఎంసీహెచ్ భవనం.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆసుపత్రిలో మాతాశిశు భవనానికి అంకురార్పరణ జరిగింది. పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి కోటి రూపాయల విరాళంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో మాతాశిశు భవనానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రస్తుతం చిన్నపిల్లల విభాగం నిర్వహిస్తున్న భవనం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రసూతి విభాగ నిర్మాణం పూర్తయింది. ఈ రెండు భవనాలకు మొత్తంగా రూ.35కోట్ల వరకు వెచ్చించారు. దీనివల్ల చిన్నపిల్లలు, గర్భిణీలకు ఇబ్బందులు తప్పాయి. గతంలో చాలీచాలని భవనాల్లో ఒకే పడకపై ఇద్దరేసి రోగులు చికిత్స పొందేవారు. ప్రస్తుతం విశాలమైన గదులు, వార్డులతో ఈ విభాగం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. -
టీబీఎస్ సంస్థది భారీ కుంభకోణం
సాక్షి,కర్నూలు(హాస్పిటల్): వైద్యపరికరాలు మరమ్మతులు చేయకుండా రూ.450 కోట్ల ప్రజల సొమ్మును టీబీఎస్ సంస్థ అప్పనంగా దోచుకుందని కర్నూలు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ అన్నారు. దోచుకున్న ఆ సొమ్మును ఆ సంస్థ నుంచి రికవరీ చేయిస్తామని చెప్పారు. ‘టీబీఎస్ నిర్వహణ తుస్’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల తనిఖీ చేశారు. ముందుగా రేడియాలజీ విభాగంలోని మూలనపడ్డ ఎక్స్‌రే యూనిట్లను పరిశీలించారు. మొత్తం పది యూనిట్లు పనిచేయడం లేదని, ఈ విషయాన్ని టీబీఎస్ సంస్థకు చెప్పినా పట్టించుకోవడం లేదని రేడియాలజీ హెచ్ఓడీ డాక్టర్ గఫూర్ ఎంపీకి చెప్పారు. ఈ విభాగంలో సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉందని చీఫ్ రేడియోగ్రాఫర్ కృష్ణమూర్తి విన్నవించారు. ఒకవైపు ఎక్స్‌రే యూనిట్లు పనిచేయకపోవడం, మరోవైపు సిబ్బంది తక్కువగా ఉండటంతో అధిక భారం పడుతోందన్నారు. అనంతరం ఆయన ఏఎంసీ విభాగాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన బడేసాహెబ్‌ను పరామర్శించారు. ఏఎంసీలో ఎన్ని వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని ఆరా తీశారు. పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో రోగులకు ఇబ్బందిగా ఉందని, ఈ మేరకు పాత గైనిక్ విభాగంలో ఏఎంసీ, క్యాజువాలిటీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ వివరించారు. విద్యుత్ అంతరాయంపై ఆగ్రహం ఎంపీ సంజీవ్‌కుమార్ మేల్ పోస్టు ఆపరేటివ్ వార్డును సందర్శించారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆపరేషన్ చేయించుకున్న రోగులు ఇబ్బందులు పడుతుండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పది మందికి ఆపరేషన్లు ఆగిపోయాయని తెలుసుకుని ఆపరేషన్ థియేటర్లు పరిశీలించారు. ఆసుపత్రిలో ట్రాన్స్ఫార్మర్ బ్రేక్‌డౌన్ అయ్యిందని, త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా ఆపరేషన్ థియేటర్‌కు జనరేటర్ లేకపోతే ఎలాగని, ఆపరేషన్ చేసే సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏమిటని అధికారులను ఎంపీ ప్రశ్నించారు. ఆ సమయంలో ఏఈ వెంకటేష్, టీబీఎస్ సంస్థ ప్రతినిధులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీఎస్లో అనర్హులతో పనిచేయిస్తున్నారని, మొత్తం ఇప్పటి వరకు ఎన్ని పరికరాలు రిపేర్ చేశారు, ఎన్ని ఉన్నాయో, మీ ఎంఓయు తదితర వివరాలు తీసుకుని రావాలని ఆలస్యంగా వచ్చిన ఆ సంస్థ ప్రతినిధిని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలపై ఆవేదన అనంతరం పోస్టుమార్టం వద్ద సి.బెళగల్ మండలం పోల్‌కల్ గ్రామానికి చెందిన రైతు లాజర్ (35) మృతదేహాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పశ్చిమ ప్రాంతానికి నీటి కేటాయింపులు న్యాయబద్ధంగా జరగలేదని, అందుకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే 20 టీఎంసీల నీరు నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాసిరకంగా నిర్మాణ పనులు ఆసుపత్రిలోని మేల్ పోస్టు ఆపరేటివ్ వార్డులో వేసిన టైల్స్ కుంగిపోయి ఉండటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే వేసిన టైల్స్ ఎలా కుంగిపోతాయని, మీ ఇంట్లో కూడా ఇలాగే వేసుకుంటారా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. బండలు వేసేటప్పుడు ప్రాథమిక సూత్రాలు కూడా పాటించినట్లుగా లేదని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే వేశామని డీఈ రాజగోపాల్‌రెడ్డి చెప్పేందుకు ప్రయత్నించగా ఆ మాటకు కట్టుబడి ఉండండి, దీనిపై నేను లోతుగా పరిశీలిస్తానని చురకలంటించారు. -
టీవీ..సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా
కర్నూలు :కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తానని ఆల్ ఇండియా ర్యాంకర్ మాధురీరెడ్డి తెలిపారు. గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన మాధురీరెడ్డి ఆల్ ఇండియా లెవల్లో 7వ ర్యాంకు సాధించారు. గురువారం కర్నూలుకు వచ్చిన మాధురీరెడ్డికి బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం? జ: మాది శిరివెళ్ల మండలం గోవిందపల్లె. నాన్న జి.తిరుపతిరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అమ్మ జి.పద్మావతి గృహిణి. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రశ్న: పాఠశాల, కాలేజీ విద్య ఎక్కడ పూర్తి చేశారు? జ: హైదరాబాదులోని క్రిక్ స్కూల్లో 1 నుంచి 7వ తరగతి వరకు, మాదాపూర్‌లోని నారాయణ స్కూల్లో 8 నుంచి 10 వరకు చదివాను. ఇంటర్మీడియెట్ కూడా మదాపూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో చదివి 982 మార్కులు సాధించాను. ప్రశ్న:నీట్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? జ: ఇంటర్మీడియెట్‌తో పాటు నీట్‌కు ప్రిపేర్ అయ్యాను. ప్రతి రోజు 10 నుంచి 12 గంటలు చదువుకే కేటాయించాను. నీట్ కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకొని అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించుకొని చదివాను. ప్రతి రోజు తరగతి గదిలో క్లాస్‌లో నోట్ తయారు చేసుకొని ఏవైనా డౌట్స్ వస్తే వెంటనే సంబంధిత సబ్జెక్టు లెక్చరర్‌ను అడిగి క్లారీఫై చేసుకునేదాన్ని. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపై తక్కువ సమయంలో పట్టు సాధించగలిగాను. ప్రశ్న: నీట్లో ఆల్ ఇండియా స్థాయిలో 7వ ర్యాంకు వస్తుందని అనుకున్నారా? జ: ముందుగానే టాప్ టెన్ లక్ష్యంగా పెట్టుకొనే ప్రిపేర్ అయ్యాను. ఇందు కోసం టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్నెట్కు దూరంగా ఉండి చదివాను. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. నీట్లో ఆల్ ఇండియా లెవెల్లో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ప్రశ్న: నీట్‌కు ప్రిపరేషన్లో పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? జ: అమ్మ, నాన్న చదువులో ఎంతో ప్రోత్సాహించే వారు. లెక్చరర్ల సహకారం కూడా మరువలేనిది. ఎప్పుడైనా టైడ్ అనిపిస్తే బ్యాడ్మింటన్ ఆడి రిలాక్స్ అయ్యేదాన్ని. ప్రశ్న:మెడిసిన్ పూర్తయ్యాక మీ లక్ష్యం? జ: మెడిసిన్ పూర్తయ్యాక కార్డియాలజీ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తా. -
కాలేయంలో కణతుల తొలగింపు
అరుదైన శస్త్రచికిత్స చేసిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : కాలేయంలో అరుదుగా ఏర్పడే కణతులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు తొలగించి మహిళకు తిరిగి ప్రాణాలు పోశారు. అనంతపురం జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన ఇ.సిద్దమ్మ(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు గత నెల 29న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చారు. జనరల్ సర్జరీ విభాగం ఐదో యూనిట్ వైద్యులు ఆమెను పరీక్షించి కాలేయంలో కణతులు ఏర్పడినట్లు గుర్తించారు. గర్భాశయంపై కూడా ఇదే విధమైన కణతులు కనుగొన్నారు. ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి సోమవారం ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ విషయమై ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ జిలానీ మాట్లాడుతూ లివర్, గర్భసంచిపైన హైడాటిడ్ సిస్ట్లు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయన్నారు. కలుషితమైన కూరగాయలు సరిగ్గా శుభ్రం చేయకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కాలే యం వద్ద రెండు, గర్భాశయం వద్ద ఒక కణతిని తొలగించినట్లు చెప్పారు. ఆపరేషన్ చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణనాయక్, పీజీ డాక్టర్ మూర్తి ఉన్నట్లు ఆయన తెలిపారు.