లవ్ యువర్ లివర్
జీర్ణవ్యవస్థకూగ కాలేయానికీ అవినాభావ సంబంధం ఉంది. శరీరంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించడంలో కాలేయం పాత్ర కీలకమైంది. అలాంటి కాలేయం విషయంలో చేసే తప్పులు మనిషిని రోగాల రొంపిలోకి దింపుతున్నాయి. శరీరంలో వెలువడే టాక్సిన్స్ (విష పదార్థాలను) సైతం విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపించి నిలువెత్తు శరీరానికి ఆప్తుడిగా ఉండే కాలేయం (లివర్) ఆపదలో పడిపోతోంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరజీవి తమకు తెలియకుండానే లివర్‌ను ముప్పులోకి నెడుతున్నాడని చెబుతున్నారు వైద్యులు.
నగరంలో రోజూ పదివేల మంది పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్తుంటే అందులో 2 వేల మంది జీర్ణవ్యవస్థ, లివర్‌కు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నవారే. మిగతా అవయవాల పరిస్థితి పక్కన పెడితే లివర్‌ను కాపాడుకోవడమనేది పక్కాగా మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు డాక్టర్లు. లివర్ మీద ప్రెషర్ పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనిషి మనుగడకు ఢోకా ఉండదని చెబుతున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డా.ఆర్వీ రాఘవేంద్రరావు.
లివర్‌కు ముప్పు ఇక్కడ్నుంచే
* నగరంలో రోజురోజుకూ మద్యం సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. మితిమీరి మద్యం సేవించడం కారణంగా చాలా మంది లివర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
* హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సోకినపుడు లివర్ జబ్బులకు కారణమవుతున్నాయి.
* కొన్ని జన్యుపరమైన సమస్యలు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణం అవుతున్నాయి.
* కొన్ని సార్లు ఇన్‌ఫెక్షన్ల కారణంగా కాలేయంలో చిన్న చిన్న సిస్ట్స్ (చిన్న చిన్న బుగ్గలు) ఏర్పడుతున్నాయి. ఇవి ప్రమాదానికి దారితీస్తున్నాయి.
* ఆల్కహాల్ దీర్ఘకాలంగా వాడితే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తోంది. అంటే లివర్ పనితీరు తగ్గిపోవడం, పూర్తిగా పనిచేయకుండా పోతుంది.
* పస్తుతం ఎక్కువగా చిన్నపిల్లల్లో లివర్‌కు సంబంధించి హెపటో బ్లాస్టోమా, పెద్దవారిలో హెపటో సెల్యులర్ కార్సినోమా వస్తోంది
* నగరాల్లో ఈటింగ్ హాబిట్స్ కూడా లివర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.
* పదేళ్లలో రకరకాల కారణాల వల్ల లివర్ కేన్సర్ తీవ్రమవుతున్నట్టు స్పష్టమైంది.
నివారణ మన చేతుల్లోనే..
* లివర్‌ను కొద్దిగా తీసి ఇతరులకు అమర్చినా మళ్లీ పూర్వస్థితిని చేరుకునే అవయవం ఇదొక్కటే. అం టే శరీరంలో ఇలాంటి సహాయకారి మరొకటి లేదు. దీన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
* మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
* మద్యం సేవించే వారు తరచూ లివర్ టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ఈఎస్‌ఎల్‌డీ (ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్-దీన్నే ఆల్కలిక్ లివర్ సిరోసిస్ అంటాం) వస్తే ప్రమాదం.
* ఏ వయసు వారైనా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వైరస్‌లకు ఇంజెక్షన్లు వేయించుకోవాలి.
* ఈ వైరస్‌లు ఉన్నాయో లేవో పరీక్షలు చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి.
* మేనరికం సంబంధాలు చేసుకుని ఉంటే వారు జెనెటిక్స్ కౌన్సెలింగ్ తీసుకోవాలి.
* వీలైనంత వరకూ వేపుళ్లు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్‌ను తీసుకోవడం తగ్గించాలి
* ఒంట్లో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి
* వీలైనంత వరకూ మాంసాహారాన్ని తగ్గించి తినడం మంచిది