మద్యంతో కాలేయం చెడితే.... | liver trans plantation for alchohol effects | Sakshi
Sakshi News home page

మద్యంతో కాలేయం చెడితే....

Published Thu, Feb 16 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

మద్యంతో కాలేయం చెడితే....

మద్యంతో కాలేయం చెడితే....

కండరాలు పట్టేయడానికి చాలా కారణాలుంటాయి!
నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు  బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. కండరం మరీ బిగుసుకుపోయినప్పుడు, నొప్పి తగ్గడానికి కాస్త మసాజ్‌ చేసుకుంటూ ఉంటాను. ఈ సమస్యనుంచి బయట పడటానికి పరిష్కారం చెప్పండి. – కె. రాజ్‌కుమార్, హైదరాబాద్‌

ఇలా కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్‌ డీహైడ్రేషన్‌ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్‌ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి.

ఇంకొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో విటమిన్‌ బి12, విటమిన్‌ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్‌ నర్వ్స్‌ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.

డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి
చీఫ్‌ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్,
మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్‌


మద్యంతో కాలేయం చెడితే....కాపాడే చికిత్స లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌!
మావారి వయసు 54 ఏళ్లు. గడచిన 25 ఏళ్లు నుంచి మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్‌ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు.  లేదంటే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. దీంతో మా సొంత ఊరికి వచ్చేశాం. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – ప్రభావతి, నంద్యాల

మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది.

వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్‌ పగ్‌ స్టేజెస్‌’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్‌ స్థాయిలోనే డాక్టర్‌ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్‌ స్టేజెస్‌) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు.

మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. కాలేయ వ్యాధుల చికిత్స ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ఆధునికత సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం వల్ల కాలేయ వ్యాధుల సక్సెస్‌రేట్‌పై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి.

ఇప్పుడు మన దగ్గర ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స గతంలో మాదిరిగా ఖరీదైనదేమీ కాదు. మీరు దగ్గర్లోని అన్ని వసతులు ఉండే అన్ని సౌకర్యాలు గల పెద్ద ఆసుపత్రికి వెళ్లి, అక్కడి డాక్టర్లు సూచించిన విధంగా మీవారికి నిరభ్యంతరంగా, నిర్భయంగా శస్త్ర చికిత్స చేయించవచ్చు.    

డాక్టర్‌  పి.బాల చంద్రన్‌ మీనన్‌
సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement