
కాలేయం 3డీ ప్రింట్!
బెంగళూరుకు చెందిన బయోటెక్నాలజీ స్టార్టప్ కంపెనీ పాండోరమ్ టెక్నాలజీస్.. మానవ కాలేయాన్ని పోలిన 3డీ ప్రింట్ కణజాలాన్ని అభివృద్ధి చేసింది.
► బెంగుళూరు స్టార్టప్ ఘనత
న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన బయోటెక్నాలజీ స్టార్టప్ కంపెనీ పాండోరమ్ టెక్నాలజీస్.. మానవ కాలేయాన్ని పోలిన 3డీ ప్రింట్ కణజాలాన్ని అభివృద్ధి చేసింది. ఇది మానవ కాలేయం చేసే విధులను నిర్వర్తిస్తుంది. తమ కొత్త కణజాల ఆవిష్కరణ భవిష్యత్తులో పూర్తి స్థాయి కాలేయ మార్పిడి ప్రక్రియకు దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.
కృత్రిమ అవయవాల వల్ల చాలా వైద్య అనువర్తనాలు ఉన్నాయని, ఇవి కృత్రిమ కాలేయ వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, తద్వారా కాలేయం పాడయిన వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు తూహిన్ భౌమిక్ తెలిపారు. సమీప భవిష్యత్తులో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలో ఉత్పన్నమయ్యే మానవ అవయవాల కొరతను ఈ టెక్నాలజీ తీరుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కణజాలాన్ని మరిన్ని అనువర్తనాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని పాండోరమ్ టెక్నాలజీస్ మరో సహ-వ్యవస్థాపకుడు అరుణ్ చంద్రు తెలిపారు.
తక్కువ ధరల్లో, స్వల్ప దుష్ర్పభావం ఉండేలా, ఎక్కువ సామర్థ్యం గల ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధికి తమ 3డీ ప్రింట్ బయో కాలేయం ఒక పరీక్షా వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కొత్త ఔషధం మార్కెట్‌లోకి రావాలంటే దానికి చాలా ఏళ్లు, అధిక ఖర్చు అవుతోందని చెప్పారు. తమ కొత్త ఆవిష్కరణ వల్ల ఔషధ తయారీ ఖర్చు, కాలం రెండూ తగ్గుతాయని వివరించారు.