కాలేయాన్ని భద్రపరిచే పరికరం
కోయంబత్తూరు శాస్త్రవేత్తల ఆవిష్కరణ
టీ నగర్ (చెన్నై): కాలేయాన్ని 20 గంటల పాటు భద్రపరిచే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు పీఎస్‌జీ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్, పీఎస్‌జీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్లు దీన్ని రూపొందించారు. పరికరం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డా.స్వామినాథన్, డా.జోసెఫ్ జాన్, డా.కె.వెంకట్రామన్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సాధారణంగా కాలేయాన్ని ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా రోగులకు అమర్చాల్సి ఉంటుందని, లేకపోతే అది చెడిపోతుందని తెలిపారు. కాలేయంలోని కణాలు క్రమంగా మృతి చెందుతాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో కాలేయాన్ని 20 గంటలపాటు భద్రపరిచే నూతన పరికరాన్ని తాము అభివృద్ధి చేశామని వివరించారు. ఈ పరికరంలోని విడిభాగాలు చాలా వరకు భారత్‌లోనే తయారయ్యాయని, మోటార్, అల్ట్రా సౌండ్ సెన్సార్ విడిభాగాలు మాత్రం జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు.