PSG Medical Science Research Center
-
డాక్టర్ రోబో
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపరేషన్ థియేటర్లలో గంటల తరబడి నిల్చుని, ఎక్కువ మంది వైద్యుల సహకారంతో ఆపరేషన్ చేసే పరిస్థితులు త్వరలోనే మారనున్నాయి. ఎక్కువ మంది వైద్యుల అవసరం లేకుండా, సర్జన్లు సైతం తమ పనిని ప్రశాంతంగా పూర్తిచేసేందుకు వీలుగా రోబోను ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తయారుచేస్తున్నాడు. కోయంబత్తూరు పీఎస్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఎమ్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న అరవిందకుమార్ ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయమై అరవిందకుమార్ స్వయంగా మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.32 కోట్లను మంజూరు చేసింది. ప్రొఫెసర్లు వినోద్, సుందరం, ప్రభాకరన్ నా పరిశోధనలకు మార్గదర్శకులుగా ఉన్నారు. రోబో రూపకల్పనలో భాగంగా హార్డ్వేర్ తయారీని పూర్తిచేశాం. సాఫ్ట్వేర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాధారణంగా ఆపరేషన్ల సమయంలో ప్రధాన వైద్యుడితో పాటు చాలామంది డాక్టర్ల అవసరం ఉంటుంది. అలాగే వీరంతా గంటల తరబడి నిల్చుని శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇలాంటి సందర్భంగా వైద్యులు ఏమాత్రం అలసటకు లోనైనా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదే మేము అభివృద్ధి చేస్తున్న రోబో సాయంతో ప్రధాన వైద్యుడు ప్రశాంతంగా కూర్చుని ఆపరేషన్ చేయొచ్చు. తన మార్గంలో మనుషులు, గోడ ఎదురయితే సెన్సార్ల సాయంతో ఈ రోబో దిశను మార్చుకోగలదు. మార్కెట్లో అందుబాటులో ఉన్నవాటితో పోల్చుకుంటే చాలాతక్కువ ఖర్చుతో వీటిని తయారుచేయొచ్చు. త్వరలోనే ఈ రోబోకు తుదిమెరుగులు దిద్ది మార్కెట్లోకి తీసుకొస్తాం’ అని తెలిపారు. -
కాలేయాన్ని భద్రపరిచే పరికరం
కోయంబత్తూరు శాస్త్రవేత్తల ఆవిష్కరణ టీ నగర్ (చెన్నై): కాలేయాన్ని 20 గంటల పాటు భద్రపరిచే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు పీఎస్జీ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్, పీఎస్జీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు దీన్ని రూపొందించారు. పరికరం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డా.స్వామినాథన్, డా.జోసెఫ్ జాన్, డా.కె.వెంకట్రామన్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సాధారణంగా కాలేయాన్ని ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా రోగులకు అమర్చాల్సి ఉంటుందని, లేకపోతే అది చెడిపోతుందని తెలిపారు. కాలేయంలోని కణాలు క్రమంగా మృతి చెందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాలేయాన్ని 20 గంటలపాటు భద్రపరిచే నూతన పరికరాన్ని తాము అభివృద్ధి చేశామని వివరించారు. ఈ పరికరంలోని విడిభాగాలు చాలా వరకు భారత్లోనే తయారయ్యాయని, మోటార్, అల్ట్రా సౌండ్ సెన్సార్ విడిభాగాలు మాత్రం జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు.