సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపరేషన్ థియేటర్లలో గంటల తరబడి నిల్చుని, ఎక్కువ మంది వైద్యుల సహకారంతో ఆపరేషన్ చేసే పరిస్థితులు త్వరలోనే మారనున్నాయి. ఎక్కువ మంది వైద్యుల అవసరం లేకుండా, సర్జన్లు సైతం తమ పనిని ప్రశాంతంగా పూర్తిచేసేందుకు వీలుగా రోబోను ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తయారుచేస్తున్నాడు. కోయంబత్తూరు పీఎస్‌జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఎమ్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్న అరవిందకుమార్ ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ విషయమై అరవిందకుమార్ స్వయంగా మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.32 కోట్లను మంజూరు చేసింది. ప్రొఫెసర్లు వినోద్, సుందరం, ప్రభాకరన్ నా పరిశోధనలకు మార్గదర్శకులుగా ఉన్నారు. రోబో రూపకల్పనలో భాగంగా హార్డ్‌వేర్ తయారీని పూర్తిచేశాం. సాఫ్ట్‌వేర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాధారణంగా ఆపరేషన్ల సమయంలో ప్రధాన వైద్యుడితో పాటు చాలామంది డాక్టర్ల అవసరం ఉంటుంది. అలాగే వీరంతా గంటల తరబడి నిల్చుని శస్త్రచికిత్స చేస్తుంటారు.
ఇలాంటి సందర్భంగా వైద్యులు ఏమాత్రం అలసటకు లోనైనా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదే మేము అభివృద్ధి చేస్తున్న రోబో సాయంతో ప్రధాన వైద్యుడు ప్రశాంతంగా కూర్చుని ఆపరేషన్ చేయొచ్చు. తన మార్గంలో మనుషులు, గోడ ఎదురయితే సెన్సార్ల సాయంతో ఈ రోబో దిశను మార్చుకోగలదు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవాటితో పోల్చుకుంటే చాలాతక్కువ ఖర్చుతో వీటిని తయారుచేయొచ్చు. త్వరలోనే ఈ రోబోకు తుదిమెరుగులు దిద్ది మార్కెట్‌లోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment