Operation theaters
-
డాక్టర్ రోబో
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపరేషన్ థియేటర్లలో గంటల తరబడి నిల్చుని, ఎక్కువ మంది వైద్యుల సహకారంతో ఆపరేషన్ చేసే పరిస్థితులు త్వరలోనే మారనున్నాయి. ఎక్కువ మంది వైద్యుల అవసరం లేకుండా, సర్జన్లు సైతం తమ పనిని ప్రశాంతంగా పూర్తిచేసేందుకు వీలుగా రోబోను ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తయారుచేస్తున్నాడు. కోయంబత్తూరు పీఎస్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఎమ్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న అరవిందకుమార్ ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయమై అరవిందకుమార్ స్వయంగా మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.32 కోట్లను మంజూరు చేసింది. ప్రొఫెసర్లు వినోద్, సుందరం, ప్రభాకరన్ నా పరిశోధనలకు మార్గదర్శకులుగా ఉన్నారు. రోబో రూపకల్పనలో భాగంగా హార్డ్‌వేర్ తయారీని పూర్తిచేశాం. సాఫ్ట్వేర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాధారణంగా ఆపరేషన్ల సమయంలో ప్రధాన వైద్యుడితో పాటు చాలామంది డాక్టర్ల అవసరం ఉంటుంది. అలాగే వీరంతా గంటల తరబడి నిల్చుని శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇలాంటి సందర్భంగా వైద్యులు ఏమాత్రం అలసటకు లోనైనా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదే మేము అభివృద్ధి చేస్తున్న రోబో సాయంతో ప్రధాన వైద్యుడు ప్రశాంతంగా కూర్చుని ఆపరేషన్ చేయొచ్చు. తన మార్గంలో మనుషులు, గోడ ఎదురయితే సెన్సార్ల సాయంతో ఈ రోబో దిశను మార్చుకోగలదు. మార్కెట్లో అందుబాటులో ఉన్నవాటితో పోల్చుకుంటే చాలాతక్కువ ఖర్చుతో వీటిని తయారుచేయొచ్చు. త్వరలోనే ఈ రోబోకు తుదిమెరుగులు దిద్ది మార్కెట్లోకి తీసుకొస్తాం’ అని తెలిపారు. -
ఆస్పత్రిలో ఆకుపచ్చ రంగులే ఎందుకు వాడతారు?
ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆస్పత్రుల్లో రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఎక్కువ. వేరే రంగు దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత బాగా కనిపించి రోగులను వారి బంధువుల్ని భయాందోళనలకు గురిచేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రంగులు. ఈ రెండు రంగులూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొత్త రంగు ఏర్పడుతుంది. ఆ రంగు నలుపుగా ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం అనిపించదు. అందువలనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆస్పత్రి వార్డుల్లో పేషెంట్లకు కూడా ఆకుపచ్చని దుస్తులు ఇస్తారన్న విషయం తెలిసిందే. -
నిమ్స్ సేవలు నిల్
ఆంకాలజీ.. కార్డియాలజీ.. న్యూరాలజీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. అనస్థీషియా.. నెఫ్రాలజీ.. యూరాలజీ.. ప్లాస్టిక్ సర్జరీ ఇలా కీలకమైన విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. మహిళల కోసం గైనకాలజీ విభాగం ఉన్నా ఉపయోగం లేదు. ఒక్క కాన్పు కూడా చేయడంలేదు. దంత వైద్య విభాగంలో పన్ను పీకిందీ లేదు.. పెట్టిందీ లేదు.. చాలా విభాగాల్లో కత్తి పట్టని సర్జన్లు.. నాడి పట్టని ఫిజీషియన్లు ఎంతోమంది ఉన్నారు. మొత్తం 32 విభాగాలున్నా.. రోగులకు సేవలు ఆశించిన స్థాయిలో అందడంలేదు. - ఆస్పత్రిని వీడుతున్న సీనియర్లు - మూతపడుతున్న థియేటర్లు - పట్టించుకోని యాజమాన్యం సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధానిలో ఎయిమ్స్‌కు ఎంత పేరుందో రాష్ట్ర రాజధానిలోని నిమ్స్‌కు కూడా అంతే పేరుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు మృగ్యమయ్యాయి. కీలకమైన విభాగాల్లోని ఆపరేషన్ థియేటర్లు మూతపడుతున్నాయి.. సీనియర్ వైద్యులు ఆస్పత్రిని వదలిపోతున్నారు.. ఖాళీలు భర్తీ కావడంలేదు. మౌలిక సదుపాయాల కల్పనను మరిచారు. ఇలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల మాట అటుంచితే కనీస వైద్యమూ అందడంలేదు. నిమ్స్‌ను విస్తరిస్తామని, సేవలను మరింత మెరుగు పరుస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)కు తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకు సగటున రెండు వేల మంది వరకూ రోగులు వస్తుంటారు. ఇన్ పేషంట్లుగా 1500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కీలకమైన విభాగాల్లో అనుభవం ఉన్న వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నారు. ఉన్నతాధికారుల తీరు, అంతర్గత పోరు, వనరుల లేమి, వీటికితోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నట్టు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆస్పత్రిలో డెబ్బైకిపైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు ఇక్కడి పరిస్థితులు నిరాశే మిగులుతోంది. కీలక విభాగాల్లో రాజీనామాల పర్వం.. న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస పాణిగ్రహి ఇప్పటికే వెళ్లిపోగా, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ ఇటీవల తనపోస్టుకు రాజీనామా చేశారు. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు పది శాతానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇప్పటికే అనేకమంది ప్రతిభావంతులైన వైద్యులు నిమ్స్‌ను వీడగా, తాజాగా మరో ఇద్దరు వైద్యులు కూడా ఆస్పత్రిని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం. స్పెషాలిటీ బ్లాక్ మూడో అంతస్తులో ఆర్థోపెడిక్ విభాగానికి కేటాయించిన ఆపరేషన్ థియేటర్లను ఓ ఉన్నతాధికారి ఉద్దేశపూర్వకంగానే మూసివేయించారు. పాతభవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్‌ఫ్లో లేదు. చిన్నపాటి వర్షం కురిసినా పైకప్పు కురుస్తోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండటం వల్ల రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్టు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. కీలకమైన కార్డియో థొరాసిక్ విభాగం నిర్వహణకు సరైన వైద్యులే లేరు. ఆ విభాగాధిపతిపై ఆరోపణలు రావ డంతో ఇటీవల ఓ కమిటీ వేశారు. ఇప్పటివరకు ఆ కమిటీ ఏం తేల్చిందో కూడా తెలియదు. కేన్సర్ విభాగమున్నా.. లేనట్టుగానే.. సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాది పదవీ విరమణ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం వైద్యుల కొరత వల్ల ఆ విభాగం ఉన్నా లేనట్టుగానే తయారైంది. వైద్యం కోసం వచ్చిన రోగుల ను కనీసం పట్టించుకునే నాథుడే లేరు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలావుంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రాష్ట్ర రాజధాని నగరంలోనే అదీ ప్రతిష్టాత్మక ఆసుపత్రి పనితీరు ఇంత దారుణంగా ఉండడం గమనార్హం. -
ఆ‘పరేషాన్!’
ఉస్మానియా ఆపరేషన్ గదులకు తాళం చికిత్సలకు అంతరాయం ఆందోళనలో రోగులు... పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్ లేకపోవడంతో ఓపీ గదులే కాదు... ఆపరేషన్ థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. వైద్యులు లేకపోవడంతో న్యూరోఫిజీషియన్ ఓపీ గదికి ఇప్పటికే తాళాలు పడ్డాయి. నర్సులు, వార్డు బాయ్స్ లేమితో తాజాగా జనరల్ సర్జరీ విభాగంలోని ఆపరేషన్ థియేటర్-3 గదికి తాళాలు పడ్డాయి. దీంతో ఆ విభాగంలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడి రోగుల అవసరాలు పూర్తిగా తీర్చాలంటే కనీసం 835 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 309 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక కొన్ని విభాగాలు... వైద్య పరికరాలు, స్టాఫ్ నర్సులు లేక మరికొన్ని విభాగాలు మూత పడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే బయోమెట్రిక్ హాజరు సుమారు 1100 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి నిత్యం 1400 నుంచి 1600 మంది రోగులు వస్తుంటారు. ఇక్క డ నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా... వీటిలో ఇప్పటికే రెండు మూతపడ్డాయి. ఆరు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చిన్నాపెద్ద కలిపి నిత్యం సుమారు 150 సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 22 విభాగాలుంటే, 200పైగా వైద్యులు పని చేస్తున్నారు. వీరిలో సగం మంది అసలు ఆస్పత్రికే రావడం లేదు. ఒక వేళ వచ్చినా...ఓపీకి వెళ్లకుండా గదులకే పరిమితమవుతున్నారు. కొంతమంది దంపతులూ ఇక్కడ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆస్పత్రికి వచ్చి ఇద్దరి సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేశారు. దీన్ని ఉపయోగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల కొరత వల్ల రోగి బంధువులే సంరక్షకులుగా మారుతున్నారు. వార్డులకు తరలించడం మొదలు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి కీలక పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. ఎంఆర్డీ సెక్షన్లో సిబ్బంది కొరత వల్ల మెడికో లీగల్ కేసుల రికార్డులను పోలీసులే వెతుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు కీలకమైన రికార్డులు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొరాయిస్తున్న యంత్రాలు రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే సగం మూలకు చేరాయి. సిటీస్కాన్ గడువు ముగియడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సాధారణ రోగులు ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. రోగుల కోసం కేటాయించిన పేయింగ్ రూమ్‌ల్లో పరిపాలనాపరమైన పనులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆఫరేషన్ థియేటర్లకు తరలించే లిఫ్ట్‌లు పని చేయకపోవ డంతో ఇటీవల ఏకంగా సర్జరీలనే వాయిదా వేయాల్సి వచ్చింది. -
జీజీహెచ్‌లో ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం
గుంటూరు మెడికల్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్లో కోటీ 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి విరాళాలిచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, గుంటూరు ఆద ర్శ్ సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింఖానాగా ఏర్పడి మాతృసంస్థ అభివృద్ధికి రూ.33 కోట్లు ఇవ్వటం ఎంతో అభినందనీయమని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన ఆధునిక వైద్యసేవలు అందజేస్తామన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే సహించబోమన్నారు. అందరి ఆరోగ్యం కోసం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలందిస్తే జీవితమంతూ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. జీజీహెచ్‌ను ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దాలని కోరారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.ఐదు కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్ అభినందనీయులన్నారు. ఇలాంటి సేవా గుణం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను గుంటూరు మోడీగా అభివర్ణించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని వైద్యాధికారులను కోరారు మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ పిపిపి విధానంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేస్తామని చెప్పారు. వైద్యవిద్యను బలోపేతం చేస్తామన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ ట్రామాకేర్ సెంటర్ కు ప్రత్యేక సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిని ఇవ్వాలని మంత్రిని కోరారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరిక పర్తి శైలబాల జింఖానా సేవలను కొనియూడారు. జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వైవిఎస్ ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్ల ప్రత్యేకతను వివరించారు. అవయవ మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు వీలుగా నిర్మించినట్లు వెల్లడించారు. అనంతరం జింఖానా ప్రతినిధులను, రోటరీ క్లబ్ సభ్యులను మంత్రి డాక్టర్ కామినేని సన్మానించారు. కార్యక్రమంలో జింఖానా ప్రతినిధులు డాక్టర్ వెనిగళ్ళ బాలభాస్కరరావు, డాక్టర్ పి.వి.హనుమంతురావు, డాక్టర్ పి.బాబురెడ్డి సాగిరెడ్డి, రోటరీ క్లబ్ గుంటూరు ప్రెసిడెంట్ కె.చంద్రశేఖరరావు, బి.వి.అప్పారావు, మట్లుపల్లి సునీత, సెక్రటరీ కె.చంద్రశేఖరరావు, డాక్టర్ ఈదర లోకేశ్వరరావు, ఆర్డీ డాక్టర్ షాలినీదేవి, డీఎంహెచ్ఓ నాగమల్లేశ్వరి, అడిషనల్ డీఎంహెచ్ఓ ఉమాదేవి, డీసీహెచ్ శ్రీదేవి, వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజునాయుడు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్, ఆర్ఎంఓ శ్రీనివాసులు, ఏడీ ఉదయభాస్కర్, టీడీపీ నేత మద్దాలి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై నర్సులు, ఫార్మిసిస్టుల సంఘాల నేతలు మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. -
అమ్మో.. ఆపరేషన్
సర్జన్లకు సవాలు.. రోగులకు ప్రాణసంకటం కేజీహెచ్ ఆపరేషన్ థియేటర్లలో కొరవడిన కనీస సదుపాయాలు జనరేటర్లూ లేని వైనం కొవ్వొత్తుల వెలుగే శరణ్యం నానాటికీ తగ్గిపోతున్న శస్త్రచికిత్సలు విశాఖపట్నం, మెడికల్:ఋ కేజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు అధ్వానంగా తయారవుతున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస సదుపాయలు కొరవడటంతో ఆపరేషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో రోజుకు వంద జరిగేవి. ప్రస్తు తం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. 1050 పడకల సామర్ధ్యం గల పెద్పాస్పత్రిలో 10 ఆపరేషన్ థియేటర్లున్నాయి. ప్రధానంగా ఏఓటీ, బీఓటీలో ఎక్కువ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటిని జంట థియేటర్లుగా పిలుస్తారు. ట్రామాకేర్ సెంటర్లోని ఆర్థో, న్యూరో ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యవసర రోగులకు చిన్న,చితకా ఆపరేషన్లు చేసేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఎముకల చికిత్స విభాగంలో ఆర్థో ఆపరేషన్ థియేటర్, ఓపీ కాంప్లెక్స్‌లో ఎబ్డన్ ఆపరేషన్ థియేటర్లు , సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో ప్లాస్టిక్ సర్జరీ, పిల్లల శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో జంట ఆపరేషన్ థియేటర్లు మినహా మిగిలిన చోట కనీస సదుపాయాలు తీసికట్టుగా ఉంటున్నాయని సర్జన్లే పెదవి విరుస్తున్నారు. సర్జన్లలకు సవాలు..రోగులకు ప్రాణసంకటం రెండింటికి మినహా మిగిలిన వాటికి జనరేటర్ సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. అటువంటి సమయాల్లో టార్చిలైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లున్న చోట కిరోసిన్ లేక సకాలంలో పనిచేయక ఇబ్బందులుపాలుచేస్తున్నాయి, జనరేటర్ పనిచేసినా అవి కేవలం వెలుతురుకు తప్ప పరికరాలను నడిపించలేకపోతున్నాయి. ఇటు సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లకు శస్త్రచికిత్సలు సవాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఒక యూనిట్ వైద్యులు జంట ఆపరేషన్ థియేటర్లలో ఏకకాలంలో ఇద్దరు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండగా మధ్యలో కరె ంట్ పోవడం, జనరేటర్ సకాలంలో పనిచేయకపోవడం వల్ల శస్త్రచికిత్సలకు అవరోధం కలిగి ఇద్దరు రోగులు ఆపరేషన్ థియేటర్లలోనే మృత్యువాత పడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సంఘటన నేపథ్యంలో ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్ సర్జన్ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఆపరేషన్ థియేటర్లకు ఇన్వర్టర్లు ఏర్పాటు చే సి అవసరమైన అన్ని వైద్య పరికరాలను సక్రమంగా పనిచేసేలా చూడాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. జనరేటర్లూ లేవు వైద్య పరికరాల స్థితిగతులు కూడా దారుణంగా ఉన్నాయి. విద్యుత్ కోత సమస్య వేధిస్తోంది. ఇన్వర్టర్లు ఏ థియేటర్‌కు లేవు. దీంతో వైద్య పరికరాలు పనిచేయవు. శస్త్ర చికిత్సల్లో నాణ్యత లేని సర్జకల్ సామగ్రి వినియోగిస్తున్నారు. థియేటర్లలో స్టెరిలైజేషన్ సక్రమంగా ఉండడం లేదు. -
నిమ్స్ గతి ఇంతే!
బీబీనగర్‌లో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరులో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పనులు చాలా వరకు లోపభూయిష్టంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది. కాంట్రాక్టర్ కొత్త పేచీ.. ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు.. మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్‌ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చే స్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్‌కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే... స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని భావిం చారు. ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 6 నెలలు పడుతుంది.. నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కాంట్రాక్టర్‌తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్‌తో మళ్లీ చర్చించి ఓ నిర్ణ యం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో6 నెలల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి. - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్ -
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలన
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఇద్దరు సభ్యులు గల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను పరిశీలించింది. అహ్మదాబాద్ మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ భరత్షా, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌రావులు ఉదయం ఆరు గంటలకే కళాశాలకు చేరుకున్నారు. భరత్షా కళాశాలకు అనుబంధమైన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు సేవలు ఎలా అందిస్తున్నారు. వివిధ విభాగాల ఏర్పాటు, వైద్యులు ఎంత మంది ఉన్నారు. వైద్యపరీక్షలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి విడివిడిగా పరిశీలన చేశారు. నూతన భవనంలో విభాగాల ఏర్పాటు సంతృప్తి కరంగా ఉందంటూ తెలియజేశారు.అయితే రోగులకు వైద్యసేవలు అందించడంలో వైద్యుల ఏర్పాటుపై ప్రశ్నించినట్లు తెలిసింది. మెడికల్ కళాశాలలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు లెక్చరర్ గ్యాలరీ, తరగతి గదులు, ఆడిటోరియం, శవపరీక్ష గదులు, ల్యాబ్స్, గ్రంథాలయం తదితర విభాగాలను పరిశీలించారు. ప్రొఫెసర్ల నియామకంపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, వారికి ఇప్పటి వరకు బోధించిన విద్యావిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పరిశీలన జరిగింది.అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి 10.30 గంటల వరకు నివేదికల పరిశీలించారు. శనివారం కూడా ఎంసీఐ బృంద సభ్యులు పరిశీలనలు చేస్తారు. అనంతరం నివేదికలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు (ఎంసీఐ) సమర్పిస్తారు. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల అనుమతి కోసం ఈ పరిశీలన సాగింది. -
ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ, ఓటీలు యథావిధిగా సేవలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్ థియేటర్లు సోమవారం నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి. పేదలు, ఆరోగ్యశ్రీ రోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఓపీ, ఓటీ విధుల బహిష్కరణను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సమైక్యాంధ్ర మెడికల్ జేఏసీ కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్‌సుందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలు కూడా సోమవారం నుం చి కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ రూపా ల్లో రోజూ నిరసన కార్యక్రమాలను ఆస్పత్రుల ఎదుట కొనసాగిస్తామన్నారు. ఈ నెల 21 నుంచి రాష్ట్ర విభజన నిరసిస్తూ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకట నకు నిరసనగా పదిహేను రోజులకు పైగా మెడికల్ జేఏసీ సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్లను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, ఓటీ వైద్యసేవలు స్తంభించాయి. ప్రస్తుతం తమ విధుల బహిష్కరణను విరమించడంతో సోమవారం నుంచి అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులతోపాటు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. కేజీహెచ్‌తోపాటు ఆంధ్రవైద్య కళాశాల పరిధిలోని అనుబంధ ఆస్పత్రులన్నింటిలో ఓపీ, ఓటీ విధులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు కేజీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. రోగులు యథావిధిగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవల కోసం హాజరు కావాలని ఆయన కోరారు.