నిమ్స్ సేవలు నిల్
ఆంకాలజీ.. కార్డియాలజీ.. న్యూరాలజీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. అనస్థీషియా.. నెఫ్రాలజీ.. యూరాలజీ.. ప్లాస్టిక్ సర్జరీ ఇలా కీలకమైన విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. మహిళల కోసం గైనకాలజీ విభాగం ఉన్నా ఉపయోగం లేదు. ఒక్క కాన్పు కూడా చేయడంలేదు. దంత వైద్య విభాగంలో పన్ను పీకిందీ లేదు.. పెట్టిందీ లేదు.. చాలా విభాగాల్లో కత్తి పట్టని సర్జన్లు.. నాడి పట్టని ఫిజీషియన్లు ఎంతోమంది ఉన్నారు. మొత్తం 32 విభాగాలున్నా.. రోగులకు సేవలు ఆశించిన స్థాయిలో అందడంలేదు.
- ఆస్పత్రిని వీడుతున్న సీనియర్లు
- మూతపడుతున్న థియేటర్లు
- పట్టించుకోని యాజమాన్యం
సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధానిలో ఎయిమ్స్‌కు ఎంత పేరుందో రాష్ట్ర రాజధానిలోని నిమ్స్‌కు కూడా అంతే పేరుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు మృగ్యమయ్యాయి. కీలకమైన విభాగాల్లోని ఆపరేషన్ థియేటర్లు మూతపడుతున్నాయి.. సీనియర్ వైద్యులు ఆస్పత్రిని వదలిపోతున్నారు.. ఖాళీలు భర్తీ కావడంలేదు. మౌలిక సదుపాయాల కల్పనను మరిచారు.
ఇలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల మాట అటుంచితే కనీస వైద్యమూ అందడంలేదు. నిమ్స్‌ను విస్తరిస్తామని, సేవలను మరింత మెరుగు పరుస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)కు తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకు సగటున రెండు వేల మంది వరకూ రోగులు వస్తుంటారు. ఇన్ పేషంట్లుగా 1500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
కీలకమైన విభాగాల్లో అనుభవం ఉన్న వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నారు. ఉన్నతాధికారుల తీరు, అంతర్గత పోరు, వనరుల లేమి, వీటికితోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఆస్పత్రిని వీడిపోతున్నట్టు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆస్పత్రిలో డెబ్బైకిపైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు ఇక్కడి పరిస్థితులు నిరాశే మిగులుతోంది.
కీలక విభాగాల్లో రాజీనామాల పర్వం..
న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస పాణిగ్రహి ఇప్పటికే వెళ్లిపోగా, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ ఇటీవల తనపోస్టుకు రాజీనామా చేశారు. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు పది శాతానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇప్పటికే అనేకమంది ప్రతిభావంతులైన వైద్యులు నిమ్స్‌ను వీడగా, తాజాగా మరో ఇద్దరు వైద్యులు కూడా ఆస్పత్రిని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం.
స్పెషాలిటీ బ్లాక్ మూడో అంతస్తులో ఆర్థోపెడిక్ విభాగానికి కేటాయించిన ఆపరేషన్ థియేటర్లను ఓ ఉన్నతాధికారి ఉద్దేశపూర్వకంగానే మూసివేయించారు. పాతభవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్‌ఫ్లో లేదు. చిన్నపాటి వర్షం కురిసినా పైకప్పు కురుస్తోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండటం వల్ల రోగులు ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్టు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. కీలకమైన కార్డియో థొరాసిక్ విభాగం నిర్వహణకు సరైన వైద్యులే లేరు. ఆ విభాగాధిపతిపై ఆరోపణలు రావ డంతో ఇటీవల ఓ కమిటీ వేశారు. ఇప్పటివరకు ఆ కమిటీ ఏం తేల్చిందో కూడా తెలియదు.
కేన్సర్ విభాగమున్నా.. లేనట్టుగానే..
సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాది పదవీ విరమణ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం వైద్యుల కొరత వల్ల ఆ విభాగం ఉన్నా లేనట్టుగానే తయారైంది. వైద్యం కోసం వచ్చిన రోగుల ను కనీసం పట్టించుకునే నాథుడే లేరు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇదిలావుంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రాష్ట్ర రాజధాని నగరంలోనే అదీ ప్రతిష్టాత్మక ఆసుపత్రి పనితీరు ఇంత దారుణంగా ఉండడం గమనార్హం.