జీజీహెచ్‌లో ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం
గుంటూరు మెడికల్
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్‌లో కోటీ 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి విరాళాలిచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, గుంటూరు ఆద ర్శ్ సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింఖానాగా ఏర్పడి మాతృసంస్థ అభివృద్ధికి రూ.33 కోట్లు ఇవ్వటం ఎంతో అభినందనీయమని అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన ఆధునిక వైద్యసేవలు అందజేస్తామన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే సహించబోమన్నారు. అందరి ఆరోగ్యం కోసం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలందిస్తే జీవితమంతూ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. జీజీహెచ్‌ను ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దాలని కోరారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.ఐదు కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్ అభినందనీయులన్నారు.
ఇలాంటి సేవా గుణం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను గుంటూరు మోడీగా అభివర్ణించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని వైద్యాధికారులను కోరారు మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ పిపిపి విధానంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేస్తామని చెప్పారు.
వైద్యవిద్యను బలోపేతం చేస్తామన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ ట్రామాకేర్ సెంటర్ కు ప్రత్యేక సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిని ఇవ్వాలని మంత్రిని కోరారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గరిక పర్తి శైలబాల జింఖానా సేవలను కొనియూడారు. జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వైవిఎస్ ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్ల ప్రత్యేకతను వివరించారు.
అవయవ మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు వీలుగా నిర్మించినట్లు వెల్లడించారు. అనంతరం జింఖానా ప్రతినిధులను, రోటరీ క్లబ్ సభ్యులను మంత్రి డాక్టర్ కామినేని సన్మానించారు. కార్యక్రమంలో జింఖానా ప్రతినిధులు డాక్టర్ వెనిగళ్ళ బాలభాస్కరరావు, డాక్టర్ పి.వి.హనుమంతురావు, డాక్టర్ పి.బాబురెడ్డి సాగిరెడ్డి, రోటరీ క్లబ్ గుంటూరు ప్రెసిడెంట్ కె.చంద్రశేఖరరావు, బి.వి.అప్పారావు, మట్లుపల్లి సునీత, సెక్రటరీ కె.చంద్రశేఖరరావు, డాక్టర్ ఈదర లోకేశ్వరరావు, ఆర్డీ డాక్టర్ షాలినీదేవి, డీఎంహెచ్‌ఓ నాగమల్లేశ్వరి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఉమాదేవి, డీసీహెచ్ శ్రీదేవి, వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజునాయుడు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్, ఆర్‌ఎంఓ శ్రీనివాసులు, ఏడీ ఉదయభాస్కర్, టీడీపీ నేత మద్దాలి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై నర్సులు, ఫార్మిసిస్టుల సంఘాల నేతలు మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.