అమ్మో.. ఆపరేషన్
- సర్జన్లకు సవాలు.. రోగులకు ప్రాణసంకటం
- కేజీహెచ్ ఆపరేషన్ థియేటర్లలో కొరవడిన కనీస సదుపాయాలు
- జనరేటర్లూ లేని వైనం
- కొవ్వొత్తుల వెలుగే శరణ్యం
- నానాటికీ తగ్గిపోతున్న శస్త్రచికిత్సలు
విశాఖపట్నం, మెడికల్:ఋ కేజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు అధ్వానంగా తయారవుతున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస సదుపాయలు కొరవడటంతో ఆపరేషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో రోజుకు వంద జరిగేవి. ప్రస్తు తం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. 1050 పడకల సామర్ధ్యం గల పెద్పాస్పత్రిలో 10 ఆపరేషన్ థియేటర్లున్నాయి. ప్రధానంగా ఏఓటీ, బీఓటీలో ఎక్కువ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటిని జంట థియేటర్లుగా పిలుస్తారు.
ట్రామాకేర్ సెంటర్‌లోని ఆర్థో, న్యూరో ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యవసర రోగులకు చిన్న,చితకా ఆపరేషన్లు చేసేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఎముకల చికిత్స విభాగంలో ఆర్థో ఆపరేషన్ థియేటర్, ఓపీ కాంప్లెక్స్‌లో ఎబ్డన్ ఆపరేషన్ థియేటర్లు , సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో ప్లాస్టిక్ సర్జరీ, పిల్లల శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో జంట ఆపరేషన్ థియేటర్లు మినహా మిగిలిన చోట కనీస సదుపాయాలు తీసికట్టుగా ఉంటున్నాయని సర్జన్లే పెదవి విరుస్తున్నారు.
సర్జన్లలకు సవాలు..రోగులకు ప్రాణసంకటం
రెండింటికి మినహా మిగిలిన వాటికి జనరేటర్ సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. అటువంటి సమయాల్లో టార్చిలైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లున్న చోట కిరోసిన్ లేక సకాలంలో పనిచేయక ఇబ్బందులుపాలుచేస్తున్నాయి, జనరేటర్ పనిచేసినా అవి కేవలం వెలుతురుకు తప్ప పరికరాలను నడిపించలేకపోతున్నాయి.
ఇటు సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లకు శస్త్రచికిత్సలు సవాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఒక యూనిట్ వైద్యులు జంట ఆపరేషన్ థియేటర్లలో ఏకకాలంలో ఇద్దరు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండగా మధ్యలో కరె ంట్ పోవడం, జనరేటర్ సకాలంలో పనిచేయకపోవడం వల్ల శస్త్రచికిత్సలకు అవరోధం కలిగి ఇద్దరు రోగులు ఆపరేషన్ థియేటర్లలోనే మృత్యువాత పడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సంఘటన నేపథ్యంలో ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్ సర్జన్ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఆపరేషన్ థియేటర్లకు ఇన్వర్టర్లు ఏర్పాటు చే సి అవసరమైన అన్ని వైద్య పరికరాలను సక్రమంగా పనిచేసేలా చూడాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతోంది.
జనరేటర్లూ లేవు
వైద్య పరికరాల స్థితిగతులు కూడా దారుణంగా ఉన్నాయి.
విద్యుత్ కోత సమస్య వేధిస్తోంది.
ఇన్వర్టర్లు ఏ థియేటర్‌కు లేవు. దీంతో వైద్య పరికరాలు పనిచేయవు.
శస్త్ర చికిత్సల్లో నాణ్యత లేని సర్జకల్ సామగ్రి వినియోగిస్తున్నారు.
థియేటర్లలో స్టెరిలైజేషన్ సక్రమంగా ఉండడం లేదు.