Tramaker Center
-
ట్రామా‘కేర్’ లేకపాయె
దశాబ్దం క్రితం ఇక్కడి బాదేపల్లి ఆస్పత్రికి అనుబంధంగా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పటి పాలకులు యత్నించారు.. అయితే అది ఫలించకపోవడంతో ఆ తర్వాత దాని గురించి మాట్లాడే వారే కరువయ్యారు... జడ్చర్లలో దీనిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి.. దీంతో వివిధ సంఘటనల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందడంలేదు.. పలు సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రాణాలు హరీమన్న సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి.. ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ క్షతగాత్రుడిని హుటాహుటిన బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటం, ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం, వైద్యం అందడంలో ఆలస్యం చోటు చేసుకోడం తదితర కారణాలతో అతను మరణించాడు. ‘అరె కొద్దిగా ముందుగా తీసుకువచ్చి ఉంటే ఇతడిని బతికించే వారిమే..’ అన్న వైద్యుల మాటలు అక్షరాల నిత్య సత్యాలే. అయితే పరిస్థితి అలా లేదు. గాయపడిని వారిని సరైన ఆస్పత్రికి చేర్చడంలో ఆలస్యం చోటుచేసుకోవడంతో వారికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నది ఒక్కరో ఇద్దరో కాదు ప్రతి ఏటా వందల సంఖ్యలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందించే మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పేర్కొంటారు. ఇలాంటి అమూల్యమైన సమయంలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్సలు నిర్వహిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకుగాను తక్షణమే వైద్యం అందించే కేంద్రం ట్రామాకేర్ సెంటర్. దానిని జడ్చర్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఉన్నా పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. అంతేగాక అక్కడికి చేరడానికి ఆలస్యం జరుగుతుండటంతో వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అటు జాతీయ రహదారిని, ఇటు అంతర్రాష్ట్రీయ రహదారితో పాటు ఎక్కువగా పరిశ్రమలు కలిగి ఉన్న జడ్చర్ల, షాద్‌నగర్ తదితర నియోజకవర్గాలకు ఈ ప్రాంతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక నాలుగు వైపులా ఎటు నుంైచైనా సులువుగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆస్పత్రికి చేరుకోవచ్చు. వీటితో పాటు అటు హైదరాబాద్ ఇటు కర్నూలుకు ఈ ప్రాంతం అనుకూలమేగాక జిల్లా నడిబొడ్డున ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ట్రామాకేర్ సెంటర్ ఏ ర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా రు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ దిశగా చ ర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎన్నో ఉపయోగాలు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే వైద్యసాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలా మంది తీవ్రమైన రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం, తీవ్ర గాయాలు, మానసిక ఆందోళనకు లోనవుతారు. ఇలాంటి వారికి ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట సమయంలో వారిని ఆస్పత్రికి తరలించి అంతర్గత రక్తస్రావం కాకుండా నివారణ చర్యలతో పాటు అవసరమైన ఆక్సిజన్, రక్తం ఎక్కించడం తదితర వైద్య సేవలు అందించగలిగితే 20-30 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ట్రామాకేర్ సెంటర్ల లో వీలైనంత త్వరగా నిపుణుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించవచ్చు. -
అమ్మో.. ఆపరేషన్
సర్జన్లకు సవాలు.. రోగులకు ప్రాణసంకటం కేజీహెచ్ ఆపరేషన్ థియేటర్లలో కొరవడిన కనీస సదుపాయాలు జనరేటర్లూ లేని వైనం కొవ్వొత్తుల వెలుగే శరణ్యం నానాటికీ తగ్గిపోతున్న శస్త్రచికిత్సలు విశాఖపట్నం, మెడికల్:ఋ కేజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు అధ్వానంగా తయారవుతున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస సదుపాయలు కొరవడటంతో ఆపరేషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో రోజుకు వంద జరిగేవి. ప్రస్తు తం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. 1050 పడకల సామర్ధ్యం గల పెద్పాస్పత్రిలో 10 ఆపరేషన్ థియేటర్లున్నాయి. ప్రధానంగా ఏఓటీ, బీఓటీలో ఎక్కువ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటిని జంట థియేటర్లుగా పిలుస్తారు. ట్రామాకేర్ సెంటర్లోని ఆర్థో, న్యూరో ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యవసర రోగులకు చిన్న,చితకా ఆపరేషన్లు చేసేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఎముకల చికిత్స విభాగంలో ఆర్థో ఆపరేషన్ థియేటర్, ఓపీ కాంప్లెక్స్‌లో ఎబ్డన్ ఆపరేషన్ థియేటర్లు , సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో ప్లాస్టిక్ సర్జరీ, పిల్లల శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో జంట ఆపరేషన్ థియేటర్లు మినహా మిగిలిన చోట కనీస సదుపాయాలు తీసికట్టుగా ఉంటున్నాయని సర్జన్లే పెదవి విరుస్తున్నారు. సర్జన్లలకు సవాలు..రోగులకు ప్రాణసంకటం రెండింటికి మినహా మిగిలిన వాటికి జనరేటర్ సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. అటువంటి సమయాల్లో టార్చిలైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లున్న చోట కిరోసిన్ లేక సకాలంలో పనిచేయక ఇబ్బందులుపాలుచేస్తున్నాయి, జనరేటర్ పనిచేసినా అవి కేవలం వెలుతురుకు తప్ప పరికరాలను నడిపించలేకపోతున్నాయి. ఇటు సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లకు శస్త్రచికిత్సలు సవాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఒక యూనిట్ వైద్యులు జంట ఆపరేషన్ థియేటర్లలో ఏకకాలంలో ఇద్దరు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండగా మధ్యలో కరె ంట్ పోవడం, జనరేటర్ సకాలంలో పనిచేయకపోవడం వల్ల శస్త్రచికిత్సలకు అవరోధం కలిగి ఇద్దరు రోగులు ఆపరేషన్ థియేటర్లలోనే మృత్యువాత పడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సంఘటన నేపథ్యంలో ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్ సర్జన్ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఆపరేషన్ థియేటర్లకు ఇన్వర్టర్లు ఏర్పాటు చే సి అవసరమైన అన్ని వైద్య పరికరాలను సక్రమంగా పనిచేసేలా చూడాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. జనరేటర్లూ లేవు వైద్య పరికరాల స్థితిగతులు కూడా దారుణంగా ఉన్నాయి. విద్యుత్ కోత సమస్య వేధిస్తోంది. ఇన్వర్టర్లు ఏ థియేటర్‌కు లేవు. దీంతో వైద్య పరికరాలు పనిచేయవు. శస్త్ర చికిత్సల్లో నాణ్యత లేని సర్జకల్ సామగ్రి వినియోగిస్తున్నారు. థియేటర్లలో స్టెరిలైజేషన్ సక్రమంగా ఉండడం లేదు. -
పోస్టుల భర్తీలో.. ‘డ్రామా’కేర్!
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌కు సంబంధించి ఖాళీ పోస్టుల భర్తీలో ఉన్నతాధికారులు ప్రతిభకు పాతరేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్తీ ప్రక్రియ బాధ్యతను రిమ్స్ అధికారులు తీసుకోవడంతోనే దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. ట్రామాకేర్‌కు చెందిన వివిధ విభాగాల్లో 43 పోస్టుల నియామకాలను అధికారు లు చేపట్టారు. వాస్తవానికి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఇదే విధానం అవలంభించగా, ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా రిమ్స్ అధికారులు ఆ బాధ్యత చేపట్టేందుకు ఉత్సుకత చూపారు. జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకుని బలవంతంగా బాధ్యత తీసుకున్నారు. ఈ పరిణామంపై అప్పట్లోనే జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి విస్మయానికి గురైనా జిల్లా ఉన్నతాధికారే వారికి అవకాశం ఇవ్వడంతో మౌనం వహించాల్సి వచ్చింది. కాగా రిమ్స్ అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 1945 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులకు ప్రాథమిక మెరిట్ జాబితా వివరాలు తెలియజేసేం దుకు వీలుగా దరఖాస్తుతోపాటే సొంత చిరునామా గత కవరును జత చేయమని నోటిఫికేషన్లో సూచించడంతో, అలాగే చేసిన అభ్యర్థులు మెరిట్ వివరాల కోసం ఎదురుచూశారు. కానీ ఆ సమాచారం పంపకుండా నేరుగా మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి వెబ్సైట్లో పెట్టేయడంతో అభ్యర్థులు హతాశులయ్యారు. నిబంధనల ప్రకారం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి వివరాలతో మొదట మెరిట్ జాబితా ప్రకటిం చాలి. దానిపై అభ్యంతరాలు తెలిపేందు కు తగిన గడువు ఇవ్వాలి. అందిన అభ్యంతరాలను పరిశీలించి, తదనుగుణంగా మార్పులు చేర్పులతో తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఏ శాఖలోనైనా ఇదే విధానం అనుసరిస్తారు. రిమ్స్‌లోనూ గతంలో జరిగిన నియామకాల్లో ఇదే పద్ధతి పాటించారు. కానీ ట్రామాకేర్ పోస్టుల విషయంలో మాత్రం దీనికి తిలోదకాలిచ్చి ఎకాఎకిన తుది జాబితా ప్రకటించేశారు. పోస్టుకో రోస్టర్ రోస్టర్ పాయింట్ల కేటాయింపులోనూ మతలబులు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ట్రామాకేర్‌లో చేపట్టిన నియామకాలకు, ఇప్పటి నియామకాలతో లింక్ చేస్తూ రోస్టర్ పాయిం ట్లు నిర్ణయించి రిజర్వేషన్లు ఖరారు చేశా రు. అయితే అన్ని పోస్టులకు ఒకేలా కాకుండా ఒక్కో పోస్టుకు ఒక్కో రీతిలో రోస్టర్ అనుసరించారు. ఊదాహరణకు ఒక ఎలక్ట్రీషియన్ పోస్టుకు రోస్టర్ పాయింట్ నాలుగుగా చూపించి బీసీ-ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారు. గతంలో మూడు ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీ చేసినందున ఇప్పుడున్న ఒక్క పోస్టుకు రోస్టర్ పాయింట్ నాలుగుకు చేరిందని అధికారులు వివరించారు. అయితే డ్రైవర్ పోస్టుల విషయంలో మాత్రం ఈ సూత్రం అనుసరించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. గతంలో మూడు డ్రైవర్ పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం రెండు పోస్టులకు నియామకాలు చేపట్టినందున పైన పేర్కొన్న విధానం ప్రకా రం రోస్టర్ పాయింట్ నాలుగు, ఐదుగా రావాలి. దానికి అనుగుణంగా ఈ పోస్టులను బీసీ-ఏ, ఓపెన్ కేటగిరీలకు రిజర్వ్ చేయాలి. కానీ గతంలో భర్తీ చేసిన మూడు పోస్టులను లెక్కలోకి తీసుకోకుం డా కొత్త రోస్టర్ పాయింట్ చూపించారు. ఆ మేరకు రెండు కొత్త పోస్టులను ఓసీ(డబ్ల్యూ), ఎస్సీ (డబ్ల్యూ) అభ్యర్థులకు కేటాయించారు. ఎలక్ట్రీషియన్ పోస్టులకు ఒకలా, డ్రైవర్ పోస్టులకు మరోలా రోస్టర్ పాయింట్లు కేటాయించడం మాయ చేయడమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యంతరాలకు అవకాశమే లేదు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపేం దుకు ఎలాంటి అవకాశం లేకుండా నియామకాల తంతు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండవ శని వారం, తర్వాత ఆదివారం, ఆ తర్వాత సంక్రాంతి.. ఇలా వరుసగా సెలవులు మొదలుకావడానికి ముందు రోజు(శుక్రవారం) రాత్రి తుది జాబితాను ప్రకటించడాన్ని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సెలవుల తర్వాత 16వ తేదీన ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించి, ఆ వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వనుండటంతో అభ్యంతరాలకే అవకాశం లేకుండా పోయిందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా పోస్టుల నియామక ప్రాతిపదిక, రోస్టర్ కేటాయింపు వివరాలు అందజేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సమాచార హక్కు చట్టం ద్వారా రిమ్స్ డెరైక్టర్‌ను శనివారం సాయంత్రం కోరగా వారు నిరాకరించారు. డ్రైవర్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, తనకు అన్యాయం జరిగిందంటూ కె.శాంతారావు అనే అభ్యర్థి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇవ్వాలని కోర గా నేరుగా దరఖాస్తు ఇస్తే తీసుకోబోమని, పోస్టు ద్వారానే పంపాలని చెప్పి పంపించేశారు. పరిపాలన విభాగం వారే చూశారు: డెరైక్టర్ నియామక ప్రక్రియను పరిపాలన విభాగం అధికారులే చూశారు, గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా చేపట్టారని రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అయితే గతంలో జరి గిన పోస్టుల భర్తీలో తొలి, తుది మెరిట్ జాబితాలు పెట్టిన విషయాన్ని ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. పరిపాలన విభాగం అధికారులతో చర్చించి, అవసరమైతే మరో మెరిట్ లిస్టు పెడతామన్నారు.