పోస్టుల భర్తీలో.. ‘డ్రామా’కేర్!
Published Sun, Jan 12 2014 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌కు సంబంధించి ఖాళీ పోస్టుల భర్తీలో ఉన్నతాధికారులు ప్రతిభకు పాతరేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్తీ ప్రక్రియ బాధ్యతను రిమ్స్ అధికారులు తీసుకోవడంతోనే దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. ట్రామాకేర్‌కు చెందిన వివిధ విభాగాల్లో 43 పోస్టుల నియామకాలను అధికారు లు చేపట్టారు. వాస్తవానికి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఇదే విధానం అవలంభించగా, ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా రిమ్స్ అధికారులు ఆ బాధ్యత చేపట్టేందుకు ఉత్సుకత చూపారు. జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకుని బలవంతంగా బాధ్యత తీసుకున్నారు. ఈ పరిణామంపై అప్పట్లోనే జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి విస్మయానికి గురైనా జిల్లా ఉన్నతాధికారే వారికి అవకాశం ఇవ్వడంతో మౌనం వహించాల్సి వచ్చింది. కాగా రిమ్స్ అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 1945 దరఖాస్తులు వచ్చాయి.
అభ్యర్థులకు ప్రాథమిక మెరిట్ జాబితా వివరాలు తెలియజేసేం దుకు వీలుగా దరఖాస్తుతోపాటే సొంత చిరునామా గత కవరును జత చేయమని నోటిఫికేషన్‌లో సూచించడంతో, అలాగే చేసిన అభ్యర్థులు మెరిట్ వివరాల కోసం ఎదురుచూశారు. కానీ ఆ సమాచారం పంపకుండా నేరుగా మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి వెబ్‌సైట్‌లో పెట్టేయడంతో అభ్యర్థులు హతాశులయ్యారు. నిబంధనల ప్రకారం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి వివరాలతో మొదట మెరిట్ జాబితా ప్రకటిం చాలి. దానిపై అభ్యంతరాలు తెలిపేందు కు తగిన గడువు ఇవ్వాలి. అందిన అభ్యంతరాలను పరిశీలించి, తదనుగుణంగా మార్పులు చేర్పులతో తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఏ శాఖలోనైనా ఇదే విధానం అనుసరిస్తారు. రిమ్స్‌లోనూ గతంలో జరిగిన నియామకాల్లో ఇదే పద్ధతి పాటించారు. కానీ ట్రామాకేర్ పోస్టుల విషయంలో మాత్రం దీనికి తిలోదకాలిచ్చి ఎకాఎకిన తుది జాబితా ప్రకటించేశారు.
పోస్టుకో రోస్టర్
రోస్టర్ పాయింట్ల కేటాయింపులోనూ మతలబులు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ట్రామాకేర్‌లో చేపట్టిన నియామకాలకు, ఇప్పటి నియామకాలతో లింక్ చేస్తూ రోస్టర్ పాయిం ట్లు నిర్ణయించి రిజర్వేషన్లు ఖరారు చేశా రు. అయితే అన్ని పోస్టులకు ఒకేలా కాకుండా ఒక్కో పోస్టుకు ఒక్కో రీతిలో రోస్టర్ అనుసరించారు. ఊదాహరణకు ఒక ఎలక్ట్రీషియన్ పోస్టుకు రోస్టర్ పాయింట్ నాలుగుగా చూపించి బీసీ-ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారు. గతంలో మూడు ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీ చేసినందున ఇప్పుడున్న ఒక్క పోస్టుకు రోస్టర్ పాయింట్ నాలుగుకు చేరిందని అధికారులు వివరించారు. అయితే డ్రైవర్ పోస్టుల విషయంలో మాత్రం ఈ సూత్రం అనుసరించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. గతంలో మూడు డ్రైవర్ పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం రెండు పోస్టులకు నియామకాలు చేపట్టినందున పైన పేర్కొన్న విధానం ప్రకా రం రోస్టర్ పాయింట్ నాలుగు, ఐదుగా రావాలి. దానికి అనుగుణంగా ఈ పోస్టులను బీసీ-ఏ, ఓపెన్ కేటగిరీలకు రిజర్వ్ చేయాలి. కానీ గతంలో భర్తీ చేసిన మూడు పోస్టులను లెక్కలోకి తీసుకోకుం డా కొత్త రోస్టర్ పాయింట్ చూపించారు. ఆ మేరకు రెండు కొత్త పోస్టులను ఓసీ(డబ్ల్యూ), ఎస్సీ (డబ్ల్యూ) అభ్యర్థులకు కేటాయించారు. ఎలక్ట్రీషియన్ పోస్టులకు ఒకలా, డ్రైవర్ పోస్టులకు మరోలా రోస్టర్ పాయింట్లు కేటాయించడం మాయ చేయడమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
అభ్యంతరాలకు అవకాశమే లేదు
ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపేం దుకు ఎలాంటి అవకాశం లేకుండా నియామకాల తంతు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండవ శని వారం, తర్వాత ఆదివారం, ఆ తర్వాత సంక్రాంతి.. ఇలా వరుసగా సెలవులు మొదలుకావడానికి ముందు రోజు(శుక్రవారం) రాత్రి తుది జాబితాను ప్రకటించడాన్ని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సెలవుల తర్వాత 16వ తేదీన ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించి, ఆ వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వనుండటంతో అభ్యంతరాలకే అవకాశం లేకుండా పోయిందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా పోస్టుల నియామక ప్రాతిపదిక, రోస్టర్ కేటాయింపు వివరాలు అందజేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సమాచార హక్కు చట్టం ద్వారా రిమ్స్ డెరైక్టర్‌ను శనివారం సాయంత్రం కోరగా వారు నిరాకరించారు. డ్రైవర్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, తనకు అన్యాయం జరిగిందంటూ కె.శాంతారావు అనే అభ్యర్థి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇవ్వాలని కోర గా నేరుగా దరఖాస్తు ఇస్తే తీసుకోబోమని, పోస్టు ద్వారానే పంపాలని చెప్పి పంపించేశారు.
పరిపాలన విభాగం వారే చూశారు: డెరైక్టర్
నియామక ప్రక్రియను పరిపాలన విభాగం అధికారులే చూశారు, గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా చేపట్టారని రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అయితే గతంలో జరి గిన పోస్టుల భర్తీలో తొలి, తుది మెరిట్ జాబితాలు పెట్టిన విషయాన్ని ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. పరిపాలన విభాగం అధికారులతో చర్చించి, అవసరమైతే మరో మెరిట్ లిస్టు పెడతామన్నారు.
Advertisement
Advertisement