ట్రామా‘కేర్’ లేకపాయె
దశాబ్దం క్రితం ఇక్కడి బాదేపల్లి ఆస్పత్రికి అనుబంధంగా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పటి పాలకులు యత్నించారు.. అయితే అది ఫలించకపోవడంతో ఆ తర్వాత దాని గురించి మాట్లాడే వారే కరువయ్యారు... జడ్చర్లలో దీనిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి.. దీంతో వివిధ సంఘటనల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందడంలేదు.. పలు సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రాణాలు హరీమన్న సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి..
ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ క్షతగాత్రుడిని హుటాహుటిన బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటం, ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం, వైద్యం అందడంలో ఆలస్యం చోటు చేసుకోడం తదితర కారణాలతో అతను మరణించాడు. ‘అరె కొద్దిగా ముందుగా తీసుకువచ్చి ఉంటే ఇతడిని బతికించే వారిమే..’ అన్న వైద్యుల మాటలు అక్షరాల నిత్య సత్యాలే.
అయితే పరిస్థితి అలా లేదు. గాయపడిని వారిని సరైన ఆస్పత్రికి చేర్చడంలో ఆలస్యం చోటుచేసుకోవడంతో వారికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నది ఒక్కరో ఇద్దరో కాదు ప్రతి ఏటా వందల సంఖ్యలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందించే మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పేర్కొంటారు. ఇలాంటి అమూల్యమైన సమయంలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్సలు నిర్వహిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకుగాను తక్షణమే వైద్యం అందించే కేంద్రం ట్రామాకేర్ సెంటర్. దానిని జడ్చర్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఉన్నా పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. అంతేగాక అక్కడికి చేరడానికి ఆలస్యం జరుగుతుండటంతో వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అటు జాతీయ రహదారిని, ఇటు అంతర్రాష్ట్రీయ రహదారితో పాటు ఎక్కువగా పరిశ్రమలు కలిగి ఉన్న జడ్చర్ల, షాద్‌నగర్ తదితర నియోజకవర్గాలకు ఈ ప్రాంతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక నాలుగు వైపులా ఎటు నుంైచైనా సులువుగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆస్పత్రికి చేరుకోవచ్చు. వీటితో పాటు అటు హైదరాబాద్ ఇటు కర్నూలుకు ఈ ప్రాంతం అనుకూలమేగాక జిల్లా నడిబొడ్డున ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ట్రామాకేర్ సెంటర్ ఏ ర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా రు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ దిశగా చ ర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఎన్నో ఉపయోగాలు
ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే వైద్యసాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలా మంది తీవ్రమైన రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం, తీవ్ర గాయాలు, మానసిక ఆందోళనకు లోనవుతారు.
ఇలాంటి వారికి ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట సమయంలో వారిని ఆస్పత్రికి తరలించి అంతర్గత రక్తస్రావం కాకుండా నివారణ చర్యలతో పాటు అవసరమైన ఆక్సిజన్, రక్తం ఎక్కించడం తదితర వైద్య సేవలు అందించగలిగితే 20-30 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ట్రామాకేర్ సెంటర్ల లో వీలైనంత త్వరగా నిపుణుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించవచ్చు.