పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు
–ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎస్‌కే ఆచార్య
కర్నూలు(హాస్పిటల్): పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఎయిమ్స్(ఢిల్లీ) గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి డాక్టర్ ఎస్‌కే ఆచార్య చెప్పారు. ఆదివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం ఆధ్వర్యంలో ‘లివ్ అప్–2016’ పేరున నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్‌కే ఆచార్య మాట్లాడుతూ హెపటైటిస్ బి,సి వ్యాధులతో పాటు ఆల్కహాలు, టీబీ మందులు, షుగర్, మలేరియా, డెంగీ వ్యాధికి వాడే మందులతో లివర్‌జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా హెపటైటిస్ ఎ,బి,సి వైరస్‌లు, పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో భారత దేశంలో లివర్ ఫెయిల్యూర్‌లు సంభవిస్తున్నాయని వివరించారు. కొందరు ఆత్మహత్య చేసుకునేందుకు క్రిమిసంహారక మందులు, నిద్రమాత్రలు వాడుతున్నారని, దీంతో కాలేయం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. అనంతరం లివర్ వ్యాధులకు సంబంధించి డాక్టర్ ధీమన్(చండీగడ్), డాక్టర్ సేతుబాబు, డాక్టర్ పీఎన్ రావు, డాక్టర్ జార్జికురియన్(పాండిచ్చేరి) ఉపన్యసంచారు. సదస్సుకు రాష్ట్రం నుంచే గాక తెలంగాణ నుంచి పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ బి. శంకరశర్మ, డాక్టర్ వెంకటరంగారెడ్డి, డాక్టర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.