మద్యంతో లివర్ దెబ్బతింది... చికిత్స సాధ్యమేనా?
మా నాన్నకు 48 ఏళ్లు. మద్యపానం అలవాటు వల్ల లివర్ బాగా పాడైపోయిందని డాక్టర్ చెప్పారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అవసరముంటుందా? దయచేసి తెలపండి.
- విజేందర్, వరంగల్
మద్యపానం వల్ల శరీరంలో ముందుగా పాడయ్యేది లివరే. అలవాటుగా రోజూ మద్యం తాగేవారిలో లివర్ దెబ్బతింటుందని గుర్తించడం చాలా అవసరం. మీ నాన్న విషయానికి వస్తే ముందుగా ఆయన లివర్ ఏ మేరకు దెబ్బతిన్నదో చూడాలి. కామెర్లు, ట్యూమర్స్ (గడ్డలు), సిర్రోసిస్, హెపటైటిస్ వంటి కారణాలతో లివర్ దెబ్బతింటుంది. లివర్ పూర్తిగా గట్టిపడిపోయి రాయిలా మారిపోయిన స్థితిలో దానిని క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. లివర్ పూర్తిగా నాశనమైపోయి పనిచేయనప్పుడు మాత్రమే లివర్ మార్పిడి సర్జరీ అనివార్యం అవుతుంది. అయితే దానికంటే ముందుగా దెబ్బతిన్న లివర్‌ను కాపాడేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మద్యపానం వల్ల లివర్ దెబ్బతిన్న కేసులలో ఓ ఆర్నెల్లపాటు ఆ పేషెంట్‌ను మద్యానికి దూరంగా ఉంచి చికిత్స చేయడం ద్వారా లివర్‌ను కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ నాన్న విషయంలో కూడా అది సాధ్యమే. ముందుగా ఆయనచేత వెంటనే మద్యం మాన్పించి దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపించి చికిత్స ప్రారంభించండి.
నా వయసు 40 ఏళ్లు. నేను ఈమధ్య రొటీన్‌గా చేయించుకున్న వైద్యపరీక్షలలో గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. కానీ నాకు కడుపునొప్పి వంటి ఎలాంటి లక్షణాలూ కనపడలేదు. ఇప్పుడు రాళ్లను తొలగించడానికి సర్జరీనే ఉత్తమ పరిష్కారం అని డాక్టర్ అంటున్నారు. మీ సలహా ఏమిటి?
- జయలక్ష్మి, కర్నూలు
లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణమే గాల్‌బ్లాడర్. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. మీ విషయం తీసుకుంటే మీకు కడుపులో ఎలాంటి నొప్పిలేదు కాబట్టి వీటిని లక్షణాలు కనిపించని గాల్‌స్టోన్స్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువభాగాన తీవ్రమైన నొప్పివస్తుంది. అలాగే కామెర్లు, తీవ్రమైన పాంక్రియాటిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కీహోల్ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని సూచిస్తాం. మీ విషయానికి వస్తే, మీకు కడుపునొప్పి లాంటి లక్షణాలు ఏవీ కనిపించనందున మీకు అసలు చికిత్స అవసరం లేదు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్జరీ అవసరమవుతుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
Published Mon, Jul 13 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement