లివర్ వ్యాధి చికిత్సలో ముందడుగు
కోల్‌కతా: ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయి. కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్డీ) ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ముఖ్యంగా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే ఈ ఎన్ఏఎఫ్‌డీలో లివర్లో కొవ్వు పరిమాణం పెరగడంతో ప్రాణాంతకంగా మారుతోంది.
భారత్లోని వయోజనుల్లో సుమారు 30 శాతం మంది ఎన్‌ఏఎఫ్ఎల్‌డీ బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ దీనికి ప్రత్యేకంగా ఎలాంటి వైద్య చికిత్స అందుబాటులో లేదు. దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్న సీఎస్ఐఆర్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు.. కణంలోని సీఓపీ-1 ప్రొటీన్ను నిరోధించడం ద్వారా లివర్ ఫ్యాట్ పరిమాణం గణనీయంగా తగ్గుతోందని గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉందని.. మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన పార్థా చక్రవర్తి వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్(ఏడీఏ) జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.