లివర్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. గృహిణిని. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందనీ, అందువల్లనే నేను తరచుగా అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, వైజాగ్
లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి.ఎక్కువ శాతం మంది హెపటైటిస్- బీ, హెపటైటిస్-సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్‌గ్రూప్‌కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. కాకపోతే లివర్ అనేది చాలా సున్నితమైన అవయవం. కాబట్టి అధునాతనమైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ నిర్వహిస్తే రిస్క్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి.
డాక్టర్ బాలచంద్రమీనన్
చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. ఎత్తు ఐదు అడుగులు. బరువు 92 కేజీలు. నా బరువు తగ్గడానికి ఆయుర్వేద మందులు, ఆహారం గురించి తెలియజేయగలరు. - అరుణాగాయత్రి, హైదరాబాద్
భౌతిక లక్షణాల్లో మనిషి మనిషికీ తేడాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇవి వారి ‘ప్రకృతి, సార, సత్వం’ లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. (అంటే శరీరతత్వం, సప్తధాతువుల్లోని భేదం, మానసిక తత్వం).
మీ ఎత్తునుబట్టి మీరు ఉండాల్సిన దానికంటే సుమారు 35 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. హైపోథైరాయిడిజం కుషింగ్ సిండ్రోమ్, పీసీఓడీ, రక్తహీనతల వంటి ప్రాథమిక రోగాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కూడా అధిక బరువుకు కొన్ని కారణాలు. అవి లేనప్పుడు మన బరువు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది.
స్థౌల్య కారణాలు: శారీరక శ్రమ లేకుండటం, పగటిపూట అధిక నిద్ర, కఫవృద్ధికర ఆహార సేవన... అంటే గుర్వాహారం (కొవ్వులు, మధుర ద్రవ్యాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం) (మాధవ నిదానం: అవ్యాయామ దివాస్వప్న శ్లేష్మలాహార సేవినః మధురోన్న రసః ప్రాయః స్నేహాత్ మేదః ప్రవర్ధయేత్)
లక్షణాలు: ఆకలి, దప్పిక ఎక్కువగా ఉండటం, శరీరం లావెక్కడం, ఉత్సాహం లేకపోవడం వంటివి.
చికిత్స: ఈ చికిత్స నియమాలు రోగికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎలాగంటే... ఉదాహరణకు గుర్వాహారం తినకూడదు, వ్యాయామం చాలా అవసరం (స్థూలకాయం వల్ల ఇది ప్రాణసంకటంగా ఉంటుంది). స్థౌల్యం తగ్గాలనే ప్రగాఢ కాంక్ష రోగికి కలిగేట్టు స్ఫూర్తినివ్వాలి (నిరుత్సాహం స్థూలకాయుల్లో ప్రధాన లక్షణం). అందుకే చరక మహర్షి స్థౌల్యాన్ని అత్యంత నిందితావస్థగా ఉటంకించాడు. ఈ సందర్భంలో వాగ్భటుడు ‘స్థౌల్యం కంటే కృశత్వమే వరం, స్థూలునికి మందుల్లేవు’ అని అతిశయోక్త్యలంకారంలో చెప్పాడు. (కార్శ్య మేవ వరం స్థౌల్యాత్, నహి స్థూలస్య భేషజం). ఈ చికిత్సలో ఆహార విహారాలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఔషధాలది మూడో స్థానం మాత్రమే.
1. ఆహారం: పోషక విలువలుండాలి; కొవ్వులు మధురరసాయలు ఉండకూడదు. కాబట్టి ఉడికించని పచ్చి ఆహారం మంచిది. అవి... మొలకలు, క్యారట్, బీట్‌రూట్, దోసకాయ, టమాటా వంటి సలాడ్సు, తాజా ఫలాలు, కూరగాయల పచ్చిరసాలు.
2. వండిన ఆహారం: ఉప్పు, నూనెలు లేకుండా ఉడికించిన కూరగాయలు, పుల్కాలు, ముడిబియ్యపు అన్నం, పొట్టుతో కూడిన పప్పులు, ఆకుకూరలు.
3. పానీయాలు: గంజి, జావలు, ఉలవచారు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని నీరు. ఇలాంటి లఘ్వాహారంతో ఆకలిని నియంత్రించి జయించాలేగానీ... ఆకలిని అణచివేసే ద్రవ్యాల్ని ప్రయోగించడం శాస్త్రవిరుద్ధం. ఉప్పుని ఎంత తక్కువ వాడితే అంత మంచిది.
స్థౌల్యహర ద్రవ్యాలు: పసుపు, వెల్లుల్లి, గోధుమలు, బార్లీ, ఉలవలు, వేడినీరు.
విహారం: ఏదో ఒక రూపంలో చెమట పట్టేలా తగినంత పరిశ్రమ చేయాలి. క్రమక్రమేణా వ్యాయామాలను పెంచాలి. పగలు నిద్రపోవద్దు. ప్రాణాయామం రెండుపూటలా తప్పనిసరిగా చేయాలి.
ఔషధాలు: త్రిఫల / నవక గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 మేదోహర విడంగాది లోహం (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 తిప్పతీగ, తుంగముస్తలు, శొంఠి త్రవ్యాలతో చేసిన కషాయం రోజూ పరగడుపున 30 మిల్లీలీటర్లు తాగాలి.
పంచకర్మలు: ఉద్వర్తనం (చూర్ణాలతో నలుగుపెట్టడం) స్వేదకర్మ (చెమట పట్టేట్టు చేయడం) అవసరాన్ని బట్టి వమన, విరేచన, వస్తికర్మల వల్ల గణనీయమైన ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి.
గమనిక: బరువు తగ్గడమనేది క్రమబద్ధంగా జరగాల్సిన దీర్ఘకాలపు ప్రక్రియ. రాత్రికి రాత్రి బరువు తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. అది అశాస్త్రీయం, ప్రమాదభరితం. అధికబరువు వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు. ఆయాసం, నీరసం, సంభోగశక్తి తగ్గిపోవడం వంటి ఉపద్రవాలుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తవహించడం శ్రేయస్కరం. అది మన చేతుల్లోనే ఉంది. మొండిగా, అదేపనిగా ఉపవాసాల వల్ల ప్రయోజనం ఉండదు.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య
ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్