new posts
-
హైడ్రాలో కొత్త పోస్టులు.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరిల్లో 169 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌పై సిబ్బంది నియామకం చేపట్టింది.కాగా, హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించింది. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులను హైడ్రాలో నియమించింది.ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్! -
ఆ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
వైద్యారోగ్య శాఖలో...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన చోట కొత్త పోస్టుల మంజూరు, అవసరం లేనిచోట రద్దు చేయడంతోపాటు వైద్యులు అధికంగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్నచోటుకు బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించాయి. కొత్తగా డీఎంహెచ్‌వో పోస్టులు ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 19 జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక డీఎంహెచ్‌వో పర్యవేక్షించడం కష్టమైన వ్యవహారం. దీంతో హైదరాబాద్‌కు మరో ఐదు డీఎంహెచ్‌వో, ఇతర జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో పోస్టులు అవసరమని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్తగా 19 డీఎంహెచ్‌వో పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరిగినట్టేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు డీఎంహెచ్వోలు, మిగతా అన్ని జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో ఉంటారు. త్వరలోనే హైదరాబాద్‌కు ఐదుగురు అదనపు డీఎంహెచ్‌వోల నియామకం జరగనుందని.. దీనితో నగరంలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ సులువు అవుతుందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోటకి వైద్యం, సిబ్బంది వైద్యారోగ్యశాఖలో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి మించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటుంటే.. కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న చోటి నుంచి తక్కువగా ఉన్న చోట్లకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. దీనికి కూడా సర్కారు ఆమోదం తెలిపిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. అవసరం లేని పోస్టుల రద్దు లెప్రసీ వంటి పలు విభాగాల్లోని కొన్ని పోస్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలోని చాలా మందికి పనిలేదని, పలుచోట్ల ఆయా పోస్టుల అవసరం లేదన్న అభిప్రాయమూ ఉందని చెప్తున్నాయి. అటువంటి పోస్టులను అవసరమైన చోటికి మార్చడమో, రద్దు చేయడమో చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల లిఫ్ట్ ఆపరేటర్లు అవసరం లేదని భావిస్తున్నారు. ఇలా విభాగాల వారీగా అవసరం లేని పోస్టులను గుర్తించి.. రద్దు చేయడమా, ఇతర చోట్ల సర్దుబాటు చేయడమా, పోస్టుల విధులు మార్చడమా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
టీఎస్ జెన్కోలో కొత్తగా 148 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)లో కొత్తగా 148 పోస్టులను సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. డెప్యుటేషన్‌పై వీటి భర్తీకి అవకాశమిచ్చారు. ఈ ఉద్యోగులను హోంశాఖ నుంచి స్థానికత ఆధారంగా తీసుకునేలా ఆ శాఖకు సూచించారు. ఇందులో ఒక డీఎస్పీ, 10 అసిస్టెంట్ కమాండెంట్, ఒక సివిల్ ఇన్స్పెక్టర్ (సివిల్), 11 ఇన్‌స్టెక్టర్ (రిజర్వ్), ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ), 13 సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్), 36 హెడ్ కానిస్టేబుల్, 31 పోలీస్ కానిస్టేబుల్, 44 మహిళా కానిస్టేబుల్ పోస్టులున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్కు ఒక ఇన్స్పెక్టర్ పోస్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ చౌర్యం నిర్మూలన పోలీస్ స్టేషన్లో డెప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేలా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ (సివిల్) పోస్టును సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. హోంశాఖ అనుమతితో ఈపోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. -
కొత్త కొలువులు 13,357
-
కొత్త కొలువులు 13,357
విద్యుత్ సంస్థల్లో కొత్త పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వం అనుమతి ► పాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ ► పదోన్నతుల ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు.. ఆపై ఏర్పడే ఖాళీల గుర్తింపు ► ప్రత్యక్ష నియామకాల ద్వారా ఆ ఖాళీల భర్తీకి ప్రత్యేక అనుమతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 3,441 పోస్టులతోపాటు జెన్కోలో 4,329, టీఎస్ఎస్పీడీసీఎల్లో 2,336, టీఎస్ఎన్పీడీసీఎల్లో 3,251 పోస్టులు కలిపి మొత్తం 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల కేటగిరీలవారీగా పరిశీలిస్తే నాలుగు విద్యుత్ సంస్థల్లో కలిపి మొత్తం ఇంజనీరింగ్ విభాగంలో 4,261 పోస్టులు, అకౌంట్స్ విభాగంలో 1,155 పోస్టులు, పీ అండ్ జీ విభాగంలో 305, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో 7,474, కెమికల్ విభాగంలో 124, హెచ్ఆర్ విభాగంలో 38 పోస్టులున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపు, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్సీడీసీఎల్ సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కావాల్సిన మానవవనరుల సమీకరణ కోసం ప్రభుత్వం కొత్త పోస్టుల సృష్టికి అంగీకారం తెలిపింది. ఈ పోస్టులను భర్తీ చేసే ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి పొందాలని ప్రభుత్వం కోరింది. కొత్త పోస్టులను సృష్టించడం ద్వారా పడే ఆర్థిక భారాన్ని విద్యుత్ సంస్థలే భరించాలని, ప్రభుత్వం నుంచి అదనపు సబ్సిడీలు కోరవద్దని స్పష్టం చేసింది. తాజాగా సృష్టించిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. పదోన్నతుల తర్వాత అంతే సంఖ్యలో కింది స్థాయిల్లో ఏర్పడే ఖాళీలను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేస్తామని పేర్కొంది. పదోన్నతుల అనంతరం ఏర్పడే ఖాళీలను గుర్తించాక వాటి భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేయనుంది. -
గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులు
రెండింతలు పెరిగిన ఖాళీల సంఖ్య ► అదనపు పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఎక్కువ ► ఆర్థిక శాఖ వద్ద వివరాలు.. సీఎస్‌కు చేరిన ఫైలు ► సీఎం ఆమోదించగానే అదనపు నోటిఫికేషన్ ► జూన్ 2న పోస్టుల వివరాలను వెల్లడించే అవకాశం ► తొలివిడత నోటిఫికేషన్లో ఇప్పటికే 439 పోస్టులు ► తాజా పోస్టులతో కలిపితే మొత్తం 939 ఖాళీలు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ విభాగం ఇచ్చిన తాజా ప్రతిపాదనలతో గ్రూప్-2 పోస్టుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు తెలిసింది. అదనంగా గుర్తించిన పోస్టుల్లో ఎక్కువగా డిప్యూటీ తహశీల్దార్ పోస్టులున్నాయి. వివిధ శాఖలు తమకు పంపించిన ఖాళీల జాబితాను ఆర్థిక శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించినట్లు తెలిసింది. తొలుత 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులు, వివిధ పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తులతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది.. అదనంగా ఎన్ని పోస్టులను ప్రకటిస్తారని.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వివిధ శాఖల నుంచి ఇటీవల ఆర్థిక శాఖకు చేరిన ఖాళీ పోస్టుల సంఖ్య 450 దాటింది. వీటికి తోడు తొలి నోటిఫికేషన్ సమయంలో పక్కనబెట్టినవి కూడా కలిపితే ఈ సంఖ్య 500కు చేరింది. దీంతో తొలి నోటిఫికేషన్లో ప్రకటించిన 439 పోస్టులతో కలిపితే మొత్తం పోస్టుల సంఖ్య 939కి పెరగనుంది. ఫైల్‌పై సీఎస్, సీఎం ఆమోదముద్ర పడితే అదనపు పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అదనపు పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్‌పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. -
ఆహార భద్రత విభాగంలో 130 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించడం, ఎక్కడికక్కడ ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించడం కోసం కొత్తగా 130 పోస్టులను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టులు ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలును ఆ శాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే సీఎం ఆమోదానికి పంపనున్నారు. సీఎం ఆమోదించాక పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతారు. -
సకాలంలో పని పూర్తిచేస్తే ఇన్సెంటివ్స్: కేసీఆర్
హైదరాబాద్: కొత్తగా 108 పోస్టుల ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయంలో పని పూర్తిచేసే కాంట్రాక్టర్లకు 2శాతం ఇన్సెంటివ్ ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పాత ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదలశాఖలో ప్రమోషన్లు, అదనపు పోస్టులు ఇచ్చారు. సాగునీటిశాఖలో 8 మంది సీఈలు, ఏడుగురు ఎస్ఈలు, 21 మంది ఈఈలను నియమించనున్నట్లు తెలిపారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను 2017 కల్లా తొలిదశ పూర్తికావాలని సూచించారు. ఏక కాలంలో కాళేశ్వరం బ్యారేజ్, తుమ్మిడిగట్టి, దేవాదులకు నీరందించేలా కొత్తూరు వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెలాఖరు నుంచే పనులు ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రైతులు రెండో పంట పండించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. నీటిపారుదలశాఖకు రూ.25 వేల కోట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. -
మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ కమిటీలున్నాయని... మరో 30 కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గోదాముల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతు బజారు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రైతు బజార్లన్నింటికీ కామన్ డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలోనూ ఆన్లైన్ ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ (బార్ కోడింగ్)ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. పనిలో వేగంతోపాటు పారదర్శకత కోసం వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే దడ్వాయి కార్మికులకు బీమా వర్తింప చేస్తామన్నారు. మార్కెటింగ్ ఫీజులకు ఎగనామం పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యార్డుల్లో సరుకు అమ్మకం నుంచి రైతులకు సొమ్ము చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆన్లైన్లో పెట్టాలన్నారు. మార్కెట్ కమిటీలు హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. -
నీటిపారుదల శాఖకు 16 యాళ్ల గ్రహణం
పత్యేక కట్టడాల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ బాసిజం 70 మంది ఉద్యోగుల జీవితాలతో ఆటలు అతని గుప్పిట్లోనే విలువైన రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు ఎస్ఆర్లలో నమోదుకాక నష్టపోతున్న ఉద్యోగులు బదిలీ అయినా రికార్డులు అప్పగించని ఘనుడు కలెక్టర్‌కు పలువురి ఫిర్యాదు అతనో సీనియర్ అసిస్టెంట్.. చేసేది గుమస్తాగిరీ.. అయితేనేం.. పలుకుబడితో 16 ఏళ్లుగా ఒకేచోట తిష్ట వేసి.. తనకంటూ ఓ గదిని ఏర్పాటు చేసుకొని, రికార్డులను గుప్పిట్లో పెట్టుకొని తోటి ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నాడు. వారి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు.. ఇతరత్రా ప్రయోజనాలకు గండి కొడుతున్నాడు. ఎట్టకేలకు 2014లో బదిలీ అయినా కొత్త పోస్టులో చేరకుండా.. తన వద్ద ఉన్న రికార్డులు వేరే వారికి అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతూ నీటిపారుదల శాఖ ఉద్యోగులు, అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. పీఎన్ కాలనీ:నీటిపారుదల శాఖ ప్రత్యేక కట్టడాల విభాగం(శ్రీకాకుళం)లో సీనియర్ అసిస్టెంట్‌గా సుమారు ఏడాది క్రితం వరకు పనిచేసిన యాళ్ల చంద్రశేఖర్‌పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇతని బారిన పడి ఉద్యోగపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని ఈ విభాగంలో పని చేస్తున్న సుమారు 70 మంది సిబ్బంది సిబ్బంది చేసుకున్న విన్నపాలకు అధికారులు స్పందించారు. 16 ఏళ్లుగా ప్రత్యేక కట్టడాల విభాగంలో తిష్ట వేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ శాఖాపరమైన, ఉద్యోగుల విలువైన రికార్డులను తన ఇంటి వద్ద, కార్యాలయంలోని తన గదిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మిగిలిన సీనియర్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ తోటి ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీనియర్ అసిస్టెంటే అయినప్పటికీ కార్యాలయంలో తనకో ప్రత్యేక గది ఏర్పాటు చేసుకొని కార్యాలయ రికార్డులు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు అందులోనే పెట్టుకున్నారు. పోనీ ఉద్యోగుల సర్వీసు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారా అంటే అదీ లేదు. ఈయనగారి నిర్వాకంతో జరిగిన నష్టాలను పరిశీలిస్తే.. బదిలీలు, పదోన్నతులపై ఇక్కడికి వచ్చిన సిబ్బంది సర్వీస్ రిజిస్టర్లలో జాయినింగ్ రిపోర్టులను కూడా నమోదు చేయలేదు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు, జీఐఎస్, సరెండర్ లీవ్‌లు వంటి వాటిని నమోదు చేయలేదు. 66 రోజులపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మె వివరాలను సర్వీస్ రిజిస్టర్లలో పొందుపరచకపోగా, ఆ ప్రొసీడింగ్స్‌ను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. 2012-13లో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఏఈల సర్వీసు రిజిస్టర్లు, ఒరిజినల్ ధ్రువపత్రాలు తన ఆధీనంలోనే ఉంచేసుకోవడంతో వారు ఇప్పటివరకు ఇంక్రిమెంట్లకు, పదోన్నతులకు నోచుకోలేదు. బదిలీ అయినా.. ఎన్నో విధాలుగా తోటి ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న చంద్రశేఖర్‌కు ఎట్టకేలకు 2014లో బదిలీ అయ్యింది. ఇక్కడి విధుల నుంచి రిలీవ్ అయినా.. కొత్త పోస్టులో చేరకుండా మెడికల్ లీవ్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు, సర్వీసు రిజిస్టర్లను తన స్థానంలో చేరిన ఉద్యోగికి అప్పగించలేదు. చివరికి సహనం నశించిన కొందరు ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు, తమ కార్యాలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ రికార్డులన్నింటిని అప్పగించాలని చంద్రశేఖర్‌ను ఆదేశించగా ఫిబ్రవరి 15 నాటికి రికార్డులు అప్పగిస్తానని అప్పటి వరకు గడువు ఇవ్వాలని కోరారు. అయితే ఆ గడువు కూడా ముగిసి 20 రోజులు దాటడంతో ఇటీవల ఈఈ ప్రదీప్ ముగ్గురు డీఈల సమక్షంలో అతని గదిలో బీరువా తాళాలు పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ ఇంటి వద్ద ఇంకా చాలా విలువైన రికార్డులు ఉన్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తాం గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌పై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. రికార్డులను అప్పగించేందుకు శేఖర్ ఫిబ్రవరి 15 వరకు గడువు కోరారు. గడువు ముగిసినా రాకపోవడంతో ముగ్గురు డీఈల సమక్షంలో బీరువా తాళాలను విరుగ్గొట్టి రికార్డులను పరిశీలిస్తున్నాం. త్వరలో ఉద్యోగులందరికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -డి.ఎస్.ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగంలో ఉన్నా లేనట్లే.. సీతంపేటలో జేటీవోగా ఉన్న నేను పదోన్నతిపై శ్రీకాకుళానికి ఏటీవోగా వచ్చాను. ఇక్కడ విధుల్లో చేరి మూడున్నరేళ్లు అయినా సర్వీస్ రిజిస్టర్లో ఎటువంటి ఆ వివరాలు నమోదు చేయలేదు. ఇలా అయితే ఉద్యోగంలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే. - కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ టెక్నికల్ అధికారి జాయినింగ్ నుంచి జీతం పెరగలేదు సర్వీస్ రిజిస్టర్లో నా పనితీరు నమోదు చేయకపోవడంతో జిల్లాలో విధుల్లో చేరినప్పటి నుంచి జీతం పెరగలేదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. -ఎంఎస్ రాకేష్‌కుమార్, జూనియర్ టెక్నికల్ అధికారి నా ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వలేదు నేడు విధుల్లో చేరినప్పుడు సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖరరావుకు నా ఒరిజినల్ ధ్రువపత్రాలు అందజేశాను. వాటిని ఆయన తిరిగి ఇవ్వకపోవడంతో ఇతర ఉద్యోగావకాశాలు కోల్పోతున్నాను. ఎన్నిసార్లు అడిగినా అదిగో...ఇదిగో.. అంటూ దాటేస్తున్నారు. అధికారులు స్పందించి నా ధ్రువపత్రాలు ఇప్పించాలి. - పి.శంకరరావు, టెక్నికల్ అసిస్టెంట్