సకాలంలో పని పూర్తిచేస్తే ఇన్సెంటివ్స్: కేసీఆర్
హైదరాబాద్: కొత్తగా 108 పోస్టుల ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. హైదరాబాద్లో ఆదివారం రాత్రి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయంలో పని పూర్తిచేసే కాంట్రాక్టర్లకు 2శాతం ఇన్సెంటివ్ ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పాత ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదలశాఖలో ప్రమోషన్లు, అదనపు పోస్టులు ఇచ్చారు. సాగునీటిశాఖలో 8 మంది సీఈలు, ఏడుగురు ఎస్ఈలు, 21 మంది ఈఈలను నియమించనున్నట్లు తెలిపారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను 2017 కల్లా తొలిదశ పూర్తికావాలని సూచించారు.
ఏక కాలంలో కాళేశ్వరం బ్యారేజ్, తుమ్మిడిగట్టి, దేవాదులకు నీరందించేలా కొత్తూరు వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెలాఖరు నుంచే పనులు ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రైతులు రెండో పంట పండించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. నీటిపారుదలశాఖకు రూ.25 వేల కోట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.