మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ కమిటీలున్నాయని... మరో 30 కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గోదాముల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో రైతు బజారు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రైతు బజార్లన్నింటికీ కామన్ డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలోనూ ఆన్‌లైన్ ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ (బార్ కోడింగ్)ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
పనిలో వేగంతోపాటు పారదర్శకత కోసం వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే దడ్వాయి కార్మికులకు బీమా వర్తింప చేస్తామన్నారు. మార్కెటింగ్ ఫీజులకు ఎగనామం పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యార్డుల్లో సరుకు అమ్మకం నుంచి రైతులకు సొమ్ము చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. మార్కెట్ కమిటీలు హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.