నీటిపారుదల శాఖకు 16 యాళ్ల గ్రహణం | new posts in Irrigation Department | Sakshi
Sakshi News home page

నీటిపారుదల శాఖకు 16 యాళ్ల గ్రహణం

Published Mon, Mar 9 2015 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

new posts in Irrigation Department

    పత్యేక కట్టడాల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ బాసిజం
      70 మంది ఉద్యోగుల జీవితాలతో ఆటలు
     అతని గుప్పిట్లోనే విలువైన రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు
     ఎస్‌ఆర్‌లలో నమోదుకాక నష్టపోతున్న ఉద్యోగులు
     బదిలీ అయినా రికార్డులు అప్పగించని ఘనుడు
     కలెక్టర్‌కు పలువురి ఫిర్యాదు
 
 అతనో సీనియర్ అసిస్టెంట్.. చేసేది గుమస్తాగిరీ.. అయితేనేం.. పలుకుబడితో 16 ఏళ్లుగా ఒకేచోట తిష్ట వేసి.. తనకంటూ ఓ గదిని ఏర్పాటు చేసుకొని, రికార్డులను గుప్పిట్లో పెట్టుకొని తోటి ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నాడు.
 
 వారి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు.. ఇతరత్రా
 ప్రయోజనాలకు గండి కొడుతున్నాడు.
 
 ఎట్టకేలకు 2014లో బదిలీ అయినా కొత్త పోస్టులో చేరకుండా.. తన వద్ద ఉన్న రికార్డులు వేరే వారికి అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతూ నీటిపారుదల శాఖ ఉద్యోగులు,  అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు.
 
 పీఎన్ కాలనీ:నీటిపారుదల శాఖ ప్రత్యేక కట్టడాల విభాగం(శ్రీకాకుళం)లో సీనియర్ అసిస్టెంట్‌గా సుమారు ఏడాది క్రితం వరకు పనిచేసిన యాళ్ల చంద్రశేఖర్‌పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇతని బారిన పడి ఉద్యోగపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని ఈ విభాగంలో పని చేస్తున్న సుమారు 70 మంది సిబ్బంది సిబ్బంది చేసుకున్న విన్నపాలకు అధికారులు స్పందించారు. 16 ఏళ్లుగా ప్రత్యేక కట్టడాల విభాగంలో తిష్ట వేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ శాఖాపరమైన, ఉద్యోగుల విలువైన రికార్డులను తన ఇంటి వద్ద, కార్యాలయంలోని తన గదిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మిగిలిన సీనియర్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ తోటి ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీనియర్ అసిస్టెంటే అయినప్పటికీ కార్యాలయంలో తనకో ప్రత్యేక గది ఏర్పాటు చేసుకొని కార్యాలయ రికార్డులు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు అందులోనే పెట్టుకున్నారు.
 
 పోనీ ఉద్యోగుల సర్వీసు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారా అంటే అదీ లేదు. ఈయనగారి నిర్వాకంతో జరిగిన నష్టాలను పరిశీలిస్తే..
 బదిలీలు, పదోన్నతులపై ఇక్కడికి వచ్చిన సిబ్బంది సర్వీస్ రిజిస్టర్లలో జాయినింగ్ రిపోర్టులను కూడా నమోదు చేయలేదు.
 గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు, జీఐఎస్, సరెండర్ లీవ్‌లు వంటి వాటిని నమోదు చేయలేదు.
 66 రోజులపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మె వివరాలను సర్వీస్ రిజిస్టర్లలో పొందుపరచకపోగా, ఆ ప్రొసీడింగ్స్‌ను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు.
 2012-13లో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఏఈల సర్వీసు రిజిస్టర్లు, ఒరిజినల్ ధ్రువపత్రాలు తన ఆధీనంలోనే ఉంచేసుకోవడంతో వారు ఇప్పటివరకు ఇంక్రిమెంట్లకు, పదోన్నతులకు నోచుకోలేదు.
 
 బదిలీ అయినా..
 ఎన్నో విధాలుగా తోటి ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న చంద్రశేఖర్‌కు ఎట్టకేలకు 2014లో బదిలీ అయ్యింది. ఇక్కడి విధుల నుంచి  రిలీవ్ అయినా.. కొత్త పోస్టులో చేరకుండా మెడికల్ లీవ్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు, సర్వీసు రిజిస్టర్లను తన స్థానంలో చేరిన ఉద్యోగికి అప్పగించలేదు. చివరికి సహనం నశించిన కొందరు ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌కు, తమ కార్యాలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ రికార్డులన్నింటిని అప్పగించాలని చంద్రశేఖర్‌ను ఆదేశించగా ఫిబ్రవరి 15 నాటికి రికార్డులు అప్పగిస్తానని అప్పటి వరకు గడువు ఇవ్వాలని కోరారు. అయితే ఆ గడువు కూడా ముగిసి 20 రోజులు దాటడంతో ఇటీవల ఈఈ ప్రదీప్ ముగ్గురు డీఈల సమక్షంలో అతని గదిలో బీరువా తాళాలు పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ ఇంటి వద్ద ఇంకా చాలా విలువైన రికార్డులు ఉన్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 
 ఉద్యోగులకు న్యాయం చేస్తాం
 గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌పై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. రికార్డులను అప్పగించేందుకు శేఖర్ ఫిబ్రవరి 15 వరకు గడువు కోరారు. గడువు ముగిసినా రాకపోవడంతో ముగ్గురు డీఈల సమక్షంలో బీరువా తాళాలను విరుగ్గొట్టి రికార్డులను పరిశీలిస్తున్నాం. త్వరలో ఉద్యోగులందరికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
 -డి.ఎస్.ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
 
 ఉద్యోగంలో ఉన్నా లేనట్లే..
 సీతంపేటలో జేటీవోగా ఉన్న నేను పదోన్నతిపై శ్రీకాకుళానికి ఏటీవోగా వచ్చాను. ఇక్కడ విధుల్లో చేరి మూడున్నరేళ్లు అయినా సర్వీస్ రిజిస్టర్‌లో ఎటువంటి ఆ వివరాలు నమోదు చేయలేదు. ఇలా అయితే ఉద్యోగంలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే.
 - కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ టెక్నికల్ అధికారి
 
 జాయినింగ్ నుంచి జీతం పెరగలేదు
 సర్వీస్ రిజిస్టర్‌లో నా పనితీరు నమోదు చేయకపోవడంతో జిల్లాలో విధుల్లో చేరినప్పటి నుంచి జీతం పెరగలేదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.
 -ఎంఎస్ రాకేష్‌కుమార్, జూనియర్ టెక్నికల్ అధికారి
 
 నా ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వలేదు
 నేడు విధుల్లో చేరినప్పుడు సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖరరావుకు నా ఒరిజినల్ ధ్రువపత్రాలు అందజేశాను. వాటిని ఆయన తిరిగి ఇవ్వకపోవడంతో ఇతర ఉద్యోగావకాశాలు కోల్పోతున్నాను. ఎన్నిసార్లు అడిగినా అదిగో...ఇదిగో.. అంటూ దాటేస్తున్నారు. అధికారులు స్పందించి నా ధ్రువపత్రాలు ఇప్పించాలి.
 - పి.శంకరరావు, టెక్నికల్ అసిస్టెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement