గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులు
రెండింతలు పెరిగిన ఖాళీల సంఖ్య
► అదనపు పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఎక్కువ
► ఆర్థిక శాఖ వద్ద వివరాలు.. సీఎస్‌కు చేరిన ఫైలు
► సీఎం ఆమోదించగానే అదనపు నోటిఫికేషన్
► జూన్ 2న పోస్టుల వివరాలను వెల్లడించే అవకాశం
► తొలివిడత నోటిఫికేషన్‌లో ఇప్పటికే 439 పోస్టులు
► తాజా పోస్టులతో కలిపితే మొత్తం 939 ఖాళీలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ విభాగం ఇచ్చిన తాజా ప్రతిపాదనలతో గ్రూప్-2 పోస్టుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు తెలిసింది. అదనంగా గుర్తించిన పోస్టుల్లో ఎక్కువగా డిప్యూటీ తహశీల్దార్ పోస్టులున్నాయి. వివిధ శాఖలు తమకు పంపించిన ఖాళీల జాబితాను ఆర్థిక శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించినట్లు తెలిసింది. తొలుత 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరుద్యోగులు, వివిధ పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తులతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది.. అదనంగా ఎన్ని పోస్టులను ప్రకటిస్తారని.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వివిధ శాఖల నుంచి ఇటీవల ఆర్థిక శాఖకు చేరిన ఖాళీ పోస్టుల సంఖ్య 450 దాటింది. వీటికి తోడు తొలి నోటిఫికేషన్ సమయంలో పక్కనబెట్టినవి కూడా కలిపితే ఈ సంఖ్య 500కు చేరింది.
దీంతో తొలి నోటిఫికేషన్‌లో ప్రకటించిన 439 పోస్టులతో కలిపితే మొత్తం పోస్టుల సంఖ్య 939కి పెరగనుంది. ఫైల్‌పై సీఎస్, సీఎం ఆమోదముద్ర పడితే అదనపు పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే టీఎస్‌పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అదనపు పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్‌పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.