ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వై.నరసింహులు
Published Sat, Jun 3 2017 12:15 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌చార్జి అధికారిగా డాక్టర్ వై. నరసింహులుకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ అరుణకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఎంహెచ్‌ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ వై.నరసింహులు ఇకపై ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా, అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు.
కీలక పోస్టులన్నీ ఖాళీ
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీకి పట్టుబడటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కీలక పోస్టులన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపల్‌గా రెగ్యులర్ పోస్టులో ఉన్నారు. డాక్టర్ స్వరాజ్యలక్ష్మిపై ఏసీబీ దాడుల నేపథ్యంలో ఆమెకు అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా డాక్టర్ మీనాక్షి మహదేవ్ సైతం ఏసీబీకి పట్టుబడటంతో ఒకేసారి మూడు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో పాటు ఇప్పటికే ఎయిడ్స్ అండ్ లెప్రసి అధికారి సెలవులో వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. మలేరియా అధికారి పోస్టు సైతం ఇన్‌చార్జితో కొనసాగుతోంది. జిల్లా క్షయ నియంత్రణాధికారిగా ఉన్న డాక్టర్ మోక్షేశ్వరుడు, ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్ డాక్టర్ వై.నరసింహులు సైతం బదిలీ కానుండగా, కొందరు వైద్యులు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం.
Advertisement