‘మహా’పరాధం! | great mistake | Sakshi
Sakshi News home page

‘మహా’పరాధం!

Published Fri, Jun 2 2017 10:16 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

‘మహా’పరాధం! - Sakshi

‘మహా’పరాధం!

డీఎంహెచ్‌ఓ కుర్చీకి అవినీతి మరక
- ఏసీబీ దాడుల్లో పట్టుబడిన డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌
- ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌కు రూ.30వేలు డిమాండ్‌
- పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు
 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కుర్చీ అవినీతికి చిరునామాగా మారుతోంది. బాధ్యతలు చేపట్టిన ప్రతి అధికారి దాదాపుగా లంచావతారం ఎత్తుతున్నారు. అనతికాలంలో కోటీశ్వరులు అయిపోవాలనే తలంపుతో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా డీఎంహెచ్‌ఓగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ సైతం అదేబాట పట్టారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు లంచం తీసుకుంటూ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు.
 
డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ పట్టుబడ్డారిలా..
ఆదోని పట్టణంలోని 50 పడకల ఆదిత్య నర్సింగ్‌ హోమ్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌కు యజమాని డాక్టర్‌ బి. శ్రీనివాసులు 2016 మే 19న దరఖాస్తు చేసుకున్నారు. ఆసుపత్రిలోని స్కానింగ్‌ కేంద్రానికి సైతం గత ఫిబ్రవరి 8న దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ రెండు అనుమతులకు ఆయన డీఎంహెచ్‌ఓ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి రెన్యూవల్‌కు రూ.15వేలు, స్కానింగ్‌ సెంటర్‌కు రూ.15వేలు ఇస్తేనే సంతకం పెడతానని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ మొండికేశారు. ఈ మేరకు ఆమె వాయిస్‌ను డాక్టర్‌ శ్రీనివాసులు ఫోన్‌లోనూ రికార్డు చేసినట్లు సమాచారం. న్యాయబద్ధంగా చేయాల్సిన రిజిస్ట్రేషన్‌కు సైతం తాను ఎందుకు డబ్బు ఇవ్వాలనే బాధతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
 
పక్కా ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్‌ఓకు ఫోన్‌ చేసి రూ.30వేలు ఇస్తాను.. ఎక్కడికి రావాలో చెప్పండన్నారు. ఉదయం ఇంటి వద్దకు రమ్మని ఆమె సమాధానమిచ్చారు. ఆ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే కర్నూలులోని దేవనగర్‌లో ఉన్న డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు కాపు కాశారు. 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ ఇంటికి వెళ్లి డాక్టర్‌  శ్రీనివాసులు రూ.30వేలను ముట్టజెప్పారు. ఆ మరుక్షణమే ఏసీబీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో సీఐ ఖాదర్‌బాషా, సిబ్బంది కలిసి డీఎంహెచ్‌ఓను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేతులను, డబ్బును రసాయనాలతో తనిఖీ చేయగా లంచం తీసుకున్నట్లు రుజువైంది. అనంతరం ఇంట్లోని రికార్డులు, బ్యాంకు పాస్‌ బుక్కు, ఇతర పత్రాలతో పాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వెళ్లి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
 
కార్యాలయంలో పనిచేసే డెమో ఎర్రంరెడ్డి, మరో ఉద్యోగి సత్యనారాయణను పలిపించి ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్ల వివరాలు, ఆమె వచ్చిన తర్వాత ఎన్ని ఆసుపత్రులకు, స్కానింగ్‌ సెంటర్లకు రిజిస్ట్రేషన్‌ చేశారనే వివరాలు సేకరించారు. ఆ తర్వాత సీనియర్‌ అధికారి, డీఐఓ డాక్టర్‌ వెంకటరమణ సమక్షంలో ప్రొసీడింగ్స్‌ రాసి డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌పై కేసు నమోదు చేశారు.
 
ఎన్ని దాడులు జరిగినా వీళ్లు మారరు
  •  ఇటీవలే డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు కర్నూలుతో పాటు విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో దాడులు నిర్వహించి, రిమాండ్‌కు పంపించారు.
  • ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా నియమితులైన డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ విషయంలో డబ్బు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు ఆమెకు సహకరించినట్లు సమాచారం. ఆసుపత్రులు ఒకరు, స్కానింగ్‌ సెంటర్లు మరొకరు డీల్‌ చేసి మామూళ్లు తెచ్చి ఇచ్చేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • గతంలోనూ ఆమె ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ జనాభా దినోత్సవానికి రూ.5లక్షలు మంజూరైతే రూ.50వేలు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిసింది. పల్స్‌పోలియో వంటి జాతీయ కార్యక్రమాల్లోనూ ఆమె అవినీతికి పాల్పడినట్లు సమాచారం.
  • డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ రెగ్యులర్‌ పోస్టు అయిన ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్‌) ప్రిన్సిపాల్‌గానూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
  • గతంలో డీఎంహెచ్‌ఓగా ఉన్న డాక్టర్‌ చంద్రశేఖర్‌ని సైతం ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన డాక్టర్‌ సాయిప్రసాద్, డాక్టర్‌ ఆంజనేయులుతో పాటు, డాక్టర్‌ వెంకటపతి,  డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ శివశంకర్‌రెడ్డిలపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement