డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మారిన పనివేళలు
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మారిన పనివేళలు
Published Sun, Dec 25 2016 11:12 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
–ఏసీబీ దాడులు చేస్తారేమోనని మార్పు...!
–ఐదుగురు ఉద్యోగులపై కన్ను
కర్నూలు(హాస్పిటల్): సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మిపైనే ఏసీబీ దాడులు జరగడంతో కొందరు కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తమపై కూడా ఎప్పుడైనా దాడులు చేస్తారేమోనన్న భయంతో పనివేళలు మార్చుకున్నారు. గతంలో రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచే కార్యాలయం ఇప్పుడు సాయంత్రం 5 గంటలకే మూతపడుతోంది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏసీబీ దాడుల గుబులు కొనసాగుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో గత 14వ తేదీన డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి ఇంటిపై ఉదయం 6 గంటల నుంచే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆమె స్వస్థలం విశాఖపట్టణంతో పాటు గతంలో పనిచేసిన విజయనగరంలోని ఆమె ఇళ్లు, బ్యాంకు, కార్యాలయాలపైనా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కర్నూలులోనూ ఆమె ఏమైనా కార్యకలాపాలు నిర్వహించారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత కార్యాలయానికి వచ్చి డీఎంహెచ్‌వో చాంబర్‌లో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. వారు రాకముందే కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో డీఎంహెచ్‌వో చాంబర్‌లోకి వెళ్లి ఫైళ్లు చక్కదిద్దినట్లు కార్యాలయంలో చర్చ జరిగింది. ఈ కోణంలోనూ ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
కార్యాలయ పనివేళల్లో మార్పు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేది. సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు వెళ్లాల్సిన కొందరు ఉద్యోగులు సాయంత్రం తర్వాత రాత్రి వరకు మామూళ్ల పనులు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదేమంటే పెండింగ్ ఫైళ్లంటూ అధికారులను మభ్యపెట్టి వారి మామూళ్లు రాబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా మామూళ్లు వచ్చే పనులను కార్యాలయం పనివేళల్లో గాకుండా రాత్రి పూటే చక్కపెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులు ఎవ్వరూ లేని సమయంలో ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తమ పనులు కానిచ్చుకుని, మామూళ్లు ఇచ్చి వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు..మామూళ్లకు అలవాటు పడిన ఉద్యోగుల చెవిన పడింది. దీంతో వారు అప్రమత్తమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. తాము నిబద్ధతగా పనిచేస్తున్నా ఆరోపణలు వస్తున్నాయని, తాము కార్యాలయ పనివేళల్లో మాత్రమే విధులు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనివేళలు మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏ ఒక్క ఉద్యోగి కార్యాలయంలో ఉండకూడదని ఓ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో గత నాలుగు రోజులుగా ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు కార్యాలయంపై ఎక్కడ దాడులు చేస్తారోనని మామూళ్లకు అలవాటు పడిన ఉద్యోగుల గుండెల్లో గుబులు పుడుతోంది.
Advertisement
Advertisement