
ప్రజా చైతన్యమే కీలకం!
♦ సీజనల్ వ్యాధుల అడ్డుకట్టకుపక్కా ప్రణాళిక
♦ అమలుకు ప్రజల సహకారం చాలా అవసరం
♦ గతానుభవాలతో ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి
♦ పీహెచ్‌సీల్లో తగినంతగా మందులు సిద్ధం
♦ తాగునీటి బావుల్లో క్లోరినేషన్ ప్రారంభం
♦ ఉద్దానంలో మిగతా వారికీ వైద్య పరీక్షలు
♦ డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు
జూన్ నెల వచ్చిందంటే వర్షాలతో పాటే సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. వీటికి ప్రధాన కారణం దోమలే. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలే వీటికి ఆవాసాలు! జనావాసాల మధ్య మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాల్సిందే. వైద్య, ఆరోగ్య విభాగం సిబ్బంది కృషికి తోడు ప్రజా చైతన్యం తోడైతేనే సీజనల్ వ్యాధులకు పక్కాగా అడ్డుకట్ట వేయగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సనపల తిరుపతిరావు చెబుతున్నారు. గతానుభవాలు పునరావృతం కాకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్న ఆయన ‘సాక్షి’ ఇంటర్వూ్యలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:
సాక్షి: సీజనల్ వ్యాధుల నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా?
డీఎంహెచ్‌వో: ఈ సీజన్‌లో డయేరియా, జ్వరాల విషయానికొస్తే చికున్‌గున్యా, డెంగీ, మలేరియా ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంటుంది. మలేరియా నిరోధానికి జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి స్ప్రేయింగ్ ప్రారంభించాం. జిల్లాలో 469 హైరిస్క్ గ్రామాలు ఉన్నాయి. తొలివిడతగా అక్కడ చేపట్టాం. అన్ని రకాల జ్వరాల నిరోధానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధం చేశాం.
జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మీ శాఖపరమైన అప్రమత్తత ఎలా ఉంది?
ఎవ్వరికైనా ప్రాథమికంగా జ్వరం లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రికి వీలైనంత త్వరగా వెళ్లాలి. అక్కడ మూడ్రోజుల నుంచి తగ్గకుండా జ్వరం వస్తుంటే ఎన్‌ఎస్–1 పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారి రక్త నమూనాలు సేకరించి శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు కానీ, విశాఖలోకి కింగ్‌జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)కు కానీ ఎలీజా పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్షల్లోనూ పాజిటివ్ వస్తే అది చికెన్ గున్యా లేదా డెంగీ జ్వరంగా నిర్ధారించి తగిన వైద్యం అందిస్తాం. ఇందుకు అవసరమైన అత్యవసర మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం. సబ్‌సెంటర్లలో, ఏఎన్‌ఎంల వద్ద కూడా ఐవీ ఫ్లూయిడ్స్ కొంతమేర ఉంచాం. ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాం.
పారిశుద్ధ్యలోపం, కలుషిత తాగునీరు కూడా వ్యాధులకు కారణమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలేమిటి?
ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలి. హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఎవ్వరు ఏ గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టాలనేది ప్రణాళిక రూపొందించి, ఆ ప్రకారం కొనసాగిస్తున్నాం. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఏటా సగటున తొమ్మిది నుంచి పది వరకూ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అలాంటి గ్రామాల్లో ప్రజలు కచ్చితంగా కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలి. ప్రతి గ్రామంలోనూ తాగునీటి బావులన్నీ క్లోరినేషన్ చేయిస్తున్నాం. పది లక్షల వరకూ క్లోరిన్ టాబ్లెట్లు జిల్లాకు అవసరమని ఇండెంట్ పెట్టాం. ప్రజలు కూడా వారానికొకసారి డ్రైడే తప్పనిసరిగా నిర్వహించాలి. పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?
ఏజెన్సీలో తగిన సంఖ్యలోనే సిబ్బంది ఉన్నారు. సీహెచ్‌సీల్లో కొన్నిచోట్ల ప్రత్యేక వైద్యాధికారులు, ముఖ్యంగా ప్రసూతి వైద్యుల కొరత ఉంది. ఆమేరకు జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీకి ఒక వైద్యాధికారి ఉండేలా చూస్తున్నాం. ఏజెన్సీలో సమస్య ఉంటే మైదాన ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై నియమిస్తాం. అలాగే ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అన్ని పీహెచ్‌సీల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చాం. వ్యాధుల పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాలని చెప్పాం.
మందుల కొరత సమస్యను ఎలా అధిగమిస్తారు?
ఓపీలో వస్తున్న పేషెంట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఇండెంట్ పెడితే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు వస్తాయి. గతంలో ఈ ప్రక్రియ సరిగా నిర్వహించకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఇ–ఔషధి ద్వారా ప్రతిరోజూ వైద్యాధికారులు స్థానికంగా వ్యాధుల పరిస్థితిని సమీక్షించి ఇండెంట్‌లు పెడుతున్నారు.
దోమతెరల పంపిణీ ఎంతవరకూ వచ్చింది?
ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం దోమతెరల పంపిణీ చేపట్టింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. గత ఏడాది 46,900 దోమతెరలు ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులతో పాటు హైరిస్క్ గ్రామాల్లో ప్రజలుకు పంపిణీ చేశాం. ఈ సంవత్సరం 90 వేల దోమతెరలు అవసరమని ఇండెంట్ పెట్టాం. అవి ఇంకా రావాల్సి ఉంది.
జిల్లాలోని చాలా ప్రాంతాలకు 104 సంచార వైద్య వాహనాలు వెళ్లకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారు?
గతంలో గుర్తించిన గ్రామాలను కచ్చితంగా కవర్‌చేసేలా 104 వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక 108 అంబులెన్స్‌ల విషయానికొస్తే పాడైన వాటిని మార్చేసి ఇటీవల ఐదు కొత్తవాటిని తెప్పించాం. డీజిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.
జిల్లాలో రోగుల అవసరానికి తగిన రక్తనిధి ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
డెంగీనే కాదు ఏ రకమైన జ్వరం బారిన పడినా రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. వాస్తవానికి జిల్లాలో జాతీయరహదారి తదితర రహదారులపై జరుగుతున్న ప్రమాదాల బాధితులకు, రోజువారీ ఆసుపత్రులకు వచ్చే జ్వరాల పీడితులు, ఇతరత్రా శస్త్రచికిత్సలకు అవసరాన్ని బట్టి చూస్తే 24 వేల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో అందుబాటులో లేదు. విద్యార్థులు మాత్రమే రక్తదానానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలి.
ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఎంతవరకూ వచ్చింది?
ఇప్పటికే ఉద్ధానం ప్రాంతంలో 15 మొబైల్ టీమ్‌లు 176 గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి రక్త, సీరమ్ పరీక్షలు చేశాయి. వీటి ద్వారా 13వేల మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో నాలుగు వేల మందికి రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవికాలం దృష్ట్యా కొంతకాలం ఈ పరీక్షలు ఆపేసినా ఈనెల రెండో వారం నుంచి మిగతావారికి మళ్లీ ప్రారంభించాం. 176 గ్రామాల్లో జనాభా 2.67 లక్షలకు పైగా ఉంది. వారిలో 18 ఏళ్లు నిండినవారికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 70 వేలమంది వరకూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు కూడా నియమితులయ్యారు.