
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
= మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన
= వివరాలు వెల్లడించిన డీఎంహెచ్‌ఓ యాస్మిన్
ఒంగోలు సెంట్రల్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా కొనకనమిట్ల, సింగరాయకొండలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. జిల్లా స్థాయిలో సీఎస్‌పురం, రాజుపాలెం, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం విజయవాడలో సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు 8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, వాటిని కూడా ప్రారంభిస్తామని వివరించారు. ఒంగోలులో 4, చీరాలలో 2, మార్కాపురంలో 2 కేంద్రాలు చొప్పున ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ కేంద్రాల్లో కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్‌ఓ యాస్మిన్ వివరించారు.