ప్రక్షాళన దిశగా మెడికల్ కళాశాల
* ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్
* అందుబాటులోకి వందమంది వైద్యులు
* డీఎంహెచ్‌ఓకు అటెండెన్స్ బాధ్యతలు
* రోగులకు అందనున్న వైద్య సేవలు
నిజామాబాద్ అర్బన్: కలెక్టర్ చొరవతో ఎట్టకేలకు జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో ప్రక్షాళన మొదలైంది. వారం రోజులుగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మెడికల్ కళాశాలపై ప్రత్యేక దృష్టిసారించారు. మెరుగైన వైద్యసేవలు అందించడం, ముఖ్యంగా ప్రొఫెసర్ల గైర్హాజరు ఇతరత్రా విషయాలపై సమీక్షిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కళాశాలలో మెరుగైన వైద్యసేవలు అందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రెండు సమీక్షలు జరిపిన కలెక్టర్ నిర్లక్ష్యపు వైద్యులపై కఠినంగా వ్యవహరించారు. చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. దీంతో వైద్యులు గాడిలో పడ్డారు. హైదరాబాద్‌కే పరిమితమైన వైద్యులు ఉన్నపలంగా జిల్లాబాట పట్టారు. ప్రస్తుతం 48 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రికి వస్తున్నారు.
గైర్హాజరైన ప్రొఫెసర్లను సైతం కలెక్టర్ హెచ్చరించి వదిలివేయడంతో వారు విధుల్లో చేరారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, డుమ్మాలు కొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైద్యులు, ప్రొఫెసర్లకు కలెక్టర్ హెచ్చరించారు. దీంతో ఖంగుతున్న ప్రొఫెసర్లు సేవలపై దృష్టిసారించారు. ప్రొఫెసర్ల పనితీరు, హాజరుకు సంబంధించి అటెండెన్స్‌ను పరిశీలించవల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోవింద్ వాగ్మోరేకు బాధ్యతలు అప్పగించారు. ప్రొఫెసర్ల హాజరు వివరాలను డీఎంహెచ్‌ఓ రోజువారీగా కలెక్టర్‌కు అందించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా గైర్హాజరైతే కలెక్టర్‌ను కలవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రోగులకు మంచిరోజులు...
జిల్లా కేంద్ర ఆస్పత్రికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 100 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చారు. 53 మంది జూనియర్ వైద్యులు కాగా, 48 మంది ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారు. వీరు వైద్యసేవలను అందించనున్నారు. జూనియర్ వైద్యులు ఔట్ పేషెంట్లకు సేవలందిస్తారు. ప్రొఫెసర్లు సర్జరీలు, అత్యవసర సేవలను అందించనున్నారు. దీంతో ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలకు వైద్యులు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. మరో పది మంది జూనియర్ వైద్యులు ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. దీంతో రోగులకు వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. ఆస్పత్రిలో అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల కష్టాలు తీరనున్నాయి.