ప్రభుత్వాస్పత్రులంటే ఇంత నిర్లక్ష్యమా?
-
రాపూరు పీహెచ్‌సీని పరిశీలించిన జెడ్పీచైర్మన్
-
వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం
-
డీఎంహెచ్‌ఓకు ఫోన్‌లో ఫిర్యాదు
రాపూరు: ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఇంత నిర్లక్ష్యమా..పేదలకు సేవలందించేందుకు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడం ఏమిటని జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం ఆయన పరిశీలించారు. వైద్యశాలలో వైద్యులు లేకపోవడాన్ని గుర్తించి హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. 25 మంది సిబ్బంది ఉన్నా హెడ్ నర్సు, మెటర్నటీ అసిస్టెంట్, దంత, ఫిజియో«థెరపీ వైద్యులు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తుంటారని దంత వైద్యుడ్ని ప్రశ్నించారు. నిత్యం 250 నుంచి 300 మంది వస్తుంటారని చెప్పగా, ఇంత మంది వస్తున్నా ఒక్క వైద్యుడు లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దంత, ఫిజియోథెరపి వైద్యులు రోగులను పరీక్షించడం ఏమిటని వెంటనే డీఎంహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడారు. ఐదుగురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ఎన్‌సీడీ వైద్యులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేకపోవడం ఏమిటని..వైద్యులకు సెలవులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వైద్యసిబ్బందిని నియమించేలా చూస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బండి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లకదుపు శకుంతల, నాయకులు పాపకన్ను దయాకర్‌రెడ్డి, బండి తిరుపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.