ముంపులో ఉన్నామని ముందే చంపేస్తారా? | gowridevipeta | Sakshi
Sakshi News home page

ముంపులో ఉన్నామని ముందే చంపేస్తారా?

Published Thu, Nov 17 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

ముంపులో ఉన్నామని ముందే చంపేస్తారా?

ముంపులో ఉన్నామని ముందే చంపేస్తారా?

 
  • డీఎంహెచ్‌ఓను ప్రశ్నించిన గౌరిదేవిపేట వాసులు
  • ప్రభుత్వ వైద్యసేవలపై అసహనం
 
 
గౌరిదేవిపేట (నెల్లిపాక): 
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మిస్తే ముంపునకు గురవుతామంటూ ఇప్పటి నుంచే వైద్యసేవలు అందకుండా చేసి ముందుగానే మమ్మల్ని చంపేస్తారా? అంటూ గౌరిదేవిపేట ప్రజలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కె చంద్రయ్యను ప్రశ్నించారు. ఎటపాక మండలంలోని నెల్లిపాక, లక్ష్మీపురం, గౌరిదేవిపేట పీహెచ్‌సీలను డీఎంఅండ్‌ హెచ్‌వో గురువారం సందర్శించి ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే గౌరిదేవిపేట పీహెచ్‌సీలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆస్పత్రికి వచ్చిన వైద్యశాఖ అధికారుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపుడో నిర్మించే పోలవరం ప్రాజెక్టు కోసం ముంపుగా గుర్తించిన గ్రామాల్లోని  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటి నుంచే సౌకర్యాలు కల్పించకపోవటం తగదని అభ్యం తరం తెలిపారు. రెండేళ్ల నుంచి పీహెచ్‌సీలో కనీస సౌకర్యాలు లేక, సరిపడా సిబ్బంది లేక వైద్యసేవలు సక్రమంగా అందక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పీహెచ్‌సీల తనిఖీకి వచ్చిన ప్రతిసారీ సమస్యలను విని వెళ్లిపోవటం తప్ప పరిష్కారం చూపిందేమీ లేదని ఉప సర్పంచ్‌ కోడూరి నవీన్, నల్లకుంట సర్పంచ్‌ సొందె రామారావు వాపోయారు. మారుమూల గ్రామాల ప్రజలు మెరుగైన వైద్యసేవలు అందక వ్యాధులతో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవటం బాధాకరమని గ్రామస్తులు ఆకుల వెంకట రామారావు, అడప రమేష్, జింకా కొండయ్య అన్నారు. ఆస్పత్రిలో అంబులెన్‌ సదుపాయం లేదని, చిన్నపాటి వర్షానికే గదులన్నీ తడిసిపోతున్నాయని తెలిపారు.  ప్రజల ఆగ్రహం, ఆవేదనను తెలుసుకున్న డీఅండ్‌హెచ్‌వో పీహెచ్‌సీ భవనాలను, పరిసరాలను పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సత్యనారాయణ, నెల్లిపాక, గౌరిదేవిపేట వైద్యులు శేషారెడ్డి, ఉదయబాస్కర్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement