సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో అధికారాల పంచాయితీ మొదలైంది. పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ అమలు కావడంలేదు. దీంతో ఆస్పత్రుల పర్యవేక్షణ అయోమయంగా మారుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రాతిపదికగా చేసుకుని డిప్యూటీ డీఎంహెచ్‌వో (జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు)లను వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని సంస్థల పర్యవేక్షణ అధికారాలు వీరికే అప్పగించింది.
ఈ మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌వోల అధికారాలను పేర్కొంటూ 2016 అక్టోబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏడాదిన్నర గడిచినా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనతతో పాత పద్ధతిలోనే పరిపాలన, పర్యవేక్షణ వ్యవహారాలు సాగుతున్నాయి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే అధికారాలు చెలాయిస్తున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంజేఏసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ ‘అధికారాల’పంచాయితీ వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైద్య సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
టీఎంజేఏసీ పేర్కొన్న ప్రధాన అంశాలివీ
- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యవేక్షణలోనే వైద్య, ఆరోగ్య శాఖ సంస్థలు, కార్యక్రమాల అమలు జరగాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని డిప్యూ టీ డీఎంహెచ్‌వోలకు నిధుల విడుదల (డీవో) అధికారాలు అమలు కావట్లేదు.
- ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారుల సాధారణ సెలవులు, గరిష్టంగా 30 ఆర్జిత సెలవుల మంజూరు, వైద్యాధికారులు, ఇతర సిబ్బంది ఇంక్రిమెంట్, ఏసీఆర్, క్రమశిక్షణ చర్యలు, ఆకస్మిక తనిఖీ వంటి అధికారాలను డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఇస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే వీటిపై అధికారాలు చెలాయిస్తున్నారు.
- లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, ఆస్పత్రుల ఏర్పాటు అనుమతి, నిర్వహణ పర్యవేక్షణ వంటి చట్టపరమైన అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే అప్పగించినా.. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం వంటి చర్యల విషయంలోనూ ఇదే జరుగుతోంది.
- మాతా శిశు సంరక్షణ, చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల బాధ్యత పూర్తిగా డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉంది. నెలవారీ సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోల ఆధ్యర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి.
- 108, 104, మృతదేహాల తరలింపు వంటి వైద్య సేవల అమలు, పర్యవేక్షణ అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉండాలి. వైద్య శాఖలోని వివిధ విభాగాల కింద ఉన్న ఆస్పత్రుల సేవల అనుసంధానం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి ఇతర ప్రభుత్వ శాఖల్లో సమన్వయం బాధ్యతలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఉంటాయి. కానీ ఇవి డీఎంహెచ్‌వోల అధీనంలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment