ప్రతీకాత్మక చిత్రం
‘‘మోకాలి నొప్పులు, వెన్ను నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దీర్ఘ కాలిక రోగాల బారినపడి విసిగిపోయారా? ఇకపై సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న సూదులతో కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేస్తాం’’ అంటూ ఆక్యుపంక్చర్ వైద్యుడిగా తనను తాను చలామణి చేసుకుంటున్న ఓ వ్యక్తి జిల్లాలో జోరుగా ప్రచారం చేశాడు. ఇదంతా నిజమేననుకుని వందలాది మంది ఆ వ్యక్తిని ఆశ్రయించారు. ఉన్నరోగం నయమవుతుంది అనుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో సర్వరోగాలను నయం చేస్తానంటూ తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టడంతో వివిధ రోగాల బారిన పడిన వారంతా అతడి వద్దకు క్యూ కట్టారు. ఆక్యుపంక్చర్ వైద్యం పేరిట అతను అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వినియోగించడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. స్థానిక ఆర్‌ఎంపీలకు ఈ విషయం తెలిసి భయపడి పోయిన వారు తమ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సదరు వ్యక్తిని పూర్తిగా తొలగించారంటే అతని వైద్యం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆక్యు పేరిట అడ్డగోలు వైద్యం..
చర్మంపైన సూదితో గుచ్చుతూ వ్యాధిని నయం చేసే నైపుణ్యతను, శాస్త్ర పరిజ్ఞానాన్ని ‘ఆక్యుపంక్చర్’ అంటారు. ఇందులో రోగలక్షణాలకు కాకుండా రోగ మూలకారకాలకు చికిత్స చేస్తారు. అలా చేస్తేనే జబ్బు పూర్తిగా నయమవుతుంది. ఇందుకోసం తేలికపాటి ప్రత్యేకమైన సూదులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ‘ఆక్యు’ పేరిట అడ్డగోలు వైద్యానికి తెరలేపాడు. తనకు తాను ఆంక్యుపంక్చర్ వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నాడు. వృద్ధాప్యం ఇతర కారణాలతో మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేసుకొని మోసానికి తెరలేపాడు. కేవలం రూ. 300 తో ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మబలకడంతో ఎంతో మంది అతని ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు.
స్టెరాయిడ్‌లతో చికిత్స
ఇంజెక్షన్ వేసుకుంటే చాలు మోకాళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయని సదరు వ్యక్తి నమ్మబలకడంతో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరుకు చెందిన ఎంతో మంది అతని వద్ద వైద్యం కోసం క్యూ కట్టారు. దీంతో అతను ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేస్తున్నాడని కొందరు బాధితులు తెలిపారు. ఇంజెక్షన్ చేసిన ప్రతిసారీ రూ.300 వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇలా ఇంజెక్షన్ వేయించుకున్న వారికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుండటంతో ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటంతో కొందరు ఆర్‌ఎంపీలకు కూడా కాసుల పంట పండుతోంది.
ఉన్న రోగాలకు తోడు కొత్తరోగం
ఇంజెక్షన్లు వేయించుకున్న వారికి తాత్కాలికంగా నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ వచ్చినా... ఆ తర్వాత నుంచి వారిని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపులు రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
పట్టించుకోని వైద్యాధికారులు
కొన్నేళ్లుగా తాడిపత్రి పట్టణంలో ‘ఆక్యు’ పేరిట ఈ దందా జరుగుతున్నా... జిల్లా వైద్యాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే వందలాది మంది అతన్ని ఆశ్రయించి మోసపోగా నేటికీ దర్జాగా ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా అతని ఆగడాలకు బ్రేక్ వేసి సామాన్యుల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఆక్యుపంక్చర్ పేరిట రోగుల ప్రాణాలతో ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. రోగులకు నొప్పులు తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయి. జిల్లాలో ఇలాంటి విధానంతో వైద్యం చేస్తున్న విషయం నాకు తెలియదు. విచారించి, ఎక్కడైనా ఇలాంటి పనులు చేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోంది. ప్రజలు ఇలాంటి తెలిసీ తెలియని వైద్యుల వద్దకు వెళ్లవద్దు.
– కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్‌ఓ
ప్రభుత్వ గుర్తింపు లేదు
ఆక్యుపంక్చర్ థెరపీ చైనా వైద్య విధానంలో భాగం. ఏపీలో ఈ వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదు. జిల్లాలో ఆక్యుపంక్చర్ చేసే వారు లేరు. ఆయుష్ వైద్య విధానంలో వివిధ రుగ్మతలకు మంచి వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్రజలు ఆస్పత్రుల్లో అందించే ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రత్నా చిరంజీవి, ఇన్‌చార్జ్ ఆయుష్ వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment