కీళ్లనొప్పులకు వైద్యం చేస్తున్న శర్మస్‌బాషా
చదివింది బీఈ ఎలెక్ట్రికల్. వృత్తి బ్యాటరీలు మరమ్మతు చేయడం. ప్రవృత్తి కీళ్ల నొప్పులకు కరెంట్ షాక్ ఇచ్చి, తదనంతరం ఇంజెక్షన్లు వేసి వైద్యం చేయడం. ఇది జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంలో జరుగుతున్న తంతు. ప్రజల మంచితనం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు, అబార్షన్‌లు చేసేస్తున్నారు. జిల్లా అధికారులు గానీ, స్థానిక వైధ్యాధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
అనంతపురం, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్న శర్మస్‌బాషా బీఈ ఎలెక్ట్రికల్ చదివాడు. తండ్రి హుసేన్‌పీరా రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి, ఆర్‌ఎంపీ. భార్య షాహిదా బేగం బీఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, బీపీటీ అని బోర్డు వేసుకుంది. శర్మస్‌బాషా బ్యాటరీల రిపేరీతో పాటు తండ్రి, భార్య బదులుగా తనే వైద్యమూ చేస్తున్నాడు. కీళ్ల నొప్పులు అని వెళ్లిన రోగులకు కరెంట్ షాక్‌తో వైద్యం చేస్తున్నాడు. ఇలాంటి నకిలీ వైద్యుల వల్ల రోగులకు జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకం. ఏదో అదృష్టం కొద్దీ ఒకరికో ఇద్దరికో నయం అయితే, అది కాస్తా ఆ నోటా ఈ నోటా పడి ప్రచారం జరుగుతుంది. నకిలీ వైద్యులు కూడా ఇలాంటి ప్రచారాలు కల్పించుకుని అమాయక పేదలను వంచిస్తున్నారు. ఇప్పటికే నకిలీ వైద్యుల బారిన పడి మృత్యువాత పడిన వారు ఉన్నారు. ఎంతో మంది అవయవాలు పనిచేయక అవిటివారుగా మిగిలిన సందర్భాలు కోకొల్లలు. వచ్చీ రాని వైద్యంతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న ఇలాంటి డబ్బుపిచ్చి రోగులకు జిల్లా వైద్యాధికారులే తగిన వైద్యం చేయాలని, అప్పుడే నకిలీల బండారం బట్టబయలవుతుందని ప్రజలు కోరుతున్నారు.
కీళ్లనొప్పులకు వైద్యం చేస్తాడిలా..
సోమవారం సాయంత్రం శర్మస్‌బాషా కీళ్లనొప్పులతో వచ్చిన ఓ వృద్ధురాలికి తన క్లినిక్‌లో కరెంట్ షాక్ ఇచ్చిన తరువాత, క్లినిక్ ముందు భాగాన, రోడ్డులోనే కాలికి ఇంజెక్షన్ వేసి, తన అసిస్టెంట్‌తో మోకాలికి క్రీం పూసి వైద్యసేవలందించాడు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడడం, నా ఇంట్లో నేను ఏమైనా చేస్తాను ఎవరూ అడుగకూడదంటూ వాగ్వాదానికి దిగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, ఇతడు చేసే వైద్యంపై విచారణ చేపట్టాలని వేడుకుంటున్నారు.
నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
ఎవరైనా నకిలీ వైద్యులుగా చలామణి అవుతూ వైద్యం చేసినట్లు రుజువు అయితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. త్వరలోనే నకిలీ వైద్యులపై విచారణ చేపట్టి, అవసరమైతే దాడులు నిర్వహించి, క్లినిక్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ అనిల్‌కుమార్,డీఎంహెచ్‌ఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment