fake doctor
-
డాక్టర్ అవతారమెత్తి.. చైన్ కొట్టేసి!
తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా రుయాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్ వార్డుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్ వేషం ధరించి చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది . ఈ క్రమంలోనే తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో చోటుచేసుకుంది... వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి పరిచయం చేసుకుంది. అనంతరం స్కానింగ్ కోసం తీసుకెళ్లి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్తకు ఇవ్వాలని చెప్పింది. అయితే శ్రీవాణి చేతివాటం ప్రదర్శించి ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. ఇందులో మరో చైన్ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగడంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. స్కానింగ్ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో బంగారు చైన్‌ను గుర్తించారు. వెస్ట్ పోలీసులకు యువతిని అప్పగించారు. -
హైదరాబాద్ లో దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
Fake Doctor: యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్
పట్నా: నకిలీ వైద్యుల చేతుల్లో అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగట్లేవు. నకిలీడాక్టర్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ 15 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీసిన ఘటన తాజాగా బిహార్‌లో వెలుగుచూసింది. పరారైన నకిలీ వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరణ్ జిల్లాలోని మదౌరా పట్టణంలో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పురి ‘శ్రీ గణపతి హాస్పిటల్’ పేరిట ఒక వైద్యశాల నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల కృష్ణకుమార్ వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం రాత్రి అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి వాంతులు తగినా పిత్తాశయంలో రాళ్లున్నాయని, ఆపరేషన్ తప్పదని వైద్యుడు చెప్పాడు. తండ్రి వారించినా బలవంతంగా ఆపరేషన్ చేశాడు. బాలుడు విపరీతమైన నొప్పితో బాధపడుతుండటంతో నిలదీయగా గద్దించి పంపించేశాడు. ఇంటికెళ్లాక బాలుడు స్పృహ కోల్పోవడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడం ముందే పసిగట్టిన వైద్యుడు వెంటనే పటా్న తీసుకెళ్లాలని సూచించాడు. మార్గమధ్యంలోనే బాలుడు కన్నుమూశాడు. ‘‘వైద్యునికి ఎలాంటి అర్హత లేదని మాకు తెలీదు. యూట్యూబ్ చేస్తూ ఆపరేషన్ చేశాడు. తర్వాతే విషయం మాకు అర్థమైంది’’ అని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా ఆరోపించారు. -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ ఘరానా మోసం
-
నకిలీ డాక్టర్... ఆపై క్షుద్రపూజలు
వరంగల్ క్రైం: మంత్రాలు, చేతబడుల పేరిట అమాయక ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్‌ఫోర్స్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ తెలిపారు. సోమవా రం హన్మకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పో లీస్‌స్టేషన్ పరిధిలోని నయీంనగర్‌కు చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్, అతని అన్న కుమారుడు స య్యద్ షబీర్ అహ్మద్‌లు ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆస్పత్రిని ప్రారంభించి దాని ముసుగులో క్షు ద్ర పూజలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పోలీ సులకు అందిన పక్కా సమాచారంతో నకిలీ డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్న ఫారహీ న ఆస్పత్రిపై దాడులు నిర్వహించి నిందితులను అ దుపులోకి తీసుకొని విచారించినట్లు పేర్కొన్నారు. నమ్మించి మోసం... నిందితులు స్థానికులతో పాటు ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొండపాక, అదిలాబాద్, ఇతర గ్రామాల నుంచి వచ్చే అమాయకులను క్షుద్రపూజ లు చేసి చేతబడి తగ్గిస్తామని, సంతానం లేనివారికి సంతానం కలిగిస్తామని, ఆరోగ్యం, ఉద్యోగం ఇతర సమస్యలను పరిష్కరిస్తామని నమ్మబలికి మోసం చేసినట్లు తెలిపారు. సయ్యద్ ఖదీర్ అహ్మద్ గతంలో కరీంనగర్లో ఓ డాక్టర్ వద్ద సహాయకుడిగా పని చేసి అక్కడే వైద్యం నేర్చుకున్నట్లు తెలిపారు. సయ్య ద్ ఖదీర్ అహ్మద్ తండ్రి ఖరిముళ్ల ఖాద్రీ గతంలో పూజలు చేసి తాయితలు కట్టేవాడన్నారు. దీంతో ఖదీర్ అహ్మద్ నిబంధనలకు విరుద్దంగా కేయూ క్రాస్‌లో 35 ఏళ్లుగా ఫారహీన పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ బారీ తెలిపారు. తన వద్దకు వచ్చే రోగులను గిట్టనివారు చేతబడి చేశారని, దయ్యం పట్టిందని, నరదృష్టి ఉందని, దోషాలు ఉండటంతో సంతానం కలగటం లేదని లేనిపోని భయబ్రాంతులకు గురిచేసి క్షుద్ర పూజలు చేసి వాటిని తగ్గిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యపరిస్థితి మెరుగుపడటానికి అల్లోపతి మందులు ఇచ్చి రోగం నయమైతే క్షుద్రపూజల వల్లే అని నమ్మిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్‌లో కొంత మంది ఇళ్లవద్దకు వెళ్లి క్షుద్రపూజలు నిర్వహించే వాడని డీసీపీ తెలిపారు. క్షుద్రపూజలకు సహకరించిన యాకుబ్‌బాబా, అ తని భార్య సుమరవీన్, ఎండీ ఇమ్రాన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సయ్యద్ ఖదీర్ అహ్మద్‌పై గతంలో గుప్తనిధులు తవ్వకంపై ములుగు ఘన్పూర్ పో లీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు డీసీపీ తెలి పారు. నిందితుల నుంచి పూజ సామాగ్రి, ఒక సెల్‌ఫోన్, కారు, రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ ఏ సీపీ జితేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వ ర్లు, శ్రీని వాస్‌రావు, ఎస్సైలు నిస్సార్‌పాషా, లవన్‌కుమార్, ఏఏవో స ల్మాన్పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వ ర్ణలత, కానిస్టేబుల్ భిక్షపతి, రాజేష్, రాజు, శ్రీని వాస్, శ్రవణ్‌కుమార్, నాగరాజు, నవీన్‌లను డీసీపీ అభినందించారు. -
ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు..
స్టేషన్‌ఘన్‌పూర్: కనీసం పదో తరగతి కూడా పాస్ కాలేదు. కానీ ఏకంగా పదేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నాడొక దొంగ వైద్యుడు. ఎట్టకేలకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఈ నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్, ఘన్పూర్ సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలివి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లిలో ఆకాష్‌కుమార్ బిశ్వాస్ గతంలో తన తాత (ఈయన స్థానికంగా వైద్యం చేసేవాడు) వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత డాక్టర్‌గా చలామణి అయి డబ్బులు సంపాందించాలనే ఆశతో అదే గ్రామంలో ప్రియాంక క్లినిక్ పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. వైద్యశాలను నిర్వహిస్తూ తనవద్దకు సాధారణ రోగాలతో వచ్చేవారికి చికిత్స చేస్తూ పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో వసూలు చేసేవాడు. పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, పిస్టులా, బుడ్డ తదితర రోగాలకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తానని చెబుతూ పదేళ్లుగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఒకవేళ రోగుల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే హనుమకొండ, వరంగల్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లమని సూచించేవాడు. సదరు ఆస్పత్రుల నుంచి సైతం పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకునేవాడు. నకిలీ డాక్టర్ బాగోతంపై విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం వరంగల్ టాస్‌్కఫోర్స్, స్థానిక పోలీసులు, ఘన్పూర్ పీహెచ్సీ వైద్యులు దాడి చేశారు. ఆస్పత్రిలో సోదాలు నిర్వహించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నకిలీ డాక్టర్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిని మూసివేయడంతో పాటు పరికరాలు, మందులు, రికార్డులు, నిందితుడి పేరిట ఉన్న విజిటింగ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో టాస్‌్కఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి, నరే‹Ùకుమార్, వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ లవన్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు.. -
మ్యాట్రిమోనిలో పరిచయం.. మహిళా డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, చెన్నై: వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్ వద్ద రూ.13 లక్షలు మోసం చేసిన నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై అడయార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా డాక్టర్ ఒకరు వివాహం కోసం మాట్రిమోని వెబ్సైట్లో చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చెన్నై నావలూర్కు చెందిన కార్తీక్ రాజ అలియాస్ దినేష్ కార్తీక్ (28) ఆ వివరాలతో మహిళా డాక్టర్‌తో తాను కూడా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 12.95 లక్షలు, ఒక ఫోన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మహిళా డాక్టర్ నేరుగా కలుసుకుని వివాహం గురించి మాట్లాడదామంటూ కోరగా కార్తిక్రాజ తిరస్కరించాడు. దీంతో అతనిపై సందేహం ఏర్పడిన మహిళా డాక్టర్ ఈ విషయం గురించి తన బంధువు ఒకరికి వివరించింది. అతను వెంటనే అడయారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌రాజ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నిందితుడిని విచారణ చేశారు. ప్రేమ పేరుతో పలువురు యవతులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బీకాం పూర్తి చేసి డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. రూ. 98 వేలు నగదు, 5 సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. -
హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్ భాగోతం గుట్టురట్టు
-
ఫేస్బుక్లో పరిచయం.. వాట్సాప్‌లో మరింత క్లోజ్, చివరికి!
సాక్షి, హిమాయత్‌నగర్: ఇంగ్లండ్‌లో డాక్టర్ (జనరల్ ఫిజీషియన్) అంటూ ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన అడ్వకేట్ రజలి అమృతరావుకు కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ యవతి పరిచమైంది. కొంతకాలం వీరిద్దరూ మెసెంజర్లో చాటింగ్ చేసుకుని వాట్సాప్ నంబర్స్‌ను ఎక్సేంజ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తాను క్లినిక్ పెడతానని, దానికి సపోర్ట్ కావాలని అమృతరావును కోరింది. ఇందుకు ఆయన అంగీకరించడంతో... ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని చెప్పింది. తనతో పాటు ఖరీదైన గిఫ్ట్‌లను సైతం తీసుకొస్తున్నానని అమృతరావును నమ్మించింది. మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు నన్ను ఆపేశారని, నా వద్ద ఇండియన్ కరెన్సీ లేదని కాల్స్ చేసింది. ఇందుకు అమృతరావు రూ. 2.03 లక్షలను ఆమె ఖాతాకు పంపారు. ఆ తర్వాతా ఇంకా డబ్బులు అవసరమని పదే పదే చెప్పడంతో అనుమానం వచ్చిన అమృతరావు ఆరా తీసేందుకు ప్రయతి్నంచాడు. ఫోన్లను స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి శనివారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి చదవండి: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అది డెంగీ దోమలకు నిలయమే -
నకిలీ డాక్టర్ల దోపిడీ గుట్టు రట్టు..!
ముంబై: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గోవాండి-శివాజీనగర్ ప్రాంతాలలో ఐదుగురు నకిలీ డాక్టర్లను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఈశాన్య ముంబైలోని మురికివాడల్లో రోగుల నుంచి వైద్యం పేరిట విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పోలీస్ ఇన్స్పెక్టర్ హెచ్ఎమ్ నానవారే, కానిస్టేబుల్ ఎన్బీ సావంత్ నకిలీ డాక్టర్లపై దర్యాప్తు చేసి, ఎం- ఈస్ట్ వార్డ్ బీఎంసీ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రియా కోలికి సమాచారం అందించారు. దీంతో బీఎంసీ అధికారులు, పోలీసుల బృందం బుధవారం మురికివాడల్లో ఐదుగురు నకిలీ వైద్యుల స్థావరాలపై దాడి చేశారు. వారు రోగుల నుంచి వివిధ రకాల చికిత్సల కోసం విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. డిగ్రీలు లేవు.. అన్ని రకాల రోగాలకు చికిత్స నకిలీ డాక్టర్లకు మెడికల్ డిగ్రీలు గానీ మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లేదా మరే ఇతర అథారిటీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు లేవని ఓ అధికారి చెప్పారు. కాగా వారు అన్ని రకాల వ్యాధులకు, గాయాలకు ఇంజెక్షన్లు, మందులు, శస్త్రచికిత్సలకు సలహా ఇవ్వడం మొదలైన అన్ని రకాల రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఐదుగురు నకిలీ డాక్టర్ల వయసు 43 నుంచి 53 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారీ ఎత్తున వైద్య సామాగ్రి స్వాధీనం నకిలీ డాక్టర్ల నుంచి భారీ ఎత్తున స్టెతస్కోప్‌లు, ఇంజెక్షన్లు, డ్రిప్పు బాటిళ్లు, శస్త్రచికిత్స ట్రేలు, అన్ని రకాల మందులు, సిరప్లు, యాంటీబయాటిక్స్ కొన్ని సున్నితమైన లేదా పరిమిత వినియోగ మందులు, వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, వైద్య సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఐదుగురు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్, మహారాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం, 1961లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ డాక్టర్ నర్సింగ్ హోం.. దారుణాలు అన్నీ ఇన్నీ కావు
పట్నా: వైద్యుడని ప్రజలను నమ్మిస్తూ ప్రైవేట్ నర్సింగ్ హోం నడిపిస్తున్న ఓ ఫేక్ డాక్టర్ భాగోతం బయటపడింది. సదరు వ్యక్తి నవజాత శిశువును విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో ఈ చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బిహార్‌లోని మధేపుర జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబా విష్ణు రౌత్ హాస్పిటల్ పేరుతో నిందితుడు ఆర్కే రవి రిజిష్టర్ కూడా చేయకుండా నర్సింగ్ హోంను గత కొంత కాలంగా నడుపుతున్నాడు. అంతేగాక అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా వైద్యం పరంగా ఎటువంటి శిక్షణలు తీసుకోకుండానే రోగులకు వైద్యం చేస్తున్నారు. దీంతో అక్కడ జరుగుతున్న అవకతవకలపై పోలీసులకు సమాచారం అందింది. మాధేపుర జిల్లా మేజిస్ట్రేట్ శ్యామ్ బిహారీ మీనా ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఉదకిషుగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజీవ్ రంజన్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నర్సింగ్ హాంపై అధికారులు దాడి జరుగుతున్న సమయంలో నిందితుడు రవి ఓ నవజాత శిశువును రూ 65,000కు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. శిశువును కాపాడిన అధికారులు మధేపుర సదర్ హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు రవి, ఆస్పత్రి సిబ్బంది నవీన్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రవి డాక్టర్‌గా కావాల్సిన నకిలీ సర్టిఫికెట్లను సృష్టించుకుని కొన్నాళ్లుగా వైద్యుడిగా కొనసాగినట్లు తెలిపాడు. శిశువులను తాను రూ 85,000 నుంచి రూ 1.5 లక్షలకు కొందరికి విక్రయించినట్లు వెల్లడించాడు. దవాఖానను సీజ్ చేసిన పోలీసులు రోగులందరినీ సమీప పీహెచ్‌సీకి తరలించారు. అక్రమ రవాణా రాకెట్ గత రెండు సంవత్సరాలుగా నర్సింగ్ హోమ్ నుంచి నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. -
తాడిపత్రిలో శంకర్‌దాదా ఎంబీబీఎస్..
‘‘మోకాలి నొప్పులు, వెన్ను నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దీర్ఘ కాలిక రోగాల బారినపడి విసిగిపోయారా? ఇకపై సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న సూదులతో కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేస్తాం’’ అంటూ ఆక్యుపంక్చర్ వైద్యుడిగా తనను తాను చలామణి చేసుకుంటున్న ఓ వ్యక్తి జిల్లాలో జోరుగా ప్రచారం చేశాడు. ఇదంతా నిజమేననుకుని వందలాది మంది ఆ వ్యక్తిని ఆశ్రయించారు. ఉన్నరోగం నయమవుతుంది అనుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో సర్వరోగాలను నయం చేస్తానంటూ తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టడంతో వివిధ రోగాల బారిన పడిన వారంతా అతడి వద్దకు క్యూ కట్టారు. ఆక్యుపంక్చర్ వైద్యం పేరిట అతను అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వినియోగించడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. స్థానిక ఆర్ఎంపీలకు ఈ విషయం తెలిసి భయపడి పోయిన వారు తమ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సదరు వ్యక్తిని పూర్తిగా తొలగించారంటే అతని వైద్యం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆక్యు పేరిట అడ్డగోలు వైద్యం.. చర్మంపైన సూదితో గుచ్చుతూ వ్యాధిని నయం చేసే నైపుణ్యతను, శాస్త్ర పరిజ్ఞానాన్ని ‘ఆక్యుపంక్చర్’ అంటారు. ఇందులో రోగలక్షణాలకు కాకుండా రోగ మూలకారకాలకు చికిత్స చేస్తారు. అలా చేస్తేనే జబ్బు పూర్తిగా నయమవుతుంది. ఇందుకోసం తేలికపాటి ప్రత్యేకమైన సూదులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ‘ఆక్యు’ పేరిట అడ్డగోలు వైద్యానికి తెరలేపాడు. తనకు తాను ఆంక్యుపంక్చర్ వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నాడు. వృద్ధాప్యం ఇతర కారణాలతో మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేసుకొని మోసానికి తెరలేపాడు. కేవలం రూ. 300 తో ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మబలకడంతో ఎంతో మంది అతని ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు. స్టెరాయిడ్లతో చికిత్స ఇంజెక్షన్ వేసుకుంటే చాలు మోకాళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయని సదరు వ్యక్తి నమ్మబలకడంతో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరుకు చెందిన ఎంతో మంది అతని వద్ద వైద్యం కోసం క్యూ కట్టారు. దీంతో అతను ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేస్తున్నాడని కొందరు బాధితులు తెలిపారు. ఇంజెక్షన్ చేసిన ప్రతిసారీ రూ.300 వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇలా ఇంజెక్షన్ వేయించుకున్న వారికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుండటంతో ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటంతో కొందరు ఆర్ఎంపీలకు కూడా కాసుల పంట పండుతోంది. ఉన్న రోగాలకు తోడు కొత్తరోగం ఇంజెక్షన్లు వేయించుకున్న వారికి తాత్కాలికంగా నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ వచ్చినా... ఆ తర్వాత నుంచి వారిని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపులు రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకోని వైద్యాధికారులు కొన్నేళ్లుగా తాడిపత్రి పట్టణంలో ‘ఆక్యు’ పేరిట ఈ దందా జరుగుతున్నా... జిల్లా వైద్యాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే వందలాది మంది అతన్ని ఆశ్రయించి మోసపోగా నేటికీ దర్జాగా ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా అతని ఆగడాలకు బ్రేక్ వేసి సామాన్యుల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఆక్యుపంక్చర్ పేరిట రోగుల ప్రాణాలతో ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. రోగులకు నొప్పులు తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయి. జిల్లాలో ఇలాంటి విధానంతో వైద్యం చేస్తున్న విషయం నాకు తెలియదు. విచారించి, ఎక్కడైనా ఇలాంటి పనులు చేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోంది. ప్రజలు ఇలాంటి తెలిసీ తెలియని వైద్యుల వద్దకు వెళ్లవద్దు. – కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్ఓ ప్రభుత్వ గుర్తింపు లేదు ఆక్యుపంక్చర్ థెరపీ చైనా వైద్య విధానంలో భాగం. ఏపీలో ఈ వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదు. జిల్లాలో ఆక్యుపంక్చర్ చేసే వారు లేరు. ఆయుష్ వైద్య విధానంలో వివిధ రుగ్మతలకు మంచి వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్రజలు ఆస్పత్రుల్లో అందించే ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రత్నా చిరంజీవి, ఇన్చార్జ్ ఆయుష్ వైద్యాధికారి -
రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ హల్చల్ చేశాడు. తేజారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏకంగా పోలీసులకే మస్కా కొట్టి లాక్డౌన్ సమయంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో రాచకొండ పరిధిలోని పలువురు పోలీసులకు కరోనా మందులు కూడా అందించినట్లు తెలిసింది. అయితే తేజారెడ్డి వ్యవహారంపై పోలీసులకు అనుమానం రావడంతో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో బెంగుళూరులోనూ ఇదే తరహాలో అక్కడి పోలీసులను బురిడీ కొట్టించాడు. తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నంటూ.. సీనియర్ ఐపీఎస్ కుమారుడినంటూ చెప్పుకుంటూ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించేవాడు. ఈ కేసులో తేజారెడ్డిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తేజారెడ్డి హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. (చదవండి : మూగ ప్రేమజంట బలవన్మరణం) లాక్డౌన్ సమయంలో తేజారెడ్డి డాక్టర్ అవతారమెత్తి రాచకొండ పరిధిలోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో వలంటీర్‌గా విధులు నిర్వహించాడు. అంతేగాక తేజారెడ్డి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 15 లక్షలకు పైగా రుణాలు తేజారెడ్డి ఎగ్గొట్టినట్లు తేలింది. మరోవైపు తేజారెడ్డి తన వ్యక్తిగత జీవితంలో.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. తేజారెడ్డి తనపై వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని రెండవ భార్య ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తేజారెడ్డి ఇటీవలే ఒక రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనంగా స్టికర్ అంటించి తిరుగుతున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా తేజారెడ్డి జీవిత చరిత్ర బయటపడింది. -
కోవిడ్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం
-
కోవిడ్ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్ సోకిన రోగుల వద్దకు కుటుంబ సభ్యులే వెళ్లేందుకు సాహసించడం లేదు.. వైద్యు లు సైతం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యుప్మెంట్ (పీపీఈ) కిట్ ధరించి వెళ్లి వైద్యం చేస్తుంటారు. అలాంటిది ఓ 45 ఏళ్ల మహిళ డాక్టర్ అవతారం ఎత్తి నాలుగు రోజులుగా, ఐసీయూల్లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి వస్తుంది. అదేరీతిలో బుధవారం కూడా మెడలో స్టెత్ వేసుకుని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌కు వచ్చింది. అక్కడ స్టోర్‌కు వెళ్లి డాక్టర్ శైలజ అని రిజిస్టర్లో రాసి పీపీఈ కిట్ తీసుకుంది. అనంతరం అక్కడే తచ్చాడుతుండగా, కొందరు సిబ్బందికి అనుమానం వచ్చి, మీరు ఎవరని ప్రశ్నించగా, ‘ఐయామ్ డాక్టర్ శైలజ’ అని చెప్పింది. ఏ విభాగంలో పనిచేస్తారని అడగ్గా, ఇక్కడే కోవిడ్ హాస్పటల్లో అని చెప్పింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది పీపీఈ తీసుకుంటే సంతకం పెట్టాలని చెప్పి పక్కనే ఉన్న రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ కూర్చోపెట్టి ఐడెంటిటీ కార్డు అడగ్గా, తనవద్ద లేదని ఒకసారి, మా బంధువులు వస్తానంటే వచ్చానని మరోసారి, ఆయుర్వేద వైద్యురాలినని, బంధువులు ఐసీయూలో ఉంటే చూసేందుకు వచ్చానని ఇలా పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారించగా ప్రసాదం పాడు అని, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినట్లు తెలిసింది. డాక్టర్ అవతారం ఎత్తి ఎందుకు వచ్చిందనే విషయం ఇంకా తెలియలేదు. కాగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆస్పత్రి నుంచి రావడంతో, ఆమెకు ఎక్కడ కరోనా సోకిందోనని పోలీసులు సైతం భయపడుతున్నట్లు తెలిసింది. నాలుగు రోజులుగా ఐసీయూ వార్డులో హల్చల్ డాక్టర్ శైలజ పేరుతో సదరు మహిళ నాలుగు రోజులుగా ఐసీయూలో తిరుగుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల కొత్తగా 80 మంది వైద్యులు రావడంతో వారిలో ఒకరై ఉంటారని సిబ్బంది భావించారు. అంతేకాకుండా పీపీఈ వేసుకోవడంతో గుర్తుపట్టలేక పోయినట్టు చెబుతున్నారు. ఇలా తనతో పాటు మరొకరిని తీసుకుని ఐసీయూల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వారి బంధువులను శైలజ డాక్టర్ అవతారంలో తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. నకిలీ డాక్టర్ శైలజ, ఆమె భర్త అరెస్ట్ కోవిడ్ ఆస్పత్రిలో హల్చల్ చేసిన నకిలీ డాక్టర్ శైలజ, ఆమె భర్త సత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ.. శైలజ, సత్య ఇద్దరు పాత నేరస్తులని, వారిద్దరిపై చీటింగ్ కేసులు ఉన్నాయన్నారు. కరోనా రోగుల బంధువుల దగ్గర డబ్బులు వసూలు చేసేందుకే శైలజ డాక్టర్ అవతారం ఎత్తినట్లు చెప్పారు. భర్త సహకారంతోనే నాలుగు రోజులుగా ఆస్పత్రి సిబ్బందిని మోసం చేస్తోన్నట్లు తెలిపారు. -
‘కొవిడ్’ తీగలాగితే బయటపడ్డ సూడో డాక్టర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకరు చదివింది ఇంటర్మీడియట్... మరొకరు పదో తరగతితో స్వస్థి చెప్పారు... అయినప్పటికీ ఇద్దరూ వైద్యుల అవతారం ఎత్తారు. ఒకరు చైర్మన్‌గా, మరొకరు మేనేజింగ్ డైరెక్టర్‌గా సమీర్ హాస్పిటల్ పేరుతో వైద్యశాల సైతం నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరిద్దరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్ సుభానీ బీకాం రెండో సంవత్సరం చదువుతూ 2006లో స్వస్థి చెప్పాడు. 2011లో మెహదీపట్నం ప్రాంతంలో గ్లోబల్ టెక్నో స్కూల్ పేరుతో పాఠశాలను నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్ కేవలం పదో తరగతి వరకే చదివాడు. ఆపై హుమాయున్‌నగర్‌లోని ఎంఎం హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆసుపత్రి ఏర్పాటు చేస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్ తన స్నేహితుడైన షోయబ్‌కు చెప్పాడు. ఇందుకు అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్ పేరుతో ఓ ఆధార్ కార్డు సంపాదించాడు. దీని ఆధారంగా 2017లో డీఎంఅండ్ హెచ్ఓకు దరఖాస్తు చేసుకుని ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆధారంగా ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో సమీర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో అనేక మందికి వైద్యం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్‌కుమార్ శనివారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు ఇద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ‘కరోనా మందుల’ తీగలాగితే... ఈ నకిలీ డాక్టర్ల దందా గుట్టురట్టు కావడానికి కరోనా మందుల బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారమే కారణం. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరోనా రోగులకు వాడే రెమిడెసిమీర్ ఇంజెక్షన్లకు బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు పట్టుకున్న ఏడుగురిలో సమీర్ ఆసుపత్రి మెడికల్ షాప్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న మహ్మద్ ఒబేద్ ఒకడు. ఇత గాడు సమీర్ ఆసుపత్రిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి నిర్వాహకులకు ఈ దందాలో ప్రమేయం ఉందా? అనే కోణంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానించారు. ఈ సందేశం నివృత్తి చేసుకునేందుకు ఆసుపత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుభానీని తమ కార్యాలయానికి పిలిపించారు. ఇతడిని విచారిస్తున్న నేపథ్యంలో తాను డాక్టర్‌ను కాదని, కేవలం అలా చెలామణి అవుతుంటానని, ముజీబ్ మాత్రమే డాక్టర్ అని అతగాడు చెప్పాడు. దీంతో ముజీబ్‌ను పిలించిన అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇతడు కూడా డాక్టర్ కాదని, ఇద్దరు సూడో డాక్టర్లు కలిసి సుమీర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. -
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
-
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ వృత్తి. అదేంటీ టెన్త్ చదివితే డాక్టర్ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ వ్యవహారంలో ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు ప్రైవేటు ఆస్పత్రిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. టెన్త్ చదివి డాక్టర్‌గా చలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ ముజిబ్, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. (కొంపముంచిన ఓఎల్ఎక్స్ బేరం!) -
నకిలీ డాక్టర్ల ఆటకట్టు
పలమనేరు: ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని వైద్యం అందిస్తున్న నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ల ఆట కట్టించిన సంఘటన గంగవరం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. నాలుగురోడ్లు గ్రామం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రి సేవలు కావాలంటే సమీపంలోని పత్తికొండ లేదా పలమనేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు అక్షరాస్యత తక్కువగానే ఉంది. దీన్ని గమనించిన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ఎల్డూర్‌కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ గ్రామంలో ఆర్వీ క్లినిక్ పేరిట మూడు నెలల క్రితం హైవేకు ఆకునుని ఆస్పత్రి ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఏమైందో కానీ అతను ఉన్నట్టుండి మాయమయ్యాడు. అదే ఆస్పత్రిలో మహేంద్ర అనే కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ వైద్యం అందించడం మొదలుపెట్టాడు. అనుభవం, చదువు లేక కనీసం నాడి కూడా తెలియని మహేంద్ర సేవలపై అనుమానం వచ్చిన కొందరు రోగులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంగవరం మండల వైద్యాధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పత్తికొండ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ యుగంధర్ బుధవారం ఆ క్లినిక్‌ను తనిఖీ చేశారు. డాక్టర్‌గా చెలామణి అవుతున్న మహేంద్ర అసలు డాక్టరే కాదని, అతనికి ఏమాత్రం అనుభవం లేదని తేలింది. క్లినిక్‌లో ల్యాబ్, రోగులకు బెడ్లు, అక్కడే మందులు ఉండడాన్ని చూసి విస్తుపోయారు. క్లినిక్‌ను సీజ్ చేసి, అక్కడున్న బోర్డులను తొలగించారు. మహేంద్ర, శివకుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు వారు తెలిపారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని సూచించారు. -
బాన్సువాడలో నకిలీ డాక్టర్ కలకలం
సాక్షి, బాన్సువాడ టౌన్: బాన్సువాడలోని ఎన్జీవోస్ కాలనీలో నకిలీ వైద్యుడు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతుండగా ఎంబీబీఎస్ డాక్టర్లు పట్టుకుని, ఎంఐవోకు ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో మూడేళ్ల కిత్రం సంగారెడ్డికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ సమన్విత హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. పట్టణంలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులకు శ్రీకాంత్‌రెడ్డి రాసే మందుల చీటిలపై అనుమానం వచ్చింది. ఒక రోగానికి మరో మందు రాస్తున్నారని వారు గమనించారు. దీంతో వైద్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిని పిలిచారు. ఆయన చదువుకున్న కళాశాల వివరాలు ఆరా తీశారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఎంఎన్ఆర్ కళాశాలలో చదివానని, మరో సారి ఢిల్లీ యూనివర్సిటీలో చదివానని తడబడుతు సమాధానం చెప్పారు. తన వద్ద ఉన్న సర్టిఫికేట్‌ను వైద్యులు ఆన్లైన్లో సెర్చ్ చేయగా నకిలీ అని తేలింది. దీంతో వారు శ్రీకాంత్‌రెడ్డిని నిలదీయగా తాను కొంపల్లిలో ఓ ఆస్పత్రిలో పని చేశానని, బోధన్‌కు చెందిన సాయిబాబా తనను బాన్సువాడకు తీసుకువచ్చాడని చెప్పారు. గతంలో ఇక్కడ ఉన్న వైద్యుల వద్ద హాస్పిటల్‌ను రూ.8.50 లక్షలకు కొనుగోలు చేశామని కొన్ని రోజుల తర్వాత సాయిబాబా మోసం చేయడంతో ఒక్కడినే హాస్పిటల్ నడిపిస్తున్నానని చెప్పారు. దీంతో వైద్యులు నిజామాబాద్‌లో ఉన్న ఐఎంవోకు ఫిర్యాదు చేయగా, వారు కామారెడ్డిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తారని తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి హాస్పిటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఆయనకు సంబంధించిన హాస్పిటల్ బోధన్‌లో కూడా ఉన్నట్లు తెలిసింది. వేరే మందులు రాస్తుండటంతో.. రోగం ఒకటి ఉంటూ వేరే మందులు రాస్తుండటంతో శ్రీకాంత్‌రెడ్డిపై అనుమానం వచ్చింది. వైద్యులందరం కలిసి ఆయనను పిలిచి సర్టిఫికెట్ల గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఐఎంవోకు ఫిర్యాదు చేశాం. – కిరణ్‌కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, బాన్సువాడ -
గాంధీలో నకిలీ వైద్యుడు
గాంధీ ఆస్పత్రి: ఏకంగా ఆరు నెలలు ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తి గాంధీ ఆస్పత్రిలో తిరిగాడు.. అక్కడికి వచ్చిన రోగుల్ని తన క్లీనిక్‌కు ఎంచక్కా తరలించాడు.. ఇంత జరిగినా ఆస్పత్రి పాలనా యంత్రాంగం అతడు నకిలీ వైద్యుడన్న సంగతిని గుర్తించలేకపోయింది.. ఇంతకీ ఎవరీ నకిలీ డాక్టర్.. ఒడిశాకు చెందిన సుబ్రజిత్ పండా (26) నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాడు. సులభంగా డబ్బుల సంపాదనకు వైద్యుడిగా అవతారం ఎత్తాడు. ఇంజెక్షన్లు వేయడం, బీపీ, సుగర్ చెక్ చేయడం, జలుబు, దగ్గు, జ్వరం వంటి సా«ధారణ రోగాలకు ఏ మందులు ఇవ్వాలో నేర్చుకున్నాడు. ఉప్పల్, హనుమాన్ సాయినగర్‌లోని గాంధీ విగ్రహం వద్ద తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కమ్యూనిటీ కార్డియాలజీ పేరిట క్లినిక్‌ను ప్రారంభించాడు. విదేశాల్లో డాక్టర్ కోర్సులు చదివినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకున్నాడు. అయితే.. అనుకున్నంతగా రోగులు రాకపోవడంతో రూటు మార్చి గాంధీ ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట ఎంఎస్ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జన్‌గా నకిలీ ఐడీకార్డును సృష్టించుకున్నాడు. ఈ కార్డుతో గాంధీ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో వైద్యుడిగా తిరిగాడు. చికిత్సలో జాప్యం తోపాటు సిబ్బంది కొరతతో ఇక్కడ పట్టించుకోరని చెబుతూ తన క్లినిక్‌కు వస్తే తక్కువ ఖర్చుతో రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగులను తన క్లినిక్‌కు తరలించేవాడు. గురువారం క్యాంటీన్లో ఉండగా జనరల్ మెడిసిన్ పీజీలు అక్కడకు వచ్చి మీది ఏ డిపార్ట్మెంట్ అని పండాను అడిగారు. అనుమానంతో సెక్యూరిటీకి సమాచారమిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుబ్రజిత్పండాపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టు, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ తెలిపారు. -
దంపతులకు సంతానం పేరుతో టోకరా..
అనంతపురం,కళ్యాణదుర్గం రూరల్: సంతాన భాగ్యం లేని వారికి తానిచ్చే నాటుమందుతో పిల్లలు కలుగుతారని నమ్మబలికి దంపతుల నుంచి డబ్బులు దండుకుని ఉడాయించిన నకిలీ డాక్టర్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కళ్యాణదుర్గం సీఐ సురేష్‌బాబు తెలిపిన మేరకు... కణేకల్ మండలం హనకనహాళ్ గ్రామానికి చెందిన శిరీష, కుళ్లాయప్పలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. పిల్లల కోసం వీరు తిరగని ఆలయాలు లేవు.. మొక్కని దేవుడు లేడు. పెద్దలు చెప్పిన పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇదే సమయంలో గురువారం ఉదయం డాక్టర్‌నంటూ ఓ వ్యక్తి హనకనహాళ్‌కు వచ్చాడు. తానిచ్చిన నాటుమందు వాడితే సంతానం కలుగుతారని నమ్మబలికాడు. చివరకు శిరీష దంపతుల వద్దకు అతను వచ్చాడు. తానిచ్చే మందుతో కచ్చితంగా పిల్లలు పుడతారని, అయితే మందు విలువ రూ.లక్ష అవుతుందని చెప్పాడు. సంతానం కోసం తహతహలాడుతున్న ఆ దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. అయితే తమవద్ద అంత డబ్బు లేదనడంతో అడ్వాన్స్ కింద రూ.50 వేలు ఇవ్వాలని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో అడిగిన వెంటనే దంపతులు తమ వద్ద ఉన్న బంగారు నగలను తీసుకుని కళ్యాణదుర్గంలోని ప్రైవేట్ ఫైన్సాన్ కంపెనీలో బంగారు తాకట్టు పెట్టి రూ.48 వేలు తీసుకొచ్చి ఆ వ్యక్తికి అప్పజెప్పారు. రాగిపిండి. నన్నారి రసమే నాటు మందు! అడ్వాన్స్ తీసుకున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఓ కషాయాన్ని దంపతులకు కిచ్చి.. మిగిలిన డబ్బు త్వరలోనే ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత దంపతులు కషాయాన్ని పరిశీలించగా రాగిపిండి, నన్నారి రసం కలిపి ఇచ్చాడని నిర్ధారించుకున్నారు. నకిలీ డాక్టర్ చేతిలో మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు. తమకు జరిగిన మోసంపై శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణ సీఐ సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. -
నకిలీ డాక్టర్ దంపతుల అరెస్ట్
చెన్నై,పళ్లిపట్టు: పళ్లిపట్టులో ఆసుపత్రి నిర్వహిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ దంపతులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో డెంగీ వ్యాప్తి చెందడంతో వందలాది మంది జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలకు బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వైద్యులను సంప్రదించి చికిత్స పొందడంతోనే జ్వరాల బారినపడిన బాధితుల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. దీంతో నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు వీలుగా జిల్లా ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దయాళన్ అధ్యక్షతన ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంత వరకూ పళ్లిపట్టు, తిరుత్తణి సహా జిల్లాలో ఆరుగురు నకిలీ వైద్యులను ఆరోగ్యశాఖ అధికారుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పళ్లిపట్టులోని నగరి రోడ్డు మార్గంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి చీఫ్ డాక్టర్ కావలన్ అధ్యక్షతన మండల వైద్యాధికారి ధనుంజయన్ తదితరుల బృందం తనిఖీ చేపట్టగా మురళి (42) అనే వ్యక్తి పదో తరగతి చదవగా, అతని భార్య క్రాంతి(35) ఉపాధ్యాయ శిక్షణ పొందింది. ఈ దంపతులు రోగులకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, మందులు స్వాధీనం చేసి దంపతులను పోలీసులకు అప్పగించారు. పళ్లిపట్టు పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ డాక్లర్లను అరెస్ట్ చేశారు. -
కాంపౌండర్.. ఆసుపత్రి నడపటమేంటి?
అతనొక కాంపౌండర్. ఏడాదిన్నర నుంచి స్కిన్, హెయిర్ స్పెషలిస్ట్ ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ అర్హతల డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో లేజర్ ట్రీట్మెంట్ మెషిన్లు, బెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. శంకర్‌దాదా.. ఎంబీబీఎస్ సినిమా తరహా అవతారమెత్తి స్పెషలిస్ట్ డాక్టర్‌గా దర్జాగా ఆస్పత్రినే నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఆస్పత్రులు కేంద్రీకృతమై ఉండే క్రిస్టియన్ పేటలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కొత్త డాక్టర్, ఆస్పత్రి విషయమై స్థానికంగా ఉండే డాక్టర్లకు అనుమానాలు ఉన్నా.. ఆయన ఎవరో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తున్నాడు. అదీ ఏడాదికి పైగా కొనసాగుతుండడం వైద్యశాఖ నిర్లక్యానికి అద్దం పడుతోంది. సాక్షి, కావలి: వైద్యులుగా సాధారణంగా ఎంబీబీఎస్ చదివిన వారు ఉంటారు. ఇక ఒక్కో రకం వైద్యంలో స్పెషలైజేషన్ చేసిన వారు ఆపై చదువు అయిన ఎండీ చేసి ఉంటారు. కానీ కావలిలో సాధారణ వ్యక్తి చర్మ వ్యాధులకు సంబంధించి స్పెషలైజేషన్ ఎండీ చేసినట్లుగా ఏకంగా బోర్డు పెట్టి పెద్ద భవంతిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. పట్టణానికి సమీపంలో ఉన్న ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన ఓ సురేష్ చాలా కాలంగా కావలిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంపౌండర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను కావలిలో కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పట్టణంలోని క్రిస్టియన్‌పేట ఐదో లైన్లో ఒక భవనంలో ఏకంగా ఎస్ఎస్ఎం క్లినిక్ అనే పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. ఆ ఆస్పత్రి వద్ద డాక్టర్ ఓ.సురేష్ అనే బోర్డు తగిలించాడు. ఆ బోర్డులో ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ తన విద్యార్హతలుగా పేర్కొన్నాడు. స్కిన్, హెయిర్, లేజర్ వైద్య నిపుణుడిగా కనపరిచాడు. ఆస్పత్రిలో చికిత్స చేయడానికి రెండు మెషిన్లు, బెడ్లు సమకూర్చాడు. ఒక యువతిని నర్సుగా పెట్టుకొన్నాడు. రోగులకు మందులు రాసి ఇచ్చే ప్రిస్కిప్షన్ పై భాగంలో డాక్టరు పేరుతో పాటు మెడికల్ బోర్డులో వైద్యుడిగా రిజస్ట్రేషన్ చేసుకున్న నంబర్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ నకిలీ డాక్టర్ ప్రిస్కిప్షన్ కాగితంలో ఎక్కడా రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. సమాచారం తెలుసుకున్న కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ వైద్య శాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.విజయకుమార్, డాక్టర్ పీసీ కోటేశ్వరరావు, సిబ్బంది కలిసి సంయుక్తంగా గురువారం ఆస్పత్రిలో తనిఖీకి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని నకిలీ డాక్టర్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. అక్కడ నర్సుగా ఉన్న యువతి అధికారులకు డాక్టర్ లేరు, పనిమీద బయటకు వెళ్లారు అని చెప్పింది. దీంతో వైద్య అధికారులు ఆస్పత్రి భవనంలోకి వెళ్లి రోగులకు చికిత్స చేసే మిషన్లు, బెడ్లు, ఓపీ పరీక్షలు చేసే గది, శతక్కోప్ తదితర వాటిని చూసి నివ్వెరపోయారు. -
వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్) : గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందించే వారు ఆర్ఎంపీలు, పీఎంపీలు. వారికున్న అవగాహన, అనుభవం మేరకు చికిత్సనందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తులు. కానీ ప్రస్తుతం కొందరు అక్రమార్జనే ధ్యేయంగా కనీస పరిజ్ఞానం లేకున్నా, అవగాహన లేకున్నా డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొద్ది రోజుల పాటు ఏదో ఒక ఆస్పత్రిలో పనిచేసి వైద్యుల్లా చలామణి అవుతున్నారు. అవసరమున్నా లేకపోయినా రకరకాల మందులు, టెస్టులు రాసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో ప్రథమ చికిత్సకు ఆర్ఎంపీ వద్దకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోపు కావాల్సిన ప్రథమ చికిత్స అందిస్తుంటారు. కానీ వారిలోని కొందరు అక్రమార్జన బాట పట్టారు. అవగాహన లేకపోయినా, వైద్యం అందిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాసుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యం కోసం ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే స్థాయికి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిజ్ఞానం లేకపోయినా వైద్యం.. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్ఎంపీలు పరిజ్ఞానం లేకుండానే వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆర్ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులు. జ్వరం, జలుబు లాంటి వాటికి చిన్న చిన్న మాత్రలు ఇస్తే సరిపోతుంది. కానీ చాలా మంది పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అవగాహన లేక కొంత, రోగం తొందరగా తగ్గితే చాలా మంచి డాక్టర్‌గా పేరు సంపాదించాలన్న ఆత్రుత కొంత వెరసీ అవసరమున్న దానికంటే ఎక్కువ మోతాదు మందులు ఇస్తున్నారు. ఫలితంగా రోగి బలహీన పడిపోవడమే కాకుండా ఎక్కువ రోజులు రోగాలతో సావాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన జబ్బేమో కానీ వైద్యం తర్వాత బిల్లు చూస్తే కొత్త రోగం రావడం ఖాయమని రోగులు అంటున్నారు. కొద్ది రోజులే కాంపౌండర్.. పెద్ద ఆస్పత్రుల్లో ఐదారు నెలల పాటు కాంపౌండర్‌గా పనిచేయడం, కొంత మేర వైద్య పరిజ్ఞానం సంపాదించి సొంత ఊరిలో ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తడం పరిపాటిగా మారింది. ఇంజక్షన్ వేయడం వస్తే చాలు వైద్యం నిర్వహించేందుకు ముందడుగు వేస్తున్నారు. కాంపౌండర్‌గా పనిచేసిన సమయంలో తెలిసిన కాస్తో, కూస్తో పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులున్నప్పటికి వారు ప్రైవేటుకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులను పట్టించుకోకపోవడంతో రోగులు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు గ్రామీణ వైద్యులు తెలిసీ తెలియని వైద్యాన్ని కొంతమేర నిర్వహించి, పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స నుంచి మొదలుకొని ఆస్పత్రి నుంచి బయటికి వచ్చే వరకు అంతా తామై నడిపిస్తున్నారు. -
వైద్యం వికటించి గర్భిణి మృతి
తిరువొత్తియూరు: అబార్షన్ చేసేందుకు ఇంజక్షన్ వేయడంతో గర్భిణి మృతి చెందిన సంఘటన పొల్లాచ్చి సమీపంలో జరిగింది. ఈ వ్యవహారంలో నకిలీ మహిళా డాక్టర్‌ను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. పొల్లాచ్చి, మెట్టువావికి చెందిన సెల్వరాజ్ భార్య వనితామణి (38). వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వనితామణి మళ్లీ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు గర్భస్రావం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. వడచిత్తూరుకు చెందిన సిద్ధా డాక్టర్ ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఏప్రిల్ 28న ముత్తులక్ష్మి, వనితామణికి ఇంజక్షన్ వేసింది. అది వికటించడంతో వనితామణి మృతి చెందింది. దీనిపై వనితామణి కుమారుడు మారిముత్తు (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తులక్ష్మి, ఆమె కుమారుడు కార్తీక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. విచారణలో వనితామణికి కాలం చెల్లిన మందును ఎక్కించడం వల్లే మృతి చెందినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం కోవై జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ భానుమతి నేతృత్వంలో కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ కృష్ణ, జిల్లా సిద్ధ వైద్య కార్యాలయ అధికారి ధనం తదితరులు ముత్తులక్ష్మి క్లినిక్‌తో పాటు ఆమె ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌లో కాలం చెల్లిన ఆయుర్వేద మందులు, ఆంగ్ల మందులు, మాత్రలు ఉండడం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని క్లినిక్‌కు తాళం వేశారు. అనంతరం మెట్టువావికి వెళ్లి వనితామణి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. మంగళవారం జరిపిన విచారణలో ముత్తులక్ష్మి సిద్ధవైద్యం చదవలేదని, సిద్ధవైద్యం పేరుతో అలోపతి వైద్యం చేస్తున్నట్టు తెలిసింది. వడచిత్తూరు ప్రాంతంలో ముత్తులక్ష్మి ఆరేళ్లుగా క్లినిక్ నడుపుతోంది. గత ఏడాది ఓ యువకుడు జ్వరానికి చికిత్స తీసుకుని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆ సమయంలో క్లినిక్‌ను పరిశీలించిన పోలీసులు చికిత్స చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. బంధువు ఇంట్లో.. నాగపట్టినంలోని బంధువు ఇంటిలో నకిలీ మహిళా డాక్టర్ ముత్తులక్ష్మి దాగి ఉన్నట్టు ఇన్స్పెక్టర్ వెట్రివేల్‌కు సమాచారం వచ్చింది. బుధవారం పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పొల్లాచ్చికి తీసుకొచ్చి విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ వైద్యానికి సహకరిస్తున్న ముత్తులక్ష్మి కుమారుడు కార్తీక్ కోసం గాలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్
-
వైద్యుడి పేరుతో అమ్మాయిలకు వల
సాక్షి, సిటీబ్యూరో: వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ రామయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్లా కూకట్‌పల్లిలోని సిఫా ఎలక్ట్రికల్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను డేటింగ్ వెబ్సైట్లో వైద్యుడిగా నకిలీ ఐడీ సృష్టించి యువతులు, వివాహితులతో చాటింగ్ చేసేవాడు. అనంతరం వారి ఫొటోలు, వీడియోలు తీసుకొని తన సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకునేవాడు. డాక్టర్ కార్తీక్ రెడ్డి పేరుతో నకిలీ ఐడీ సృష్టించిన అతను నగరంలోని ఓ ప్రధాన ఆస్పత్రిలో అనస్తటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుని ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చాటింగ్ చేసిన అతను బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీనిని గ్రహించిన అబ్దుల్లా నీ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నీ భర్తతో పాటు కుటుంబసభ్యుల ముందు పరువు తీస్తానంటూ బెదిరించాడు. రూ.4 లక్షలు ఇవ్వడంతో పాటు తన కోరిక తీర్చాలని కోరారడు. దీంతో బాధితురాలు గత నెల 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మంగళవారం పుప్పలగూడలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ వైద్యుడు. కీళ్లనొప్పులకు వైద్యం చేస్తాడిలా..
చదివింది బీఈ ఎలెక్ట్రికల్. వృత్తి బ్యాటరీలు మరమ్మతు చేయడం. ప్రవృత్తి కీళ్ల నొప్పులకు కరెంట్ షాక్ ఇచ్చి, తదనంతరం ఇంజెక్షన్లు వేసి వైద్యం చేయడం. ఇది జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంలో జరుగుతున్న తంతు. ప్రజల మంచితనం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు, అబార్షన్లు చేసేస్తున్నారు. జిల్లా అధికారులు గానీ, స్థానిక వైధ్యాధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అనంతపురం, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్న శర్మస్‌బాషా బీఈ ఎలెక్ట్రికల్ చదివాడు. తండ్రి హుసేన్‌పీరా రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి, ఆర్ఎంపీ. భార్య షాహిదా బేగం బీఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, బీపీటీ అని బోర్డు వేసుకుంది. శర్మస్‌బాషా బ్యాటరీల రిపేరీతో పాటు తండ్రి, భార్య బదులుగా తనే వైద్యమూ చేస్తున్నాడు. కీళ్ల నొప్పులు అని వెళ్లిన రోగులకు కరెంట్ షాక్‌తో వైద్యం చేస్తున్నాడు. ఇలాంటి నకిలీ వైద్యుల వల్ల రోగులకు జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకం. ఏదో అదృష్టం కొద్దీ ఒకరికో ఇద్దరికో నయం అయితే, అది కాస్తా ఆ నోటా ఈ నోటా పడి ప్రచారం జరుగుతుంది. నకిలీ వైద్యులు కూడా ఇలాంటి ప్రచారాలు కల్పించుకుని అమాయక పేదలను వంచిస్తున్నారు. ఇప్పటికే నకిలీ వైద్యుల బారిన పడి మృత్యువాత పడిన వారు ఉన్నారు. ఎంతో మంది అవయవాలు పనిచేయక అవిటివారుగా మిగిలిన సందర్భాలు కోకొల్లలు. వచ్చీ రాని వైద్యంతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న ఇలాంటి డబ్బుపిచ్చి రోగులకు జిల్లా వైద్యాధికారులే తగిన వైద్యం చేయాలని, అప్పుడే నకిలీల బండారం బట్టబయలవుతుందని ప్రజలు కోరుతున్నారు. కీళ్లనొప్పులకు వైద్యం చేస్తాడిలా.. సోమవారం సాయంత్రం శర్మస్‌బాషా కీళ్లనొప్పులతో వచ్చిన ఓ వృద్ధురాలికి తన క్లినిక్‌లో కరెంట్ షాక్ ఇచ్చిన తరువాత, క్లినిక్ ముందు భాగాన, రోడ్డులోనే కాలికి ఇంజెక్షన్ వేసి, తన అసిస్టెంట్‌తో మోకాలికి క్రీం పూసి వైద్యసేవలందించాడు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడడం, నా ఇంట్లో నేను ఏమైనా చేస్తాను ఎవరూ అడుగకూడదంటూ వాగ్వాదానికి దిగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, ఇతడు చేసే వైద్యంపై విచారణ చేపట్టాలని వేడుకుంటున్నారు. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు ఎవరైనా నకిలీ వైద్యులుగా చలామణి అవుతూ వైద్యం చేసినట్లు రుజువు అయితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. త్వరలోనే నకిలీ వైద్యులపై విచారణ చేపట్టి, అవసరమైతే దాడులు నిర్వహించి, క్లినిక్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ అనిల్‌కుమార్,డీఎంహెచ్ఓ, అనంతపురం -
నకిలీ డాక్టర్ అరెస్ట్
చెన్నై , అన్నానగర్: చెన్నైలో నకిలీ వైద్యురాలిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. చెన్నై తేనాం పేటలో తమిళనాడు వైద్య పనుల శాఖాధి కారి అశోక్‌కుమార్ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తమ శాఖలో 16 మంది డాక్టర్లు ఒప్పందం కింద విధుల్లో చేరారు. వారి సరిఫికెట్లను పరిశీలన చేశాం. వారిలో వేలూరుకు చెందిన రేచ్ఛల్ జెనిఫర్ (35) సమర్పించిన సర్టిఫికెట్లపై అనుమానం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లలో వెరొక మహిళా ఫొటో ఉన్నట్టు, సర్టిఫికెట్ నంబర్‌ను వైద్య కౌన్సిల్లో విచారణ చేయగా మరో మహిళ పేరు ఉన్నట్టు ఫిర్యాదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో రేచ్ఛల్ జెనిఫర్ విధుల్లో చేరినట్లు తెలిపారు. దీనిపై సహాయ కమిషనర్ గోవిందరాజ్ పర్యవేక్షణలో నేర విభాగ ఇన్స్పెక్టర్ విజయకుమార్ కేసు నమోదు చేసి విచారణ జరిపి రేచ్ఛల్ జెనిఫర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. -
వైద్యుడి అవతారమెత్తిన చాయ్‌వాలా!
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో లతీఫ్ అనే టీ హోటల్ యజమాని వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులకు సెలైన్లు ఎక్కించాడు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల రోజులుగా చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఓ వైద్యుడు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. ఆరుగురు స్టాఫ్‌నర్సులకు గాను ఒకరు బదిలీ కాగా, మరొకరు డిప్యూటేషన్‌పై మరో ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు వార్డుబాయ్‌లు ఉన్నారు. వీరంతా మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి జ్వరంతో వచ్చిన బాలుడికి ఆస్పత్రి ఎదుట ఉండే టీ స్టాల్ యజమాని లతీఫ్ సెలైన్ ఎక్కించాడు. ఇతడికి అంబులెన్స్ ఉండడం, రోగులకు పాలు, టీలు సరఫరా చేస్తుండడంతో ఆస్పత్రి సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుంటాడు. వైద్య సిబ్బందితో ఉన్న చొరవ కారణంగా సెలైన్లు ఎక్కిస్తుంటాడని తెలిసింది. కాగా, ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను సంప్రదించగా.. సిబ్బంది కొరత వాస్తవమేనని, లతీఫ్ సెలైన్ ఎక్కించలేదని, సెలైన్ బాటిళ్లు ఇవ్వడానికి బెడ్ వద్దకు వెళ్లాడని తెలిపారు. -
కర్నూలులో ‘శంకర్‌దాదా’
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నకిలీ వైద్యుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో తరహాలో అర్హత లేకున్నా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పట్టుకున్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న వై.వేణుగోపాల్‌శెట్టి ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతను చదివింది పదో తరగతి మాత్రమే. కానీ స్థానిక బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్, మెడికల్ షాపుతో పాటు ప్రకాష్‌నగర్‌లోని తన ఇంట్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు ఇతని వద్దకు గర్భిణులను తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఈవో బాబురావు తన సిబ్బందితో వేణుగోపాల్‌శెట్టి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఆయన మారువేషంలో వెళ్లి.. స్కానింగ్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వెంట డీసీటీవో వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ జయన్న, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు ఉన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ సమక్షంలో స్కానింగ్ మిషన్ సీజ్ చేశారు. వేణుగోపాల్‌శెట్టి వద్ద పాత స్కానింగ్ మిషన్‌తో పాటు గ్లౌజులు, అబార్షన్‌కు అవసరమైన ఆపరేషన్ థియేటర్ పరికరాలు లభించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ వైద్యుడి అరెస్ట్
తొర్రూరు: ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆస్పత్రి ఎండీగా అవతారమెత్తాడు. ఈ నకిలీ వైద్యుడు చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలను డీఎస్పీ రాజారత్నం వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సరికొండ వెంకట కృష్ణంరాజు అలియాస్ రాంబాబు తండ్రి భూపతిరాజు ఆర్ఎంపీగా పనిచేసేవాడు. వెంకట కృష్ణంరాజు తండ్రి వద్ద ఆర్ఎంపీగా శిక్షణ పొందాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి గుంటూరు జిల్లా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. రాంబాబు దొర అనే వైద్యుడి సర్టిఫికెట్ల కలర్ జిరాక్స్‌లపై ఫొటో మార్ఫింగ్ చేసి తొర్రూరు చింతలపల్లి రోడ్డులో అమృత ఆస్పత్రి నెలకొల్పాడు. నాలుగేళ్లుగా ఎండీ గోల్డ్ మెడలిస్ట్ బోర్డు పెట్టుకుని అర్హత లేకు న్నా అన్ని రకాల వైద్యసేవలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్యుల నియామక కౌన్సెలింగ్‌కు అసలైన అర్హతలు గల డాక్టర్ రాంబాబుదొర, తొర్రూరుకు చెందిన ఓ వైద్యుడు హాజరు కాగా నకిలీ వైద్యుడి బాగోతం బయటపడింది. మీడియాలో కథనాలు రావడంతో నకిలీ వైద్యుడు పరారయ్యాడు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, పోలీసులకు లొంగిపోయాడు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్
-
అవివాహితకు వికటించిన అబార్షన్
సేలం: గర్భం దాల్చిన అవివాహిత విషయం ఇంట్లో తెలియకుండా నకిలీ వైద్యురాలితో అబార్షన్ చేయించుకోవడం ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన సేలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపం బొమ్మియంపట్టి గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె జీవా (19). కళాశాల విద్యార్థిని అయిన ఈమె అవివాహిత. ఇలాఉండగా జీవా ప్రియుడితో చనువుగా మెలగడంతో గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబీకులకు తెలియకుండా పది రోజుల కిందట నడుపట్టిలో నకిలీ డాక్టర్ సుల్తానా వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అయితే, గత నెల 28న జీవాకు తీవ్రమైన కడుపునొప్పి ఏర్పడింది. దీంతో ఆమెను సేలం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పరిస్థితి విషమించడంతో జీవాను 29వ తేదీ సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 31వ తేదీ జీవా మృతి చెందింది. జీవాకు నకిలీ వైద్యురాలు అందించిన చికిత్స వికటించి మృతి చెందినట్టు సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతికి సమాచారం అందింది. దీంతో ఆదివారం వలర్మతి నడుపట్టిలో ఉన్న డాక్టర్ సుల్తానా ఇంటికి వెళ్లి అకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో సుల్తానా నకిలీ వైద్యురాలుగా తేలడంతో ఆమెను అరెస్టు చేయాలని తీవట్టిపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోమవారం సుల్తానాను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించండి: సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతి మీడియాతో మాట్లాడుతూ నకిలీ డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. -
డాక్టర్ అవతారం ఎత్తిన ఏసీ టెక్నిషియన్
కోల్‌కతా: ఏసీ టెక్నిషియన్ డాక్టర్‌గా అవతారం ఎత్తడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న అర్జిత్(16) అనే బాలుడు ఆనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్నిపరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఏమిటో తేల్చలేకపోయారు. దీంతో అతడిని బుర్ద్వాన్‌లోని అన్నపూర్ణ నర్సింగ్ హోంలోకి తరలించారు. నర్సింగ్ హోంకి చేరిన తరువాత ఆక్సిజన్ పెట్టిన కొద్దిసేపటికే అర్జిత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పిరావడంతో అనుమానం వచ్చిన బంధువులు.. బాలుడిని అంబులెన్స్‌లో 105 కి.మీ దూరంలో ఉన్న కోల్‌కత్తాలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కార్డీయాక్ సైన్సెస్ లో చేర్పించారు. అక్కడ చేరిన కొంత సమయానికే బాలుడు మృతి చెందాడు. అయితే, అంబులెన్స్ డ్రైవర్‌గా ఉన్న టేరాబాబు షా, సిలిండర్ ఫిట్ చేసిన సర్పరాజుద్దీన్ అంతకుముందు అన్నపూర్ణ నర్సింగ్ హోంలో వైద్య సహాయకులుగా కనిపించారు. ఆ తర్వాత సర్పరాజుద్దీన్ ఆక్సిజన్ సిలిండర్ ఫిట్‌చేసే మెకానిక్‌గా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో సర్పరాజుద్దీన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తాను వైద్యుడిని కాదని ఏసీ టెక్నిషియన్ అని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని, అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
డాక్టర్‌గా చలామణి...అరెస్ట్!
-
నకిలీ వైద్యుడి నిర్వాకం.. 46 మందికి హెచ్ఐవీ
ఉన్నావో (యూపీ): ఓ నకిలీ వైద్యుడి చేసిన పనికి 10 నెలల్లో దాదాపు 46 మంది హెచ్ఐవీ బాధితులుగా మారారు. కలుషిత సిరంజీతో రోగులకు ఇంజెక్షన్ చేయడంతో ఈ దారుణం జరిగింది. యూపీలోని ఉన్నావో జిల్లా బంగర్మౌలో గతేడాది ఏప్రిల్–జూలైలో అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. అలాగే గత నవంబర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా మరో 13 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఇంతకింతకు పెరుగుతున్న హెచ్ఐవీ కేసులను సీరియస్‌గా పరిగణించిన వైద్యాధికారులు ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. కమిటీ సభ్యులు ప్రేమ్‌గంజ్, చక్మిర్ పూర్ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి 24, 25, 27 తేదీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి 566 మందిని పరీక్షించారు. ఇందులో మరో 21 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. మొత్తం 46 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు వెల్లడైంది. రాజేంద్ర కుమార్ అనే నకిలీ వైద్యుడు దీనికి కారణమని అధికారులు గుర్తించారు. చౌకవైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చిన రోగులకు ఒకే కలుషిత సిరంజీతో ఇంజక్షన్ చేయడం ద్వారానే హెచ్ఐవీ సోకిందని వెల్లడించారు. -
బిస్వాస్ దాదా... బీఏఎంఎస్!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గోపాష్ భద్ర చదివించి టెన్త్... వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి చెన్నైలో ఆయుర్వేద డాక్టర్ వద్ద పని చేశాడు... ఈ ‘అనుభవం’తో హైదరాబాద్‌కు వచ్చి ‘డాక్టర్ బిస్వాస్’గా మారాడు... తన పేరు చివర బీఏఎంఎస్ అనే డిగ్రీ తగిలించుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు... ఈ నకిలీ ఆయుర్వేద డాక్టర్‌ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులు ప్రశ్నించగా... బీఏఎంఎస్ ఫుల్‌ఫామ్ చెప్పలేకపోవడంతో పాటు కనీసం అతడు ప్రింట్ చేయించిన కరపత్రాన్నీ చదవలేకపోయాడని డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపాష్ భద్ర తన స్వస్థలంలో పదో తరగతి చదివాడు. తొలినాళ్ళల్లో కోల్‌కతాలో వివిధ రకాలైన పనులు చేసుకుని జీవనం సాగించాడు. 2011లో చెన్నైకు వెళ్ళిన అతను అక్కడ బీఏఎంఎస్ పూర్తి చేసిన ఆయుర్వేద డాక్టర్ వద్ద సహాయకుడిగా పని చేశాడు. అక్కడ తన డాక్టర్ పైల్స్, ఫిషర్ తదితర వ్యాధులకు ఎలా చికిత్స చేస్తున్నారో పరిశీలించాడు. ఈ అనుభవంతో తానే ఓ బీఏఎంఎస్ డాక్టర్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రాక్టీస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుని ఇక్కడకు వచ్చాడు. తన పేరును డాక్టర్ బిస్వాస్గా పేర్కొంటూ బీఏఎంఎస్ డిగ్రీ చేసినట్లు నమ్మిస్తూ గాంధీనగర్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ‘జోతి క్లినిక్’ ఏర్పాటు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై తమ వద్ద డాక్టర్ అనిత అనే హెచ్ఏఎంస్ పూర్తి చేసిన డాక్టర్ సైతం ఉన్నట్లు చూపించాడు. చెన్నైలో నేర్చుకున్న పైల్స్, ఫిషర్ తదితర వ్యాధులకు ‘వైద్యం’తో పాటు చర్మ వ్యాధుల్నీ తగ్గిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీనికోసం కరపత్రాలు ముద్రించి జనసమర్థ ప్రాంతాల్లో పంచిపెట్టేవాడు. వీటికి ఆకర్షితులై వచ్చిన అమాయక రోగులకు వైద్యం చేయడం మొదలెట్టాడు. నెయ్యి, హెయిర్ జెల్స్, టాల్కం పౌడర్, వేప ఆకులు, కొబ్బరినూనె వినియోగించి తానే కొన్ని ఆయుర్వేద ఔషధాలను తయారు చేశాడు. వీటినే రోగులకు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్‌కుమార్, జి.తిమ్మప్ప గురువారం జోతి క్లినిక్‌పై దాడి చేశారు. నకిలీ డాక్టర్ బిస్వాస్‌ను అరెస్టు చేయడంతో పాటు అనేక నకిలీ ఆయుర్వేద మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బీఏఎంఎస్ డిగ్రీకి ఫుల్‌ఫామ్ ఏమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నీళ్ళు నమిలాడు. అతడు ముద్రించిన కరపత్రాలను చూపించి చదవమంటే తడబడ్డాడు. ఇలాంటి వ్యక్తి ఆరు నెలలుగా అనేక మందికి వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. నకిలీ డాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. -
ఫేక్ డాక్టర్.. ఫేట్ మారిందిలా..!
సాక్షి, హైదరాబాద్: దొంగ బాబాల మాదిరే నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. వీరి ప్రభావం అమాయక ప్రజల మీద చాలా ఎక్కువ. నగరంలో జరిగిన ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అజయ్‌కుమార్ రాయ్(25) చదివింది ఎనిమిదో తరగతి.. కానీ అన్ని వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడయ్యాడు. 2006 సూర్యపేటలో తన బంధువైన ఆర్ఎంపీ డాక్టర్ వద్ద పని చేశాడు. ఆ అనుభవంతో నగరానికి వచ్చి ఓ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అతని టార్గెట్ అమాయక ప్రజలు. వారిని ఆసరాగా చేసుకుని వైద్యం అందించాలనే నిర్ణయానికి వచ్చాడు ఈ ఫేక్ డాక్టర్. తనకు అదృష్టం కలిసిరాలని ఈ పేరు పెట్టాడేమో అన్నట్లు ఉంది క్లినిక్ పేరు. శ్రీరామ్ నగర్లో లక్కీ క్లినిక్ పేరుతో వృత్తిని ప్రారంభించాడు. సినిమాలకు ట్యాగ్ లైన్స్ ఉన్నట్లు.. క్లినిక్‌కు కూడా ఓ ట్యాగ్ లైన్ పెట్టాడు.‘ ఇక్కడ అన్ని వ్యాధులకు చికిత్స చేయబడను’ అని పెట్టాడు. క్లినిక్‌కు వచ్చిన రోగులకు చేతికోచిన మందులు, సూదులు ఇచ్చి పంపించేవాడు. ప్రస్తుతం అజయ్ యూసఫ్‌గూడలో నివసించేవాడు. ఇతని స్వస్థలం కోల్కత్తా అని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారి తెలిపారు. అంతేకాక తన వద్ద పైల్స్కి ప్రత్యేక నివారణ ఉందని నమ్మించాడు. ఆ సమస్యతో బాధపడే వారి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు వసూలు చేశాడు. పాపం ఈ నకిలీ డాక్టర్ దందా ఎన్ని రోజులు నడువలేదు. ప్రజలు దేవుడితో పోల్చే డాక్టర్ వృతిలో సైతం ఇలాంటి నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ క్లినిక్‌లో సోదాలు చేపట్టారు. అప్పుడ బయటపడింది మన డాక్టర్ బాగోతం. అతనికి కనీస విద్యా అర్హత లేకుండా అజయ్‌కుమార్ వైద్యం చేశాడన్ని పోలీసులు గుర్తించారు. ఫేక్ డాక్టర్ నుంచి పోలీసులు వైద్యపరికరాలు, మందులు మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్‌ను అరెస్ట్ చేసి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
నకిలీ వైద్యుడిపై చీటింగ్ కేసు
నెల్లూరు(క్రైమ్) : ఆక్యుపంచర్ పేరుతో నకిలీ వైద్యం చేస్తున్న ఏంగల్స్‌రాజా, అతని సిబ్బందిపై ఐదో నగర పోలీసులు గురువారం రాత్రి చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. సుభాష్చంద్రబోస్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ దశయ్య ఐదేళ్లుగా టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. పలువురు వైద్యుల వద్ద చికిత్స చేయించుకోగా, మందులు వాడినంతసేపు ఆరోగ్యం సక్రమంగా ఉండేది. అనంతరం మళ్లీ అనారోగ్యానికి గురయ్యేవారు. ఈ నేపథ్యంలో అయ్యప్పగుడి ఫ్లయ్ ఓవర్ వద్ద ఏంగల్స్‌రాజా అన్ని రకాల వ్యాధులకు ఆక్యుపంచర్ వైద్యం చేస్తున్నారని కొందరు చెప్పడంతో ఈ ఏడాది జూన్‌లో అక్కడికి వెళ్లారు. ఏంగల్స్రాజాను కలిసి తన పరిస్థితిని వివరించగా, ఆయన దశయ్య వేలిపట్టుకొని నీ జబ్బు నయమైందని ఇక ఏ మాత్రలు మింగొద్దని సూచించారు. 12 వారాలు హాస్పిటల్‌కు వస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పడంతో బాధితుడు హాస్పిటల్ చుట్టూ తిరగసాగారు. ఇటీవల దశయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో తిరిగి ఆక్యుపంచర్ హోమ్‌కు వెళ్లి వైద్యుడ్ని కలిసి తన ఆరోగ్యం గురించి ప్రశ్నించగా ఏంగల్స్‌రాజా అతడ్ని దుర్భాషలాడారు. సిబ్బంది పాండురంగనాయుడు, శేషాద్రి, జయకుమార్ కార్తికేయన్, మరికొందరు దశయ్యపై దౌర్జన్యం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏంగల్స్‌రాజా డాక్టర్ చదివినట్లు ఫోర్జరీ సర్టిఫికెట్లను చూపించి ఆక్యుపంచర్ పేరుతో మోసగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏంగల్స్‌రాజా అతని అనుచరులపై ఐదో నగర ఇన్స్పెక్టర్ మంగారావు చీటింగ్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్పీ రామకృష్ణ ఆరాతీశారు. జేవీవీ నేతలతో వాగ్వాదం నెల్లూరు(బారకాసు): తన వైద్యంతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో జేవీవీ నాయకులు ఓ వైద్యుడిపై విరుచుకుపడ్డారు. నగరంలోని అయ్యప్పగుడి సమీపంలో గల ఫ్లయ్ ఓవర్ పక్కన ఉన్న ఆక్యుపంచర్ కేంద్రాన్ని గురువారం ప్రజారోగ్య వేదిక, జేవీవీ నాయకులు పరిశీలించారు. అక్కడ వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఏంగల్స్‌రాజా నకిలీ వైద్యం చేస్తున్నారంటూ జేవీవీ నేతలు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. దీంతో వైద్యుడికి సంబంధించిన వ్యక్తులతో పాటు అక్కడికి చికిత్స కోసం వచ్చిన వారు జేవీవీ నేతలతో వాగ్వాదానికి దిగారు. తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఏంగల్స్రాజాను అదుపులోకి తీసుకొని ఐదో నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో వైపు వైద్యుడి తీరు, చికిత్స చేస్తున్న విధానంపై జేవీవీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రమణయ్య మాట్లాడారు. కొంత మంది రోగులు సంబం ధిత వైద్యుడి వద్ద చూపించుకొని ఆయన సూచన మేరకు మందులు వాడుతూ మధ్యలో ఆపేసి ఏంగల్స్‌రాజా వద్దకు వచ్చి నాడి వైద్యం చేయాలంటూ కొంత మొత్తాన్ని చెల్లించేవారన్నారు. తీరా ఆ రోగికి జబ్బు నయం కాకపోగా ఇంకా ఎక్కువైందని ఆరోపించారు. ఇలా అనేక మంది రోగులకు నకిలీ వైద్యం అందించి సొమ్ము చేసుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా, ఏంగల్స్‌రాజా గుట్టును బయటపెట్టేందుకు తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. తమకు అనుమానం వచ్చి పరిశీలించగా ఏంగల్స్‌రాజా చేస్తోంది నకిలీ వైద్యమని తేలిందని చెప్పారు. నకిలీ వైద్యం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్య వేదిక జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీని వాసరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు బుజ్జయ్య, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్ట్
-
వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా బ్రహ్మయ్య అనే వ్యక్తి సిద్దార్ధ పాలీ క్లినిక్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేయకుండానే కొంతమందికి స్వతహాగా చికిత్స చేస్తున్నాడు. శుక్రవారం ఓ మహిళకి చికిత్స చేస్తుండగా బ్రహ్మయ్య అడ్డంగా దొరికిపోయాడు. క్లినిక్ మరో వ్యక్తిపై రిజిస్టరై ఉంది. ఎటువంటి అనుభవం లేకుండా క్లినిక్ నడిపిస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో నకిలీ భారతీయ వైద్యుడు
మెల్బోర్న్: వైద్యుడిగా నమ్మించి 11 ఏళ్లపాటు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య విభాగంలో పనిచేసిన ఓ భారతీయ వ్యక్తిని ఆ దేశ అధికారులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. భారత్‌కే వచ్చి ఉండొచ్చని ఆస్ట్రేలియా అధికారులు అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగ్ చితాలే అనే నిజమైన భారతీయ వైద్యుడి గుర్తింపును నిందితుడు శ్యామ్ ఆచార్య దొంగిలించాడు. సారంగ్ పేరునే ఉపయోగించి భారత పాస్‌పోర్టు, నకిలీ ఎంబీబీఎస్ డిగ్రీ కూడా సంపాదించాడు. 2003లో నైపుణ్యం గల ఉద్యోగుల వలసల కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా నిర్వహించినపుడు న్యూ సౌత్‌వేల్స్ ఆరోగ్య విభాగంలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు. అనంతరం ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా తీసుకున్నాడు. 2003 నుంచి 2014 వరకు 14 ఏళ్లపాటు వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు. తర్వాత 2016లో నోవాటెక్ అనే ఔషధ పరిశోధన సంస్థకు ఉద్యోగం మారాడు. ఆ సంస్థ యాజమాన్యానికి శ్యామ్ గుర్తింపు పత్రాలపై అనుమానం రావడంతో విషయం బయటపడింది. -
చదివింది ఎలక్ట్రోపతి.. చేసేది అల్లోపతి!
నకిలీ వైద్యుడి లీలలు ఊరుకో పేరు.. ఒక్కొక్క చోట ఒక్కో డిగ్రీ ఆరోగ్య మంత్రితో పరిచయం అందుకే పట్టించుకోని వైద్యాధికారులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : డాక్టర్ వేమూరి రాధాకృష్ణ చౌదరి.. డాక్టర్ కృష్ణ చౌదరి.. డాక్టర్ చౌదరి.. ఆయన అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గానీ.. ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆసుపత్రి తెరుస్తుంటారు. ప్రతిచోట అతని పేరు పక్కన ఉండే డిగ్రీ, రిజిస్టర్ నంబర్ మారుతుంటాయి. తన నకిలీ బాగోతం బయటపడగానే మరో పేరుతో మరో చోట ఆసుపత్రి తెరుచుకుంటుంది. జిల్లాలో ఒక నకిలీ వైద్యుడు సాగిస్తున్న భాగోతమిది. ప్రతిచోల ఆసుపత్రి ప్రారంభానికి ప్రముఖులను పిలుస్తుండటంతో అధికారులు కూడా అతని జోలికి వెళ్లడం లేదు. తాజాగా పాలకొల్లులో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పిలవడంతో ఆయన పలుకుబడి అర్థమై వైద్యశాఖ అధికారులు ఆతని జోలికి వెళ్లడం లేదు. అతను పూర్తిగా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదులు అందినా ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు. నకి’లీలలు’ ఇలా.. ఆయన తాళ్లపూడి, ఆచంట, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆసుపత్రులు నిర్వహించినపుడు ఎండీ జనరల్ మెడిసిన్‌గా ప్రచారం చేసుకున్నారు. ఇతడు ఎలక్ట్రోపతి (విద్యుత్ ఆధారిత వైద్యం) చదివినట్టు వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాళ్లపూడిలో తాను ఏర్పాటు చేసిన ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్, మందుల షాపు ఇప్పిస్తానని కొందరి నుంచి సొమ్ములు తీసుకుని మోసం చేయడంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేశారు. తాజాగా పాలకొల్లులో ఎండీ ఆల్టర్నేటివ్ మెడిసిన్‌గా చెప్పుకుంటూ ఆసుపత్రి తెరిచారు. అయితే ఆయన చేస్తున్నదంతా అల్లోపతి (ఇంగ్లిష్) వైద్యం కావడం గమనార్హం. ప్రతిచోట ఆసుపత్రి పెట్టినప్పుడు తనతోపాటు ఒక ఎంబీబీఎస్ చదివిన వైద్యుడి పేరును చేర్చుకుని ఈ దందా నడుపుతున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే ఎంబీబీఎస్ డాక్టర్‌ను చూపిస్తున్నట్టు సమాచారం. అతని సర్టిఫికెట్లు అన్నీ బోగస్ అనే ప్రచారం ఉంది. ఒక్కోచోట ఒక్కో రిజిస్టర్ నంబర్‌తో చలామణి అవుతున్నారు. ఒకచోట డాక్టర్ చౌదరి పేరుతో.. మరోచోట రాధాకృష్ణచౌదరి, ఇంకోచోట కృష్ణ చౌదరి పేరుతో ఆసుపత్రులు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. పాలకొల్లులో డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి పేరితో సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించారు. గతంలో ఆచంటలో ఆసుపత్రి నడుపుతుండగా ఆయనపై ఆరోపణలు రావడంతో జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేసి ఆసుపత్రిని మూసివేశారుఽ.గత ఏడాది మార్చి 4వ తేదీన పాలకొల్లులో కరూర్ వైశ్యాబ్యాంక్ పక్కన ఒక కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ఏర్పాటు చేసి సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ప్రారంభింప చేశారు. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. జిల్లా వైద్యాధికారులు ఆచంటలోని ఆసుపత్రిని మూయించి వేసిన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. పాలకొల్లులో సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిని నెలకొల్పారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి ఎండీ, ఈహెచ్, జనరల్ మెడిసిన్ (ఏఎంసీ) రిజిస్టర్ నంబర్ 462గా బోర్డుపై ఆయన ముద్రించారు. ఆసుపత్రి నెలకొల్పే ముందు పాలకొల్లులో ఓ రిటైర్డు ఉద్యోగితో మంతనాలు జరిపి ఆయనతో సుమారు రూ.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టించినట్టు భోగట్టా. ఈ ఆసుపత్రి ప్రారంభం అయిన నాటినుంచి ఆసుపత్రిలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి వైద్యం కోసం వచ్చిన మహిళలతో పాటు ఆసుపత్రిలో పనిచేసిన నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగగా, వారికి సర్ధిచెప్పి పంపినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరిని నమ్మి పెట్టుబడి పెట్టిన రిటైర్డు ఉద్యోగి తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలో డాక్టర్ వేమూరి తప్ప ఇతర వైద్యులు, ఆధునిక పరికరాలు లేవు. ఆసుపత్రి ఏర్పాటు చేసిన భవనానికి అద్దె నిమిత్తం నెలకు రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ఖాళీ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. డాక్టర్ వేమూరి వైద్య పట్టా నకిలీదని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇదేవిధంగా ఆసుపత్రులు తెరచి చాలామందిని మోసగించినట్టు పలువురు వైద్యులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి మాత్రం తాము తనిఖీలు నిర్వహించినపుడు ఆయుర్వేదం సర్టిఫికెట్ చూపించారని, అతని ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండటంతో చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసలు గుట్టువిప్పుతారా లేక మిన్నకుండిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. -
బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం
హైదరాబాద్ : వెబ్సైట్ వేదికగా బాగ్దాలో ప్రముఖ డాక్టర్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ లెక్చరర్‌కు ఎర వేశాడు. 'ఖరీదైన పార్శిల్' పేరు చెప్పి రూ.34.5 లక్షలు దండుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని బేగంపేటలో ఉన్న ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె ఈ ఏడాది ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఈ ప్రొఫైల్‌ను లైక్ చేసిన ఓ వ్యక్తి..ఆమెతో సంప్రదింపులు ప్రారంభించాడు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా తాను బాగ్దాద్‌లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం వివాహానికి సమ్మతమంటూ సందేశం ఇచ్చాడు. పెళ్ళి కోసం అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. పూర్తిగా ఆ మాయగాడి మాటల వల్లో పడిన ఆ యువతి అవన్నీ నిజమని నమ్మారు. తాను బాగ్దాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి నిర్మాణం చేపడతానని, అందుకు అవసరమైన నిధులు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాను రావడానికి ముందే తన వద్ద ఉన్న డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గో పార్శిల్ రూపంలో పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది మర్చిలో ఓ పార్శిల్‌ను పంపించానంటూ సందేశం ఇచ్చాడు. ఇది జరిగిన రెండుమూడు రోజులకు ముంబై నుంచి కస్టమ్స్ అధికారి చేస్తున్నట్లు బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందంటూ చెప్పిన సదరు అధికారి.. దాన్ని క్లియర్ చేయడానికి పన్ను రూపంలో కొంత చెల్లించాలంటూ చెప్పారు. ఆ యువతి ఆ మాటలు నమ్మడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి అందులో నగదు డిపాజిట్ చేయించారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు వివిధ ఫోన్ నంబర్ల నుంచి అనేక విభాగాల పేర్లతో ఫోన్లు రావడం, బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తమ్మీద పది బ్యాంకు ఖాతాల్లో రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసిన లెక్చరర్ చివరకు తాను మోసపోయానని గ్రహించింది. దీంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన పది బ్యాంకు ఖాతాలు గుజరాత్, ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలు, నకిలీ చిరునామాలతోనో, దళారుల్ని ఏర్పాటు చేసుకునే తెరుస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్స్‌ను చూసిన వెంటనే నమ్మవద్దనీ, ఎవరినీ నేరుగా కలవకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా వ్యక్తిగత వివరాలు చెప్పడం, నగదు డిపాజిట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు వద్దని హెచ్చరిస్తున్నారు. -
సెక్స్ సమస్యలు పరిష్కరిస్తానంటూ..
తిరుపతి : సెక్స్ సమస్యలకు పరిష్కారం చూపెడతానని, ఎంతటి దీర్ఘకాలిక వ్యాధి అయినా చిటికెలో తగ్గిస్తానని నమ్మిస్తూ అమాయకుల నుంచి లక్షలు దండుకుంటున్నాడు ఓ నకిలీ డాక్టర్. పేదవారు, అమాయక మహిళలే లక్ష్యంగా, వారి బలహీనతను పెట్టుబడిగా ఎంచుకున్న ఆ మాయగాణ్ణి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 10వ తరగతి ఫెయిలై, తిరుపతిలో డాక్టర్‌గా చలామణి అవుతున్న వాడికి నగరంలోని పలువురి స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్ల నుంచి మద్దతు, ప్రోత్సాహం ఉండడం గమనార్హం. రోగులకు నకిలీ వైద్యం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న వైనాన్ని నవసమాజ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకులు నగేష్, ఓ టీవీ చానల్ రిపోర్టర్ పసిగట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. కోల్‌కతాలోని నిథియాకు చెందిన బి.బినయ్(26) 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఏడాది క్రితం తిరుపతికి వచ్చాడు. అప్పటికే తిరుపతిలో నకిలీ డాక్టర్‌గా చెలామణి అవుతున్న సురేష్‌తో అతనికి పరిచయమైంది. ఒకటిన్నర నెలలో తెలుగు భాషను నేర్చుకున్నాడు. తుడా మార్గం, శ్రీ సాయి దంత వైద్యశాల ఆస్పత్రికి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. మేఘన క్లినిక్ పేరుతో డాక్టర్ బి.బినయ్గా అవతారమెత్తాడు. నకిలీ డాక్టర్ లీలలు ఎన్నెన్నో... తాను చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ తలపండిన డాక్టర్లా అందరికీ వైద్యం చేసేస్తున్నాడు. దాంపత్య సమస్యలు, మొలలు, లూటీలు, వరిబీజము, గనేరియా, సిప్లిస్ వంటి సమస్యాత్మకమైన వ్యాధులకు తెలిసీ తెలియని వైద్యం చేస్తున్నాడు. పైగా మహిళలకు ఆపరేషన్ లేకుండా మొలలకు ప్రత్యేక చికిత్స చేస్తానంటూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఏ జబ్బు వచ్చినా నగరంలో పేరున్న స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు పరీక్షలకు పంపుతున్నాడు. ఫలితంగా ఈయనగారికి వేల రూపాయాలు కమీషన్లు ముట్టచెబుతున్నారు. రోగులకు సాధారణ జ్వరమైనా, దీర్ఘకాలిక వ్యాధి అయినా ఒకటి ఎర్ర, పసుపు మాత్రలు మాత్రమే ఇస్తాడు. అదేమని అడిగితే కోల్‌కతా నుంచి ప్రత్యేకంగా తెప్పించామని నమ్మిస్తాడు. ఎవరైనా దాంపత్య సమస్యలతో వచ్చిన మహిళలకు ‘డే, నైట్ హెర్బల్ మసాజ్ ఆయిల్’ ఇవ్వడంతోపాటు అది ఎలా వాడుకోవాలో స్వయంగా చేసి చూపిస్తూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నవ సమాజ వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, కన్వీనర్ విజయ్‌భాస్కర్ మీడియా సహకారంతో నకిలీ డాక్టర్ విషయాన్ని గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం నకిలీ డాక్టర్‌ను ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా బినయ్‌ను నకిలీ డాక్టర్‌గా మార్చిన మరో నకిలీ డాక్టర్ సురేష్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. పైగా సురేష్‌పై 2013లో అలిపిరి పోలీస్టేషన్లో కేసు నమోదైనట్టు సమాచారం. -
నకిలీ డాక్టర్.. దొంగ బంగారం
తణుకు : సరిగ్గా పది నెలల క్రితం పట్టణంలో సుమ క్లినిక్ పేరుతో ఆసుపత్రి నిర్వహించిన వాసపల్లి నల్లయ్య అలియాస్ నరేంద్రకుమార్ భాగోతం బయట పడిన సంగతి తెలిసిందే. కేవలం తొమ్మిదో తరగతి చదివిన ఒక వ్యక్తి డాక్టర్ బొల్లినేని శ్రీకాంత్‌గా అవతారం ఎత్తి 10 ఏళ్లపాటు ప్రజలను, వైద్యులను, జిల్లా అధికారులను మోసం చేసిన ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది. దీంతో ఇదే కోవలో జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న మరికొందరు నకిలీ డాక్టర్ల భాగోతం బట్టబయలైంది. అయితే ఇప్పుడు మరోసారి నకిలీ డాక్టర్ శ్రీకాంత్ వ్యవహారంలో మరోకోణం బయట పడింది. నకిలీ డాక్టర్‌గా ప్రజలను మోసం చేసిన కేసులో జైలు జీవితం గడిపిన శ్రీకాంత్ ఆ సమయంలో తోటి ఖైదీలతో సంబంధాలు ఏర్పరచుకుని వారితో సాన్నిహిత్యం పెంచుకున్న కోణం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. భిన్నకోణాలు... శ్రీకాంత్ వ్యవహారంలో భిన్న కోణాలు బయట పడుతున్నాయి. తాజాగా పైడిపర్రు గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తాను దొంగతనం చేసిన బంగారాన్ని శ్రీకాంత్ వద్ద ఉంచినట్టు విచారణలో తేలడంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో పలు చోరీల్లో నిందితుడిగా ఉన్న పైడిపర్రు పాత నేరస్తుడు ఇటీవలి కాలంలో రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసి పెద్ద ఎత్తున బంగారాన్ని దోచుకెళ్లాడు. గతంలో పలు పర్యాయాలు జైలు శిక్ష అనుభవించిన ఈ నిందితుడు గతేడాది మే నెలలో రాజమండ్రి కారాగారంలో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ నేరస్తులతో చేయి కలిపినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరూ చేయి కలిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీ చేసిన సుమారు 20 కాసుల బంగారాన్ని శ్రీకాంత్‌కు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్ శ్రీకాంత్‌ను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులు నోరు మెదపడంలేదు. పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం వాస్తవాలు వెల్లడిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు. -
ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు
మంచిర్యాల(ఆదిలాబాద్): ఓ నకిలీ వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాగమణి చందూ పేరుతో వైద్యం చేస్తున్న భూక్య నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ఎఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. -
చేసింది నర్సు.. చేసేది వైద్యం...
చెన్నూర్ : వైద్యో నారాయణ హరి.. అన్నది నానుడి. ఇలా దేవతల స్థానమిచ్చే వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన మహిళ ఉదంతమిది. కొంతకాలం నర్సు వృత్తిలో కొనసాగిన ఆమె ఏకంగా ఎంబీబీఎస్, ఎంఎస్ నకిలీ సర్టిఫికెట్, తప్పుడు రిజి ష్టర్ నంబర్‌తో వైద్యురాలి అవతారమెత్తింది. అరుుతే, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి చెందిన ఆమె తమ ప్రాంతంలో ఇదంతా చేస్తే బయటపడుతుందని భావించిందో ఏమో కానీ ఆదిలాబాద్ జిల్లాలో ‘సేవలు’ అందిస్తోంది. ఈక్రమంలో ఆమె రాస్తున్న మందుల స్థారుుపై అనుమానమొచ్చిన ఆస్పత్రి యూజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం నకిలీ ఉదంతం వెలుగుచూసింది. కన్సల్టెన్సీ ద్వారా నియూమకం చెన్నూరులోని అస్నాద రోడ్డులో 15 మే 2015న కొత్తగా నర్సింగ్ హోంను పారంభించారు. ఈ ఆస్పత్రికి స్త్రీల ప్రత్యేక నిపుణురాలు కావాల్సి ఉండగా హైదరాబాద్‌లోని ఆర్కట్ మెడికల్ కన్సల్టెన్సీని సంప్రదించారు. దీంతో వారు గుంటూరుకు చెందిన డాక్టర్ నాగమణి చెన్ను(ఎంఎస్) పేరు సూచించగా, ఆమె రూ.1.75లక్షల వార్షిక వేతనంతో విధుల్లో చేరింది. అరుుతే, ఆస్పత్రిలో చేరిన నాగమణి రోగులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడాన్ని యూజమాన్యం గుర్తించింది. అలాగే, ఆమె రాస్తున్న మందులపై కూడా అనుమానమొచ్చింది. దీంతో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫిజీషియన్.. నాగమణి రాస్తున్న మందుల చీటీలను కొన్ని రోజుల పాటు పరిశీలించి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వర్గాలు విచారణ జరపగా ఆమె సర్టిఫికెట్(రిజిస్ట్రేషన్ నంబర్ 65699)పై కూడా అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వైద్యురాలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నాగమణి చెన్ను స్వగ్రామమైన విజయవాడకు వెళ్లి విచారణ చేపట్టారు. కాగా, గుంటూరులో నాగమణి చెన్ను పేరిట ఓ ప్రముఖ వైద్యురాలు ఉండగా.. ప్రస్తుత నకిలీ వైద్యురాలు నాగమణి గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసినట్లు సమాచారం. ఈ విషయమై చెన్నూరులోని నర్సింగ్ హోం నిర్వాహకుడు సుభాష్ మాట్లాడుతూ నాగమణి వ్యవహరిస్తున్న తీరు, రాస్తున్న మందులపై అనుమానం రావడంతో ఆమె వల్ల రోగులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లోతుగా విచారణ చెన్నూరులో నకిలీ వైద్యురాలి లీల బయటపడడం తో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే ఘట న కాకుండా జిల్లావ్యాప్తంగా ఇంకా ఎవరైనా నకిలీ వైద్యులు ఉన్నారా అనే కోణంలో వారు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగమణిని అదుపులోకి తీసుకున్నట్లు చెన్నూరు ఎస్సై చందర్ వెల్లడించారు. దీనికి సంబంధించి మంచిర్యాల ఏ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోందని ఆయన వివరించారు. -
పోలీసుల అదుపులో నకిలీ వైద్యురాలు
చెన్నూర్ (ఆదిలాబాద్) : స్త్రీల వైద్య నిపుణురాలిగా అవతారమెత్తిన ఓ నర్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్‌లో గత మే 15 వ తేదీన ప్రారంభించిన ఓ నర్సింగ్‌హోంలో నాగమణి చెన్ను అనే మహిళ.. స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలి(ఎంఎస్, ఓబీజీ)గా చేరింది. గత మూడు నెలలుగా రోగులకు సేవలందిస్తోంది. అయితే రోగులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తుండటం, సరైన మందులు రాయకపోవడంతో యాజమాన్యానికి అనుమానం వచ్చింది. ఆసుపత్రి వైద్యులకు ఆమె సర్టిఫికెట్‌పై అనుమానం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాగమణి స్వగ్రామం విజయవాడకు వెళ్లి విచారణ చేపట్టారు. గుంటూరులో నాగమణి చెన్ను అనే వైద్యురాలు లేదని, ఈ నాగమణి గుంటూరు ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా మాత్రమే పని చేసిందని తెలిసింది. నకిలీ సర్టిఫికెట్‌తోపాటు రిజిస్ట్రేషన్ నంబరు 65699తో చెన్నూర్‌లో పని చేసింది. హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెంట్ ద్వారా ఇక్కడ చేరింది. నాగమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెన్నూర్ ఎస్సై చందర్ తెలిపారు. -
ప్రేమ కోసమై...వేషం మార్చెను!
గాంధీలో హల్చల్ చేసిన మహిళ అరెస్ట్ హైదరాబాద్ : ప్రేమ... ఎంత పనైనా... ఎలాంటి సాహసమైనా చేయిస్తుందనడానికి... ఏ వేషమైనా వేయిస్తుందనడానికి ఉదాహరణ ఆ మహిళ ఉదంతం. ప్రియుడితో చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఆడిన నాటకం... ఆమెను చిక్కుల్లో పడేసింది. ఏకంగా జైలు పాలు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి చిలకలగూడ డీఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ...సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సోమవారం డాక్టర్ వేషంలో హడావుడి చేసిన మహిళ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆమె ఆ అవతారం ఎత్తడానికి కారణం ‘ప్రేమ’ని పోలీసుల వద్ద వెల్లడించింది. ఆమె పేరు కె.శివాని(33). మహబూబ్‌నగర్‌లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఆమె స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయాగా పని చేసేది. స్థానికుడైన బాలయ్యతో 2002లో శివానికి వివాహమైంది. ఆరేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితం భర్త బాలయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుని బంధువుల వద్ద ఉంచి... కొద్ది నెలల క్రితం నగరానికి వలస వచ్చిన ఆమె కర్మాన్‌ఘాట్‌లో గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తాను గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నట్టు అందరికీ చెబుతుండేది. ఈ క్రమంలో బేగంపేటకు చెందిన ఓ యువకునితో (20) పరిచయం ఏర్పడి... ప్రేమగా మారింది. ప్రియునితో కూడా గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తానని చెప్పింది. ఆస్పత్రికి వస్తానని ప్రియుడు అడుగుతుండగా... కొద్ది రోజులుగా దాట వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వైద్యులు వేసుకునే ఏప్రాన్, స్టెత్‌స్కోప్ కొనుగోలు చేసింది. సోమవారం ఉదయం ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తుంటానని... అక్కడికి రమ్మని ప్రియునికి ఫోన్ చేసింది. అతనితో చెప్పినట్టే అక్కడ వైద్యురాలి వేషంలో హల్చల్ చేస్తుండగా... సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఆప్పగించారు. ప్రియుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు సంగతి బయటపడింది. గాంధీ ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు శివానీని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని... ఈ ఘటనలో ప్రియుడి ప్రమేయం లేనట్టు తేలిందని డీఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
నకిలీ వైద్యుని లీలలపై విచారణ
నల్లజర్ల రూరల్: నల్లజర్లలో నకిలీ వైద్యుడు జువ్వాల రమేష్‌బాబు లీలలపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం విచారణ ప్రారంభించింది. నల్లజర్లలో జువ్వల రమేష్ పేరుతో వైద్యునిగా చలామణి అవుతూ తన వైద్యశాలలో నర్సుగా చేరిన యంట్రపాటి రాజేశ్వరి(21)(అలియాస్)కవితను మాయమాటలతో నమ్మించి, మోసగించడంతో ఆ యువతి మృతి చెందిన విషయం విదితమే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి సీ.హెచ్.నాగేశ్వరావు, తాడేపల్లిగూడెం క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత, నల్లజర్ల పీహెచ్సీ డాక్టర్ జి.సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో నబీపేట వెళ్లిన ఈ బృందం మృతురాలి తల్లిదండ్రులు సుబ్బారావు, సంతోషంల నుంచి వివరాలు సేకరించారు. ఏడాదిన్నర క్రితం నుంచి తమ కుమార్తె నర్సుగా అక్కడ పని చేస్తోందని ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి పేరుతో వైద్యుడు రమేష్ బాబు మోసం చేశారని రాజేశ్వరి తల్లితండ్రులు అధికారులకు వివరించారు. రెండుసార్లు గర్భస్రావం చేయించి నట్టు తమకు చెప్పిందని తమ కుమార్తెను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గర్భస్రావం వికటించడం వల్లే తమ కుమార్తె మృతి చెందినట్టు చెప్పారు. దీనిపై డీఈఎంవో నాగేశ్వరావు మాట్లాడుతూ క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత ప్రాథమిక విచారణ చేశారని, అనంతర విచారణకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి తనను నియమించినట్టు చెప్పారు. జువ్వలరమేష్ క్యాలిఫైడ్ డాక్టరు కాదని తమ విచారణలో తేలిందన్నారు. ఆసుపత్రి నిర్వహించడానికి గాని అక్కడ వైద్యం చేయడానికి గాని అతనికి ఎటువంటి అనుమతి లేదన్నారు. రమేష్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదు పెడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 282 ఆసుపత్రులకు,174 ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. 16 క్లస్టర్ల పరిధిలో ఉన్న అడిషనల్ డీఎంహెచ్వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారన్నారు. అనధికార ఆసుపత్రుల నిర్వహణపై సర్వే జరిపిస్తున్నామన్నారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు తమ పరిధులు దాటి వైద్యం చేయరాదన్నారు. అనంతరం వైబీ ఆసుపత్రిని పరిశీలించగా అనధికారికంగా మందులు విక్రయించడం, ఆపరేషన్లు చేయడం వంటి విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆసుపత్రిని పోలీసులతో సీజ్ చేయించారు. వీరితో పాటు నబీపేట సర్పంచ్ కాశీ, క్లస్టర్ విద్యాధికారి వి.వి.శ్రీరామ్మూర్తి, సూపర్వైజర్ సుభాకర్, ఏఎన్ఎంలు ఉన్నారు. మరింత మంది ‘శంకర్‌దాదాలు’ తణుకు : నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రి నిర్వహిస్తూ అధికారుల తనిఖీలో బట్టబయలైన తణుకు పట్టణానికి చెందిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ ఉదంతం... నల్లజర్లకు చెందిన జువ్వాల రమేష్ అనే నకిలీ డాక్టర్ వైబీ ఆసుపత్రి పేరుతో వైద్యం చేస్తున్న వ్యవహారం... ఇలా జిల్లాలో నకిలీ డాక్టర్లు వైద్యవృత్తిలో కొనసాగుతున్న తీరు వైద్య రంగాన్నే విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో ఈ తరహా వైద్యులు మరింత మంది ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తణుకు పట్టణానికి చెందిన మరో ప్రైవేటు వైద్యుడు తనకు సర్టిఫికెట్లు లేవంటూ జిల్లా వైద్యాధికారులను ప్రాధేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వైద్యుడు గత 15 రోజులుగా ఆసుపత్రికి రాకుండా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే శ్రీకాంత్, రమేష్‌లాంటి ‘శంకర్‌దాదాలు’ పుట్టుకొస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆసుపత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ కమిటీలు సమావేశమై చర్చించుకున్న దాఖలాలు లేవు. మరి కొందరు వైద్యులు ఎండీ కోర్సు మధ్యలో నిలిపేసినప్పటికీ ప్రముఖ వైద్యుల జాబితాలోనే కొనసాగుతుండటం విశేషం. కొందరు వైద్యులు తాము చదువుతున్న కోర్సు మధ్యలో నిలిపివేసినా... లేక కోర్సు చదువుతున్నప్పటికీ తమ డిగ్రీలను బ్రాకెట్లో పెట్టుకుంటూ ప్రజలను,అధికారులను మభ్యపెడుతున్నారు. అందేంటని ప్రశ్నిస్తే ఇంకా కోర్సు పూర్తి కాలేదు అందుకనే డిగ్రీను బ్రాకెట్లో పెట్టానని తణుకు పట్టణానికి చెందిన ఒక వైద్యుడు సమాధానం ఇవ్వడం గమనార్హం. -
నకిలీ డాక్టర్‌పై గూండా చట్టం
చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నైలో నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించిన కేసులో ఇటీవల అరెస్టయిన ఆనందకుమార్పై గూండా చట్టం మోపారు. ఆనంద్ కుమార్ విజయవాడకు చెందిన వ్యక్తి. ఏడాది పాటు అమలయ్యేలా ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు నగర కమిషనర్ జార్జ్ శుక్రవారం తెలిపారు. చెన్నై కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి తనతో సహా మరికొంత మంది దగ్గర ఆనందకుమార్, అతని భార్య నిర్మల రూ.33.65 లక్షలు తీసుకుని మోసగించారని అంబత్తూరుకు చెందిన కామరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దంపతులను గత నెల 23వ తేదీన అరెస్ట్ చేశారు. ఆనందకుమార్ గుంటూరు వైద్య కళాశాలలో 2007-08 సంవత్సరంలో మాత్రమే వైద్యవిద్య చదివి, తర్వాత మానేశాడు. నర్సింగ్ పూర్తి చేసిన భార్య నిర్మల సహా 2009లో చెన్నై విరుగంబాకం చేరుకుని డాక్టర్ అవతారం ఎత్తాడు. భార్య నిర్మల సైతం నకిలీ సర్టిఫికెట్తో నర్సింగ్ స్కూల్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దంపతులు ప్రస్తుతం చెన్నై పుళల్ జైలులో ఉన్నారు. ప్రాథమిక విచారణలో ఆనందకుమార్ పలు మోసాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాదిపాటు గూండా చట్టం అమలు చేసినట్లు కమిషర్ తెలిపారు. -
నకిలీ వైద్యుడి అరెస్ట్
చిక్కడపల్లి, న్యూస్‌లైన్: తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యుడిగా చెలామణి అవుతూ ఇటు ప్రజల్ని..అటు వైద్యాధికారులను మోసగిస్తున్న వక్తిని చిక్కడపల్లి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పరారీలో ఉన్న ఇతని భార్య కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణరాజు, డీఎస్ఐ ఎ.నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కొండ వెంకటరమణ అలియాస్ ఆరెళ్ల వెంకటరమణ (48) పేర్లు మార్చుకుంటూ వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. కాగా, మొదటి భార్య షేక్ అబీబ్కి చెల్లించాల్సిన మనోవర్తిని ఎగ్గొట్టేందుకు పథకం వేశాడు. తన పేరు మీద ఉన్న కారును చిక్కడపల్లికి చెందిన తోట రామయ్యకు విక్రయించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఈ విషయం తెలిసిన రామయ్య చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు ఫిర్యాదు మేరకు వెంకటరమణ, అతడి రెండో భార్య కల్పనపై పలు స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిసింది. తప్పుడు పత్రాలతో ఇద్దరూ పలు చోట్ల క్లినిక్‌లు నిర్వహించారు. వైద్యాధికారులు దాడులు చేసిన ప్రతి సారి తమ మకాన్ని మరో చోటికి మార్చేవారు. ఇలా రెహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడలో వైద్యులుగా చెలామణి అవుతున్నారు. వీరిపై ఫిర్యాదులందడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ నరేంద్రుడు తనిఖీ చేసేందుకు వెళ్లగా క్లినిక్‌ను మూసేశారు. వారి వద్ద సరైన సర్టిఫికెట్లు లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఈనెల 16 లోగా వైద్య వృత్తికి సంబంధించిన సర్టిఫికెట్లను చూపాలని పేర్కొన్నారు. అయినా మోసాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుండగా చిక్కడపల్లి పోలీసులు సోమవారం యూసుఫ్‌గూడలో వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఇతడి రెండో భార్య కల్పన పరారీలో ఉంది. వీరిపై పంజ గుట్ట, మాదాపూర్, చిలకలగూడ, చిక్కడపల్లి తదితర పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి. -
నకిలీ డాక్టర్‌పై కొనసాగుతున్న విచారణ
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఐదు రోజుల క్రితం హన్మకొండ పోలీసులు నకిలీ డాక్టర్ పేరుతో అదుపులోకి తీసుకున్న ఎండకానలజిస్ట్ హసన్‌భూపతి వ్యవహారంపై హన్మకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కాకాజీకాలనీలోని శ్రీసాయి ఆస్పత్రిపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాను అసలు డాక్టర్నేనని, తన ఒరిజినల్ సర్టిఫికెట్లు తన స్వస్థలమైన తమిళనాడులో ఉన్నాయని చెప్పడంతో ఒక వ్యక్తి పూచికత్తు మేరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల కొరకు హసన్భూపతిని పంపినట్లు హన్మకొండ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సద రు నకిలీ డాక్టర్ పరారైనట్లు మీడియాలో విసృ్తతంగా ప్రచా రం జరిగింది. ఈ విషయమై సీఐ వివరణ ఇస్తూ ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం మాత్రమే పంపించామని, అవి నకిలీవని తే లితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నకిలీ డాక్టర్ గుట్టు రట్టు
వరంగల్, న్యూస్‌లైన్ : ఎలాంటి విద్యార్హతలు లేకుండా రోగుల కు వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు బుధవారం పట్టుకున్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుం చి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై దా డులు నిర్వహించి వాటిని కూడా సీజ్ చేశారు. డీ ఎంహెచ్ఓ కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన హసన్‌భూపతి హన్మకొండ కాకాజీకాలనీలో కొన్నేళ్ల క్రితం శ్రీసాయి ఆస్పత్రిని ఏ ర్పాటు చేసుకుని ఎండోక్రైనాలజీ డీఎంగా చెలామణి అవుతున్నాడు. అయితే హసన్‌భూపతి నకిలీ వైద్యుడని, ఆయనపై విచారణ చేపట్టాల ని ఐఎంఏ, అప్నా సంఘాలు ఇటీవల డీ ఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయన బుధవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా హసన్‌భూపతి వద్ద డీఎం ఎండోక్రైనాలజీకి సంబంధించిన ఎలాంటి అర్హత సర్టిఫికెట్లు లభించకపోవడంతో అతడిని నకిలీ డాక్టర్‌గా గుర్తించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అలాగే ఆస్పత్రికి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని సీజ్ చేసినట్లు చెప్పారు. కాగా, ఇదే కాలనీలోని భవానీ ఆస్పత్రికి కూడా వైద్య ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరావు విలేకరుల తో మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఆస్పత్రులను నిర్వహిస్తున్నందుకు శ్రీసాయి, భవానీ ఆస్పత్రులను సీజ్‌చేసినట్లు చెప్పారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించుకుని ఎండోక్రైనాలజీ డాక్టర్‌గా చెలామణి అవుతున్న హసన్‌భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ వైద్యం చేసే వారిపై కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శేషుమాధవ్ పాల్గొన్నారు. -
నకిలీ వైద్యుడి అరెస్ట్
పిఠాపురం, న్యూస్‌లైన్ : జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరునని నమ్మించి.. పనికిరాని మందులతో రోగులకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని బుధవారం పిఠాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎస్.రాంబాబు స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన మహమ్మద్ రసూల్ అలియాస్ ఫకీర్ అహ్మద్ (అభిచంద్) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. నల్లగొండ జిల్లా కోదాడలో ఓ ఆర్ఎంపీ వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. వైద్యంలో కొద్దిగా మెలకువలు నేర్చుకున్న అతను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎ.మల్లవరానికి మకాం మార్చాడు. అక్కడ ఆర్ఎంపీ అవతారమెత్తాడు. స్థానికులతో నమ్మకంగాఉంటూ, గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి మొత్తం రూ.70 వేలు వరకు వసూలు చేశాడు. ఎంతకీ గ్యాస్ కనెక్షన్లు రాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అతడిని నిలదీశారు. అతడు మోసం చేశాడని తెలుసుకుని వారు అన్నవరం పోలీసులకు గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో నిందితుడిని అరెస్టు చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అదే గ్రామంలోని సబ్ జైలులో నాలుగు నెలల పాటు ఉన్నాడు. అతనికి ఎవరూ పూచీకత్తు ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో బయటకు వచ్చిన నిందితుడు పిఠాపురం మండలం రాపర్తిలో ఉన్న తన అన్న కూతురి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరుగా కొత్త అవతారమెత్తాడు. తన పేరు ఎండీ రసూల్ అని, గ్రామా ల్లో రోగులకు సేవలందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా తనను నియమించిందని నకిలీ విజిటింగ్ కార్డు, ఐడెంటిటీ కార్డులు చూపించి అక్కడి రోగులను, స్థాని కులను నమ్మించాడు. సాధారణ మందులనే ఎయిడ్స్‌కు సంబంధించినవని చెబుతూ రోగుల నుంచి అధిక మెత్తంలో డబ్బు గుంజేవాడు. ఇక్కడ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి స్థానికులు ఒకొక్కరి నుంచి రూ.1500 చొప్పున సుమారు రూ.24 వేలు వసూలు చేశాడు. చివరకు స్థానిక పాస్టర్ కె.వీరబాబు బైక్ దొంగిలించి ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. వీరబాబు ఫిర్యాదు మేరకు పిఠాపురం రూరల్ పోలీ సులు కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం సామర్లకోటలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నకిలీ విజిటింగ్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, స్టెతస్కోపు, నల్లగొండ జిల్లా కోదాడ గ్రామ పంచాయతీ స్టాంపు, నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక గ్రామాల్లో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల వివరాలు తెలుసుకుని, వారిని నకిలీ మందులతో మోసం చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.