బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం | Fake doctor cheats woman through matrimonial site | Sakshi
Sakshi News home page

బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం

Published Fri, Sep 30 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం

బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం

హైదరాబాద్ : వెబ్‌సైట్ వేదికగా బాగ్దాలో ప్రముఖ డాక్టర్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ లెక్చరర్‌కు ఎర వేశాడు. 'ఖరీదైన పార్శిల్' పేరు చెప్పి రూ.34.5 లక్షలు దండుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని బేగంపేటలో ఉన్న ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె ఈ ఏడాది ఓ మాట్రిమోనియల్ సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది.

ఈ ప్రొఫైల్‌ను లైక్ చేసిన ఓ వ్యక్తి..ఆమెతో సంప్రదింపులు ప్రారంభించాడు. ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా తాను బాగ్దాద్లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం వివాహానికి సమ్మతమంటూ సందేశం ఇచ్చాడు. పెళ్ళి కోసం అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. పూర్తిగా ఆ మాయగాడి మాటల వల్లో పడిన ఆ యువతి అవన్నీ నిజమని నమ్మారు.

తాను బాగ్దాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి నిర్మాణం చేపడతానని, అందుకు అవసరమైన నిధులు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాను రావడానికి ముందే తన వద్ద ఉన్న డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గో పార్శిల్ రూపంలో పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది మర్చిలో ఓ పార్శిల్‌ను పంపించానంటూ సందేశం ఇచ్చాడు.

ఇది జరిగిన రెండుమూడు రోజులకు ముంబై నుంచి కస్టమ్స్ అధికారి చేస్తున్నట్లు బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందంటూ చెప్పిన సదరు అధికారి.. దాన్ని క్లియర్ చేయడానికి పన్ను రూపంలో కొంత చెల్లించాలంటూ చెప్పారు. ఆ యువతి ఆ మాటలు నమ్మడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి అందులో నగదు డిపాజిట్ చేయించారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు వివిధ ఫోన్ నంబర్ల నుంచి అనేక విభాగాల పేర్లతో ఫోన్లు రావడం, బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడం జరిగింది.

మొత్తమ్మీద పది బ్యాంకు ఖాతాల్లో రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసిన లెక్చరర్ చివరకు తాను మోసపోయానని గ్రహించింది. దీంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన పది బ్యాంకు ఖాతాలు గుజరాత్, ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు.

సాధారణంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలు, నకిలీ చిరునామాలతోనో, దళారుల్ని ఏర్పాటు చేసుకునే తెరుస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్స్‌ను చూసిన వెంటనే నమ్మవద్దనీ, ఎవరినీ నేరుగా కలవకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా వ్యక్తిగత వివరాలు చెప్పడం, నగదు డిపాజిట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు వద్దని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement