సాక్షి, సిటీబ్యూరో: వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రామయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్లా కూకట్‌పల్లిలోని సిఫా ఎలక్ట్రికల్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను డేటింగ్ వెబ్‌సైట్‌లో వైద్యుడిగా నకిలీ ఐడీ సృష్టించి యువతులు, వివాహితులతో చాటింగ్ చేసేవాడు.
అనంతరం వారి ఫొటోలు, వీడియోలు తీసుకొని తన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకునేవాడు. డాక్టర్ కార్తీక్ రెడ్డి పేరుతో నకిలీ ఐడీ సృష్టించిన అతను నగరంలోని ఓ ప్రధాన ఆస్పత్రిలో అనస్తటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుని ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చాటింగ్ చేసిన అతను బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీనిని గ్రహించిన అబ్దుల్లా నీ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నీ భర్తతో పాటు కుటుంబసభ్యుల ముందు పరువు తీస్తానంటూ బెదిరించాడు. రూ.4 లక్షలు ఇవ్వడంతో పాటు తన కోరిక తీర్చాలని కోరారడు. దీంతో బాధితురాలు గత నెల 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మంగళవారం పుప్పలగూడలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment